
ఏపీలో ఉద్యోగానికి భలే క్రేజ్
రాష్ర్టస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీలో ఇప్పటివరకు తెలంగాణకు చెందిన ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు.
పదవీ విరమణ వయస్సు పెంచడమే కారణం
హైదరాబాద్: రాష్ర్టస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీలో ఇప్పటివరకు తెలంగాణకు చెందిన ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఏపీప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచడమే ఇందుకు కారణం. అదనంగా రెండేళ్లపాటు ఉద్యోగం చేయొచ్చనే ఆలోచనతో తెలంగాణకు చెందిన 1,141 మంది ఏపీకి ఆప్షన్లు ఇచ్చారు.
ఈ ఆప్షన్ల ఆధారంగా తెలంగాణకు చెందిన 1,141 మందిని కమలనాథన్ కమిటీ ఏపీకి పంపిణీ చేసింది. ఇప్పటివరకు 113 విభాగాలకు చెందిన 16,930 మందిని ఇరు రాష్ట్రాలకు తాత్కాలికంగా పంపిణీ చేసింది. ఉద్యోగుల స్థానికతను పరిశీలిస్తే తెలంగాణకు చెందిన 1,260 మంది ఉద్యోగులను ఏపీకి కేటాయించారు.
ఏపీకి చెందిన 564 మంది ఉద్యోగులను తెలంగాణకు కేటాయించారు. ఏపీకి ఇప్పటి వరకు కేటాయించిన ఉద్యోగుల్లో 53 మంది రెండు రాష్ట్రాలకు ఆప్షన్లు ఇచ్చారు. అలాగే ఏ రాష్ట్రానికీ ఆప్షన్లు ఇవ్వని 262 మందిని ఏపీకి కేటాయించారు. తెలంగాణకు కేటాయించిన ఉద్యోగుల్లో 39 మంది రెండు రాష్ట్రాలకు అప్షన్లు ఇవ్వగా.. ఏ రాష్ట్రానికీ ఆప్షన్లు ఇవ్వని ఉద్యోగులు 207 మంది ఉన్నారు.