
పంచాయతీల విలీనం జీవో రద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో శివార్లలోని గ్రామపంచాయతీల విలీనం అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. ప్రజల అభ్యంతరాలను స్వీకరించకుండా ప్రభుత్వం ఇచ్చిన విలీనం జీవోను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రాజేంద్రనగర్ మండలం గండిపేట, మంచిరేవుల, కోకాపేట, షామీర్‌పేట మండలం జవహర్‌నగర్, శంషాబాద్ మండలం శంషాబాద్, కుత్బుల్లాపూర్ మండలం ప్రగతినగర్, బాచుపల్లి, కొంపల్లి, దూలపల్లి, ఘట్‌కేసర్ మండలం బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచర్ల, కీసర మండలం నాగారాం, దమ్మాయిగూడ, మేడ్చల్ మండలం గుండ్ల పోచంపల్లిలతో పాటు మరో రెండు గ్రామ పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఆ జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన జస్టిస్ రమేష్ రంగనాథన్.. ఆ గ్రామ పంచాయతీల విలీనానికి సంబంధించిన రికార్డులను తెప్పించుకుని స్వయంగా పరిశీలించారు. తాజాగా ఆ పిటిషన్లను గురువారం మరోసారి విచారించారు. పంచాయతీల విలీనం విషయంలో నిర్ణీత విధి విధానాలను అనుసరించడంలో ప్రభుత్వం విఫలమైందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా, ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండానే విలీన ప్రక్రియను పూర్తి చేశారని అభిప్రాయపడిన న్యాయమూర్తి... ఆ జీవోను రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఇదే సమయంలో పంచాయతీరాజ్ చట్టంలో నిర్ధేశించిన విధి విధానాలను అనుసరించి విలీనంపై నిర్ణయం తీసుకోవచ్చునని ప్రభుత్వానికి సూచించారు. ఈ మొత్తం వ్యవహారంపై రెండు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.