సొంతింటి కలకు చంద్ర గ్రహణం
సెంటు స్థలం ధర లక్షలు పలుకుతోంది. నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. బాడుగింటి అద్దె చుక్కలు చూపుతోంది. రెక్కలు ముక్కలు చేసుకున్నా.. ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లని పరిస్థితుల్లో నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతిల్లు కలగానే మిగులుతోంది. ‘ఇందిరమ్మ’ పథకంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎందరికో గూడు చూపినా..
టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘చంద్ర’ గ్రహణం పట్టుకుంది.
కర్నూలు(అర్బన్): ప్రతి పోదోడి సొంతింటి కలను నెరవేర్చాలనే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయానికి అంచెలంచెలుగా తూట్లు పొడుస్తున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘ఇందిరమ్మ’ పథకం అనేక ఆటుపోట్లను ఎదుర్కోగా.. ఇటీవల అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటికే మోసం తీసుకొచ్చారు. కొత్త ఇళ్ల మాట దేవుడెరుగు.. కట్టుకున్న ఇళ్లకు బిల్లులూ మంజూరు చేయకపోవడం లబ్ధిదారులను ఆర్థిక ఇక్కట్లకు గురిచేస్తోంది. ఇదే సమయంలో ఖర్చులు తగ్గించుకునే నెపంతో సిమెంట్ గోడౌన్లను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటి నిర్మాణంలో కీలకమైన సిమెంట్ సరఫరా నిలిచిపోవడంతో నిర్మాణాలు అటకెక్కే పరిస్థితి నెలకొంది. జిల్లాలో మొత్తం 13 గోడౌన్లు మూతపడనుండగా.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక గోడౌన్లకు సిమెంట్ సరఫరా చేయకపోవడం ప్రభుత్వ వైఖరిని చెప్పకనే చెబుతోంది. కొత్త ఇళ్ల ఊసే లేనందున గోడౌన్లలో నిల్వ ఉన్న సిమెంట్‌ను పంపిణీ చేసి మూసివేయాలని ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం.
పేదలకు ఇళ్ల నిర్మాణం భారం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని సమెంట్ కంపెనీలతో చర్చించి రాయితీపై సిమెంట్‌ను అందించారు. పలు కంపెనీల నుంచి బస్తా సిమెంట్‌ను రూ.153.50లకు కొనుగోలు చేసి రవాణా ఖర్చుతో రూ.158లకు పంపిణీ చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో సిమెంట్ ధర అమాంతం పెరిగిపోవడంతో.. 2011 నుంచి బస్తాపై అంచెలంచెలుగా ధర పెరుగుతూ ప్రస్తుతం రూ.235లకు చేరుకుంది.
జీయో ట్యాగింగ్ పేరిట కొత్త ఇళ్ల మంజూరులో జాప్యం
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జీయో ట్యాగింగ్ సిస్టమ్ కొత్త ఇళ్ల ఆశలపై నీళ్లు చల్లింది. ఇందిరమ్మ లబ్ధిదారులందరినీ ఆధార్‌తో అనుసంధానం చేయడంతో పాటు.. మూడు విడతల ఇందిరమ్మ గృహ నిర్మాణ పథంకంలో చోటు చేసుకున్న అక్రమాలను నిగ్గు తేల్చేందుకు జీయో ట్యాగింగ్ సిస్టమ్‌ను టీడీపీ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. ఈ సిస్టమ్‌కు సంబంధించి ఇప్పటి వరకు సంబంధిత అధికారులకు ఎలాంటి శిక్షణనివ్వలేదు. అధికారులకు రాష్ట్ర స్థాయిలో శిక్షణనిచ్చిన అనంతరం వారు జిల్లాలోని క్షేత్ర స్థాయి అధికారులకు శిక్షణనివ్వాల్సి ఉంది. నెలాఖరు వరకు బదిలీలకు అవకాశం ఉన్నందున ఉన్నతాధికారులు శిక్షణ విషయంలో వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
అందని బిల్లులు.. ఆగిన నిర్మాణాలు
వివిధ కారణాలతో గత ఐదు నెలలుగా గృహ నిర్మాణాలకు సంబంధించి బిల్లులను కొత్త ప్రభుత్వం నిలిపేసింది. ఈ కారణంగా జిల్లాలోని 53వేల మంది లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధికారికంగా రూ.22 కోట్లు.. అనధికారికంగా మరో రూ.14 కోట్లు ప్రభుత్వం లబ్ధిదారులకు బకాయి పడినట్లు సమాచారం. ఆపసోపాలు పడి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని భావించిన లబ్ధిదారులు ప్రభుత్వ తీరుతో దిక్కులు చూస్తున్నారు. ఎక్కడికక్కడ నిలిచిపోయిన నిర్మాణాలను చూసి వారంతా గగ్గోలు పెడుతున్నారు.