వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన | watchfires performance under the YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన

Published Sat, Dec 21 2013 2:14 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

watchfires performance under the YSRCP

కర్నూలు, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని విభజిస్తే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. తెలుగు ప్రజలను రెండుగా చీల్చేందుకు కుట్ర పన్నిన కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ శుక్రవారం రాత్రి వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక కొండారెడ్డి బురుజు సమీపంలోని తెలుగుతల్లి విగ్రహం నుంచి పాతబస్తీలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వరకు చేపట్టిన ప్రదర్శనలో పార్టీ శ్రేణులతో పాటు సమైక్యవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా తెలుగుతల్లి విగ్రహానికి పూలదండలు వేసి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ టీ-బిల్లును పార్లమెంటుకు పంపితే బరువు దిగిపోతుందన్నట్లుగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వైఖరి ఉంటోందన్నారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలంతా ఒకవైపు, సీమాంధ్ర ఎమ్మెల్యేలు మరోవైపు.. వీరితో పాటు చంద్రబాబు నాయుడు రెండుకళ్ల సిద్ధాంతం పాటిస్తూ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. విభజనతో రెండు ప్రాంతాలకు తీరని నష్టం తప్పదని తెలిసినప్పటికీ రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాటకం ఆడుతున్నాడన్నారు. అసెంబ్లీలో టీ-బిల్లును ఓడించిన తర్వాత పదవులకు రాజీనామా చేస్తామంటూ కేంద్ర, రాష్ట్ర సీమాంధ్ర మంత్రులు నాలుగు నెలలుగా ప్రజలను మోసగిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వారిని భగవంతుడు కూడా క్షమించడని హెచ్చరించారు. రాళ్లతో కొట్టి తరమడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రం విడిపోతే ప్రధానంగా యువకులు, ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర చిన్న తరహా నీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ రాజకీయ మనుగడ కోసం పాకులాడుతున్నారని విమర్శించారు.

రాహుల్‌గాంధీని ప్రధాని పదవిలో కూర్చోబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడుతున్న డ్రామాలకు ఇకనైనా తెరదించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రాష్ట్ర సమైక్యతకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ స్థాయిలో మద్దతు కూడగడుతున్నారన్నారు. పార్టీలకు అతీ తంగా వ్యవహరించాల్సిన స్పీకర్ నాదెం డ్ల మనోహర్ అధిష్టానం చెప్పినట్లు నడుచుకోవడం తగదన్నారు. సమైక్య తీర్మానానికి నాలుగు నెలలుగా తమ పార్టీ పట్టుబడుతున్నా పెడచెవిన పెడుతుం డటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశా రు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతివ్వాలని కోరారు.

 కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ బాలరాజు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ వివిధ విభాగాల నాయకులు షరీఫ్, కంటు, రవి, మద్దయ్య, రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పులి జాకోబ్, ఎంవి.రమణ, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మునీర్ అహ్మద్, హమీద్, రాజ్‌దార్ ఖాన్, బాబుబై, మక్బుల్, నజీర్, మహేష్ గౌడ్, ట్రేడ్ యూనియన్ నాయకులు రమణ, వైఎస్సార్సీపీ విభాగం జిల్లా కన్వీనర్ నారాయణమ్మ, కాంతమ్మ, సత్యవతమ్మ, సత్యవేదమ్మ, విద్యార్థి విభాగం నాయకులు అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement