జీతాల కోసం ట్యాంక్ ఎక్కారు
వైఎస్సార్ జిల్లా : ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రి ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వినూత్న నిరసనకు దిగారు. జీతాలు ఇవ్వలేదని వారంతా సోమవారం ట్యాంక్ పైకి ఎక్కి ఆందోళన చేశారు. వివరాలు...స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఏడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఈ క్రమంలో 23 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఆస్పత్రిలోని ట్యాంక్ పైకి ఎక్కి తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రి సూరింటెండెంట్ బుచ్చిరెడ్డి, ఆర్‌ఎంఓ డేవిడ్ సంఘటన స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా వారు వినలేదు.
విషయం తెలుసుకున్న డీఎస్పీ పూజిత ఆస్పత్రి వద్దకు చేరుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అధికారులు సమస్య పరిష్కరిస్తామని చాలా సార్లు హామీ ఇచ్చారని, అయినా ఇంతవరకు జీతాలు చెల్లించలేదని వారు చెప్పారు. దీంతో వైద్యవిధాన పరిషత్ కమిషనర్ కనకమ్మతో డీఎస్పీ ఫోన్లో మాట్లాడారు. ఇది రాష్ట్రవాప్త సమస్య అని, త్వరలో వారికి జీతాలు అందేలా చర్యలు తీసుకుంటామని కమీషనర్ హామీ ఇచ్చారు. వారం రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ చెప్పడంతో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఆందోళన విరమించారు.
(ప్రొద్దుటూరు)