సమస్యలతో సావాసం | Panchayat facilities Problems in Rajam | Sakshi
Sakshi News home page

సమస్యలతో సావాసం

Published Sun, Nov 30 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

సమస్యలతో సావాసం

సమస్యలతో సావాసం

రాజాం.. పారిశ్రామికంగా దూసుకుపోతున్న ఈ నగర పంచాయతీ సౌకర్యాల విషయంలో మాత్రం పంచాయతీల కంటే హీనంగా దగజారిపోతోంది.

 రాజాం.. పారిశ్రామికంగా దూసుకుపోతున్న ఈ నగర పంచాయతీ సౌకర్యాల విషయంలో మాత్రం పంచాయతీల కంటే హీనంగా దగజారిపోతోంది. పంచాయతీ నుంచి 2005లో నగర పంచాయతీ స్థాయికి ఎదిగినా.. ఇప్పటివరకు ఎన్నికలకు.. పాలకవర్గానికీ నోచుకోలేదు. నగర పంచాయతీలో విలీనమైన కొన్ని పంచాయతీలు కోర్టులను ఆశ్రయించడం.. ఆ కేసులు ఇప్పటికీ కొనసాగుతుండటంతో ఎన్నికలకు అవకాశం లేకుండా పోతోంది. ఫలితంగా ప్రత్యేకాధికారుల పాలనే గత్యంతరంగా మారింది. పాలకవర్గాలు లేకపోవడంతో జవాబుదారీతనం లోపించింది. నిధుల మంజూరు, అభివృద్ధి పనుల నిర్వహణపై పర్యవేక్షణ కొరవడి ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోతున్నాయి. సుమారు 45వేల మంది ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు నగర పంచాయతీ కమిషనర్ వెంపటాపు అచ్చెన్నాయుడు ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా నడుం బిగించారు. పలు కాలనీలు, వీధుల్లో కలియదిరిగి ప్రజలతో మమేకమయ్యారు. వారి కష్టాలపై ఆరా తీశారు.
 నేటి వీఐపీ రిపోర్టర్ ప్రజలతో జరిపిన సంభాషణ యథాతథంగా..
 
 సమస్యలు గుర్తించాం.. పరిష్కరిస్తాం
 కోర్టు వివాదం పరిష్కారమైతే పట్టణం జిల్లాలోనే అగ్రగామిగా నిలవడం ఖాయం. పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, విద్యాసంస్థలు ఇక్కడ విస్తృతంగా ఉన్నాయి. నేను ఆరునెలల క్రితం విధుల్లో చేరా. అప్పటి నుంచి అన్ని వార్డుల్లో పర్యటించా. సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాం. రానున్న నిధులతో ఇవి పరిష్కారమవుతాయి. మున్సిపాలిటీ పాలకవర్గం లేకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలందించడం క్లిష్టతరం. అయినా అధికారుల సమష్టి కృషితో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధికి ముందుకెళ్తున్నాం. పట్టణంలో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం. పాలకవర్గం లేకపోయినా ప్రత్యేకాధికారి, ఎమ్మెల్యే సహకారంతో పాలన కొనసాగిస్తున్నాం. మొక్కలు నాటే కార్యక్రమం, వాటి సంరక్షణ, తడిచెత్త, పొడిచెత్త వేరుచేసి పారబోయడం వంటి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. రూ.39 కోట్లతో నిర్మించిన సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు వచ్చే నెల నుంచి సేవలు ప్రారంభిస్తాయి. అప్పుడు పట్టణానికి నిరంతర నీటి సరఫరా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
 
