
పగబట్టిన పైశాచకత్వం!
అంగారకుడిపై కాలుమోపుతున్నాం. చంద్రమండంలంపై నీటి జాడ కనుగొంటాం అంటున్నాం..! అయినా మనిషి మారలేదు.. మూఢత్వం ముసుగు తీయలేదు.
అంగారకుడిపై కాలుమోపుతున్నాం. చంద్రమండంలంపై నీటి జాడ కనుగొంటాం అంటున్నాం..! అయినా మనిషి మారలేదు.. మూఢత్వం ముసుగు తీయలేదు. కర్మభూమిలో నీతి జాడ విడిచాడు. ఆధునిక ప్రపంచంలో.. అనాగరిక సమాజం ముగ్గురి మహిళలను వెంటాడింది.. వేధించింది. విజ్ఞానం ఆకాశవీధిలో దూసుకెళ్తుంటే.. అజ్ఞానం నడివీధిలో అబలలను వివస్త్రులను చేసింది. పాశవికంగా దాడులు చేసింది. వికృత చేష్టలతో బెదిరించి అమాయకులను ఊరు దాటించింది. చేతబడి అని ముద్ర వేసి వారి జీవితాలను చేష్టలుడిగేలా చేసింది. -సాక్షి ప్రతినిధి, అనంతపురం
అనంతపురం శివారులోని ప్రజాశక్తినగర్.. జూలై 28.. సమయం తెల్లవారుజామున 5.30 గంటలు.. ఊరు, వాడా ఇంకా నిద్దురలోనే ఉంది. ఓ వీధిలో లలిత, హేమావతి, పార్వతి అనే మహిళల ఇళ్లముందు పందిమాంసం, నువ్వులు, పసుపు, కుంకుమ కన్పించాయి. వీటిని ఎవరు మా ఇంటి ముందు పడేశారని వీధిలోని వారిని అడగటమే ఆ ముగ్గురు చేసిన తప్పయింది. దారిన పోయే కంప వీళ్లకు చుట్టుకుంది. ఆ ముగ్గురే వాటిని వీధిలో వేసి చేతబడి చేస్తున్నారని కొందరు కాలనీవాసులు ఆరోపించారు. వాగ్వాదానికి దిగారు.. ఈ గొడవ కాస్తా చిలికి చిలికి గాలివానయింది.
కాలనీవాసులు ఓ స్వామీజీని పిలిపించారు. జరిగిన విషయం అతనికి చెప్పారు. కళ్లు మూసుకుని ఆ ముగ్గురు మహిళలు చేతబడికి పాల్పడుతున్నారని అనుమానం వ్యక్తం చేశాడు. సమయం.. రాత్రి 9.30 గంటలు. ఊరంతా చీకటి.. ఆ కాలనీవాసులు కూడా కటిక చీకటిలోకి వెళ్లిపోయారు. మానవత్వం మచ్చుకైనా కనిపించకుండా పోయింది. కన్నూమిన్నూ కానని మనుషులు.. ఆ ముగ్గురు మహిళలపై పగతీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ ఆడపడుచులను వీధిలోకి లాక్కొచ్చారు. పూర్తిగా వివస్త్రలను చేశారు. అడ్డొచ్చిన పార్వతి భర్త పోతులయ్యను చితకబాదారు.
ఒంటిపై వస్త్రం లేక.. సిగ్గుతో చితికిపోతున్న మహిళలపై భౌతికంగా దాడిచేశారు. శాపనార్థాలు పెడుతూ బూతుపురాణం అందుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి బయల్దేరారు. పోలీసులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న కాలనీ కాపురుషులు చివరి నిమిషంలో ఆ ఆడబిడ్డలకు దుస్తులు ఇచ్చేశారు. పోలీసులు కాలనీ వాసులను చెదరగొట్టారు. బాధితుల ఫిర్యాదుతో అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
బతుకు బరువు..
జరిగిన అవమానాన్ని మరవలేక.. వేదనతోనే బతుకీడుస్తున్నారు ఆ మహిళలు. ఈ ముగ్గురు ఆడపడుచులదీ మూడు గాథలు. లలిత ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త వదిలేయడంతో.. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. హేమావతి భర్త చనిపోవడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయాగా పనిచేస్తూ బతుకీడుస్తోంది. ఇక పార్వతి తన భర్తతో కలసి కూలి పని చేసుకుంటుంది. కాయకష్టాన్ని నమ్ముకుని ఆ దంపతులు జీవిస్తున్నారు.
సీరియల్ ఎటాక్స్..
కొన్ని రోజులు గడిచాయి.. సెప్టెంబర్ 10.. హేమావతి ఆస్పత్రికి వెళ్లింది. గతంలో వికృత చేష్టలతో కలకలం సృష్టించిన దుండగులు మళ్లీ రెచ్చిపోయారు. హేమావతి ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లో విధ్వంసం సృష్టించారు. మరో ఆరు రోజులు గడిచాయి. సెప్టెంబర్ 16 అర్ధరాత్రి.. ఆ దుర్మార్గుల కన్ను పార్వతి ఇంటిపై పడింది. మూకుమ్మడిగా దాడి చేసి ఆమె ఇంటిని తగులబెట్టారు. అర్ధరాత్రి పిల్లలను తీసుకుని ఆ తల్లి.. భర్త, ఇద్దరు పిల్లలతో సహా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఊరు దాటింది.
ఈ సంఘటనతో పోతులయ్య.. పార్వతి, పిల్లలను వదిలి సొంతూరుకు వెళ్లిపోయాడు. వరుస దాడులతో బెంబేలెత్తిన లలిత ఆ అద్దె ఇంటిని వదిలేసి నగరంలోని ఓ కాలనీకి చేరుకుని బతుకు జీవుడా అనుకుంది. సెప్టెంబర్ 29.. ఈసారి హేమావతి ఇంటిని కాల్చేసి చేతులు పైశాచికానందం పొందారు వాళ్లు.. ఉన్న ఇల్లు కాస్తా బూడిదపాలు అవ్వడంతో.. హేమావతి గుండెలవిసేలా రోదించింది.
పోలీసుల విచారణలో ‘చేతబడి’ ఉత్తదే!:
ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేశారు. మహిళలు కాలనీవాసులపై చేతబడి చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని తేల్చారు. లేనిపోని అనుమానాలతో ముగ్గురిని వేధించిన కాలనీ వాసులను మందలించారు. మూఢనమ్మకాలను నమ్మొద్దని వివరించారు. సంఘటన జరిగిన రోజు నుంచి ఇద్దరి పోలీసులను ‘డే అండ్ నైట్’అక్కడే కాపాల ఉంచారు.
జనవిజ్ఞాన వేదిక ద్వారా అవగాహన:
విషయం తెలుసుకున్న జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు ప్రజాశక్తినగర్‌కు వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేశారు. చేతబడి అనేది అపోహ మాత్రమే అని, చేతబడి పేరుతో ఎవ్వరూ ఎవ్వరినీ ఏమీ చేయలేరని వివరించారు. అలాంటి అపోహలతో సాటి మనుషులపై అలా వ్యవహరించడం తగదని హితవు పలికారు.
చేతబడి కాక ఇంకేదైనా కారణముందా?:
ముగ్గురిపై జరిగిన వేధింపులు, దాడులు పరిశీలిస్తే.. వారిని కాలనీ నుంచి వెళ్లగొట్టాలని పథకం ప్రకారం దాడులు చేసినట్టు అనిపిస్తోంది. పార్వతి, హేమావతికి 1.5 సెంట్లలో ఇళ్లు ఉన్నాయి. వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికే ఈ కుట్రలకు పాల ్పడ్డారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.