నల్లగొండ: తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు చేస్తున్నాం కదా..అని సీమాంధ్రులకు అడిగినవన్నీ ఇస్తే ఊరుకునేది లేదని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభద్రతాభావాన్ని ప్రచారం చేసి, కేంద్ర నాయకత్వాన్ని మోసం చేసేందుకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఢిల్లీలో కుట్ర చేస్తున్నారన్నారు. తెలంగాణ కంటే ఆంధ్ర వెనుకబడినట్లు, జీవోఎం అడిగిన 11 శాఖల సమాచారాన్ని తప్పుగా ఇచ్చేందుకు సచివాలయ అధికారులను కేంద్ర మంత్రులు మేనేజ్ చేసుకున్నారన్నారు. తర్వాత ప్యాకేజీలు పొందేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. వాస్తవానికి తెలంగాణే అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయానికి గురైందని పాల్వాయి చెప్పారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనన్నారు.
తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో ఉండి, సీఎంతో పాటు రచ్చబండలో పాల్గొనకుండా ఢిల్లీకి వెళ్లి సీమాంధ్రుల లాబీయింగ్‌ను తిప్పికొట్టాలన్నారు. నెల రోజుల పాటు పనులన్నీ పక్కన పెట్టి ఢిల్లీలోనే మకాం వేయాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో తెలుగుదేశం పార్టీకి ఇంకా స్పష్టమైన వైకరి లేదన్నారు.