 కమిషనర్: ఏమ్మా.. నీ పేరేంటి..
 ఎలా ఉన్నారు.. సమస్యలు ఏమైనా ఉన్నాయా?...
 బంగారమ్మ: నేను ఇప్పిలి బంగారమ్మ ను బాబు. వృద్ధురాలిని. పింఛను రా వడం లేదు. రేషన్‌కార్డు లేదు. కోటా ఆగిపోయింది. బాధలు పడుతున్నాను.
 కమిషనర్: దరఖాస్తు చేసుకోమ్మా...అన్నీ మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటాను.
 బంగారమ్మ: సంతోషం బాబూ. మమ్మల్ని మీరే ఆదుకోవాలి.
 కమిషనర్: ఏమ్మా...మీ ప్రాంతంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా?
 బంటుపల్లి నాగమణి: మా పదో వార్డు కొండక వీధిలో వీధి లైట్లు వెలగడం లేదు బాబూ.. రాత్రి పూట బయటకు వెళ్లాలంటే భయమేస్తుంది.
 కమిషనర్ : ఏం...ఫర్వాలేదమ్మా...త్వరలోనే అన్ని వీధులకు ఎల్‌ఈడీ లైట్లు అమర్చుతాం. కొద్ది రోజులు ఓపిక పట్టండి.
 సొంత గూడు లేదు
 కమిషనర్(మరో వీధిలో): ఏమిటి తల్లీ...మీ కుటుంబానికి ఏ లోటూ లేదు కదా?
 షేక్ జైనాబీ: ఏం బాగా లేదు సార్.. సొంతిల్లు లేదు.. కనీసం జాగా లేదు, నిరుపేదలం.. మా ఆయన హోటల్లో పనిచేస్తారు. జీతం తినడానికే సరిపోవడం లేదు.
 వట్టి రమణమ్మ(వృద్ధురాలు): ఒక్క దానినే ఇంట్లో ఉంటున్నా బాబూ.. ఏ దిక్కూ లేదు.. పూరింటిలో ఉండలేకపోతన్నాను.
 కమిషనర్ : మీకు ఇళ్లు కట్టుకోవడానికి రుణాలు ఇప్పిస్తా.. దరఖాస్తు చేసుకోండి.. అంత్యోదయకు అర్హత ఉంటే సిఫారసు చేస్తా.
 కాలువలు లేక అవస్థలు
 కమిషనర్ : నమస్తే సత్యారావు గారూ.. ఏంటి సార్ మీ ప్రాంతంలో కష్టసుఖాలు మీరు చూస్తున్నారుగా.. ఏంటి విషయాలు..
 కాలెపు సత్యారావు(పట్టణ ప్రముఖుడు): కమిషనర్ గారూ.. చాలా వీధుల్లో కాలువలు కట్టలేదు. పైపులైన్లు అమర్చలేదు. వీధుల్లో విచ్చలవిడిగా పశువులు, కుక్కలు సంచరిస్తున్నాయి. మీరే చూడాలి మరి..
 కమిషనర్ : అందుకే సార్ మేం వచ్చింది.. ఈ సమస్యలన్నీ నమోదు చేసుకుని ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తా...
 ఎర్ర చెరువు బాగు చేస్తే మేలు
 కమిషనర్ : శ్రీనివాసరావు గారూ ఏదో చెప్పాలని చాలా ఆతృత పడుతున్నారు...ఏంటి విషయం?
 పి.శ్రీనివాసరావు: సార్...బొబ్బిలి రోడ్‌లో ఉన్న ఎర్ర చెరువుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పట్టణానికి ల్యాండ్ మార్క్ అది. ఒకప్పుడు పట్టణమంతటికీ మంచి నీటి అవసరాలు తీర్చేది. గతంలో మంత్రిస్థాయి ప్రజాప్రతినిధులను కూడా ఎర్రచెరువు బాగుకు నిధులు కోరాం. ప్రయోజనం లేకపోయింది.
 కమిషనర్ : (ఎర్రచెరువు పరిశీలన అనంతరం) ప్రభుత్వ సహకారం తర్వాత చూద్దాం. ఎర్రచెరు వు బాగుకు స్వచ్ఛంద సంస్థల సహకారం కోరుతున్నాం. వారిస్పందన కోసం ఎదురుచూస్తున్నాం..
 కోర్టు కేసులు పరిష్కరించాలి
 కమిషనర్ : రాజాంను పట్టిపీడిస్తున్న ముఖ్య సమస్య ఏమిటమ్మా?
 సిరిపురపు అనసూయమ్మ(మహిళా సంఘ నేత): రాజాం నగర పంచాయతీ ఎన్నికలు జరగడానికి వీలుగా న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి పెద్దలు చొరవ చూపాలి. ప్రజాప్రతినిధులు లేక పనులు జరగడం లేదు. ప్రజలకు పాలకులు అందుబాటులో లేకపోతే ఆ బాధ చెప్పుకోలేనిది. పన్నుల భారం కూడా అధికంగా ఉంది. మీరు(కమిషనర్‌నుద్దేశించి) వ చ్చినప్పటి నుంచి అంతా బాగానే ఉంది. కాని కౌన్సిలర్లుంటే వారిని నిలదీయడానికి అవకాశముంటుంది.
 కమిషనర్ : సరేనమ్మా.. పెద్దలతో మాట్లాడుతా. ప్రభుత్వానికి నివేదిస్తా. కోర్టు పరిధిలో ఉన్న అంశాలకు ఇంతకు మించి మనం మాట్లాడకూడదు...
 (అప్పుడే నగర పంచాయతీ డీఈఈ ప్రసాదరావు అక్కడకు వచ్చారు)
 కమిషనర్ : డీఈఈ గారూ.. మీ కోసమే ఎదురుచూస్తున్నాం. పట్టణంలో కాలువలు, సీసీ రహదారులు పూర్తిస్థాయిలో నిర్మించలేదని ప్రజలు అడుగుతున్నారు. మీ సమాధానమేమిటి?
 డీఈఈ : నిబంధనల ప్రకారం కాలువలు నిర్మిస్తున్నాం. ప్రజా సహకారం కూడా కావాలి. కాలువలు లేని చోట నిధుల కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తాం కమిషనర్ గారు.
 కమిషనర్ : ఓకే.. థాంక్యూ వెరీమచ్ సార్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement