పచ్చని పంటకు తెగుళ్లు సోకితే ఏం చేయూలి.. ఎలాంటి మందులు పిచికారి చేయూలి.. కొత్తరకాల వంగడాలు సాగు చేయాలంటే...
నూజివీడు, న్యూస్‌లైన్ : పచ్చని పంటకు తెగుళ్లు సోకితే ఏం చేయూలి.. ఎలాంటి మందులు పిచికారి చేయూలి.. కొత్తరకాల వంగడాలు సాగు చేయాలంటే ఎటువంటి సూచనలు పాటించాలనే సందేహాలు ప్రతి రైతుకూ సహజం. దీనికోసం వ్యవసాయూధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగడం.. వారు చెప్పినా సరిగ్గా అర్థంకాకపోవడంతో రైతన్నలు సరైన అవగాహన లేక సాగులో ఇబ్బందులు పడుతుంటారు.
ఇలాంటి వారికోసం సరికొత్త వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఅగ్రీనెట్.జీవోబీ.ఇన్‌లో లాగిన్ అయితే చాలు వ్యవసాయంలో సందేహాలు, సూచనలు పొందవచ్చు. రైతులకు ఉపయుక్తంగా ఉండేందుకు దీన్ని తెలుగులో రూపొందించడం విశేషం. వ్యవసాయ శాఖ సూచనలు, సలహాలు, వాతావరణ పరిస్థితులు, వ్యవసాయశాఖ పథకాలు తదితర అంశాలన్నీ దర్శనమిస్తాయి.
తెలుగులోనే ఉండటం వల్ల సాధారణ చదువున్న వారు సైతం సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌ను చూడటం అలవాటు చేసుకుంటే చాలు రైతులు ఇంట్లో కూర్చునే ఈ-వ్యవసాయంపై అవగాహన పెంచుకోవచ్చు. పంటల సాగులో మరింత ముందుకు వెళ్లడానికి వీలుంది.
ఈ-వ్యవసాయంలో ఏం ఉన్నాయంటే..
పంటల యాజమాన్యం, పచ్చిరొట్ట పైర్లు, సేంద్రీయ వ్యవసాయం, అంతర్‌పంటల సాగు, సమస్యాత్మక భూముల యాజమాన్యం, శ్రీవరి సాగు, అంతర్‌పంటలు, సమగ్ర సస్యరక్షణ, పంటలలో చీడపీడల నివారణ, ప్రభుత్వ పథకాలు, రైతులకు ఇస్తున్న రాయితీలు, భూసార పరీక్షలు, వ్యవసాయ అనుబంధశాఖలు, వాటర్‌షెడ్, యాంత్రీకరణ, జీవ ఇంధనపు మొక్కలు తదితర అంశాలతో పాటు వాతావరణ సూచనలు కూడా ఈ వెబ్‌సైట్‌లో ఉంటారుు. జిల్లాల్లో వ్యవశాయశాఖ, అనుబంధశాఖలకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారి నుంచి మండల వ్యవసాయాధికారి వరకు అందరి ఫోన్ నంబర్లు చూడవచ్చు.
అలాగే వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు, మార్కెట్ ధరలు, భవిష్యత్‌లో ఊహించదగిన ధరల వివరాలు, ఎరువుల ధరల సమాచారం కూడా ఉంటుంది. వ్యవసాయ అనుబంధశాఖలైన ఉద్యానవన, పశుసంవర్ధక, మార్కెటింగ్, పట్టు పరిశ్రమ, అటవీ, విద్యుత్, నీటిపారుదల, మార్కెట్‌ఫెడ్ తదితర శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. పంటల యాజమాన్యంలో భాగంగా వరి, వేరుశెనగ, పత్తి, మొక్కజొన్న, కంది, ఆముదం, చెరకు, పెసర, పొద్దుతిరగుడు, జొన్న, మిరప, సోయాచిక్కుడు, మినుము, నువ్వులు, సజ్జ, శెనగలు, రాగి, కుసుమ తదితర పంటలకు సంబంధించిన తెగుళ్లు, ఆశించే పరుగులు, నివారణ పద్ధతులు తదితర సమస్త సమాచారం అందుబాటులో ఉంటుంది.