చల్లగా జెల్ల! | Outsourcing Staff orders to sack staff | Sakshi
Sakshi News home page

చల్లగా జెల్ల!

Apr 1 2016 1:22 AM | Updated on Aug 10 2018 8:16 PM

‘బాబు వస్తే జాబు వస్తుంది..’ అని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు మాటెలా ఉన్నా.. ‘బాబు వచ్చారు జాబు పీకేశారు..’

టైపిస్టు కమ్ కంప్యూటర్ ఆపరేటర్లు కూడా చేరారు. వారిని తొలగిస్తూ ఫిబ్రవరి 29న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. నెల రోజుల తర్వాత గురువారం జిల్లా అధికారులు ఆ కబురు చల్లగా చెప్పారు. దీంతో ఏంచేయాలో తెలియక ఆ ఉద్యోగులు కాకినాడలో కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు.
 
 రోస్టర్ విధానంలోనే నియమించినా..
 జిల్లాలోని మండల కార్యాలయాలను కంప్యూటరీకరించిన తరువాత టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు కీలకమయ్యాయి. ఈ మేరకు 2006లో 40 మందిని కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఇంటర్వ్యూ చేసి రోస్టర్ విధానంలోనే నియమించింది. తర్వాత 2011లో మరో 30 మంది అదే విధానంలో నియమితులయ్యారు. వారంతా డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైనవారే. ఔట్ సోర్సింగ్ పోస్టు అయినా సరే ఎప్పటికైనా రెగ్యులరైజ్ అవుతుందనే ఆశతో కాలం నెట్టుకొస్తున్నారు. నెల జీతం రూ.8,400 అయినాసరే ఆర్నెల్లకో, మూడు నెలలకో చెల్లిస్తున్నా సరే.. కుటుంబాలను ఎన్నో కష్టాలకోర్చి పోషించుకుంటున్నారు.
 
 అరచేతిలో వైకుంఠం చూపించి..
 ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని నిర్దిష్ట కాలపరిమితిలో రెగ్యులర్ చేస్తామని గత ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించారు. ఆ హామీ నెరవేర్చుతారన్న ఆశతో జిల్లాలోని మండల కార్యాలయాల్లో పని చేస్తున్న 70 మందితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 640 మంది టైపిస్టు కమ్ కంప్యూటర్ ఆపరేటర్లంతా ముఖ్యమంత్రికి పలుమార్లు వినతిపత్రం సమర్పించుకున్నారు. 
 
 తమను రెగ్యులర్ చేయడంతో పాటు కనీస వేతనం అమలు చేయాలని మొర పెట్టుకున్నారు. అలాచేస్తే మండల కార్యాలయాల్లో విధులు సక్రమంగా నిర్వహించడంలో ఎంతో తోడ్పాటు అందిస్తామని, అవినీతికి ఆస్కారం లేకుండా బాధ్యతలు నిర్వహిస్తామని విన్నవించుకున్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఆలోచించింది. వారందరినీ తొలగిస్తూ గత ఫిబ్రవరి 29వ తేదీనే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని నెల రోజులు ఆలస్యంగా గురువారం జిల్లా ఉన్నతాధికారులు చెప్పేసరికి వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.
 
  హుటాహుటిన కొంతమంది కలెక్టరేట్‌కు చేరుకొని కలెక్టర్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. ‘క్వాలిఫైడ్ వ్యక్తులకే ఉద్యోగాలిచ్చినప్పుడు మమ్మల్ని ఇప్పుడిలా అర్ధంతరంగా రోడ్డున పడేయడం భావ్యం కాదు. తహసీల్దారు డిజిటల్ సిగ్నేచర్ సహా మండల కార్యాలయంలో పనులన్నీ మేమే చేస్తాం. అయినా ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు ముగిసిందని చెప్పి ఎలా తొలగిస్తారు?’ అని రాజమహేంద్రవరానికి చెందిన టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో కంప్యూటర్ ఆధారిత పనులు చేసేవారిని ఒకేసారి తొలగిస్తే రోజువారీ సేవలకు ఆటంకం కలుగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement