
సమావేశంలో మాట్లాడుతున్న పువ్వాడ
పరిపాలన సౌలభ్యం పేరుతో జరుగుతున్న జిల్లాల విభజన వెనుక కొందరి రాజకీయ స్వార్థం దాగుందని, విభజన పేరుతో జిల్లాకు మరోసారి అన్యాయం జరుగుతుందని సీపీఐ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు ఆరోపించారు.
- సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు
ఖమ్మం మయూరిసెంటర్ : పరిపాలన సౌలభ్యం పేరుతో జరుగుతున్న జిల్లాల విభజన వెనుక కొందరి రాజకీయ స్వార్థం దాగుందని, విభజన పేరుతో జిల్లాకు మరోసారి అన్యాయం జరుగుతుందని సీపీఐ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం సీపీఐ కార్యాలయంలో జరిగిన సమితి సమావేశంలో పువ్వాడ మాట్లాడుతూ జిల్లా విభజనలో హేతుబద్ధత లోపించిందని, పూటకో ప్రకటనతో గందరగోళం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్‌లో కలపడం వెనుక ఏ ప్రాంత ప్రజల అభివృద్ధి దాగి ఉందని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ నాయకుల స్వార్థం కారణంగా జిల్లా ప్రజలు విలువైన ఖనిజ సంపదను పొగొట్టుకోవాల్సి వస్తోందన్నారు. ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న భ్రమలు తొలగిపోతున్నాయని, ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదని, కార్పొరేట్లకు ప్రజా సంపదను కట్టబెట్టేందుకు బ్యాంక్ విలీన ప్రక్రియ మొదులుపెట్టారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు కూనంనేని సాంబశివరావు, టీవీ చౌదరి, బాగం హేమంతరావు, ఎస్‌కె సాబీర్‌పాషా పాల్గొన్నారు.