ఎందుకెళ్లిందో..!
ఈ విద్యార్థిని పేరు బండి మాబుచాన్.. 8వ తరగతి చదువుతోంది. నెల రోజుల క్రితం స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఈ బాలిక ఇంత వరకూ ఇంటికి రాలేదు.. మీ పాప మా వద్ద ఉందంటూ రెండు మూడు చోట్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది.. ఎంతో సంతోషంగా వెళ్లిన తల్లిదండ్రులకు అక్కడికి వెళ్లాక నిరాశ ఎదురవుతోంది.. తీరా అక్కడికి వెళ్లిచూస్తే నిన్ననే పాప ఇక్కడి నుంచి వెళ్లిపోయిందంటూ వారు చెప్పడంతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. తమ కుమార్తె ఎక్కడ ఉందో.. ఏం తింటుందో అని నెలరోజుల నుంచి తల్లిదండ్రులు అన్న పానీయాలు ముట్టుకోకుండా ఇంట్లో పడిపోయారు.
⇒ బడికెళ్తున్నానని చెప్పి వెళ్లి ఇంటికి తిరిగిరాని బాలిక
⇒ నెలరోజులుగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు
⇒ ఆచూకీ కోసం రెండు జిల్లాల పోలీసుల గాలింపు
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు పట్టణం వివేకానంద కాలనీకి చెందిన బండి చిన్న దస్తగిరి బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అతనికి మాబుచాన్, మాబుషరీఫ్ అనే పిల్లలున్నారు. మాబుచాన్ కొర్రపాడు రోడ్డులోని టీవీఆర్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. గత నెల 27న స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో పాఠశాలకు వెళ్లి విచారించారు. అయితే ఆ రోజు విద్యార్థిని స్కూల్‌కు రాలేదని పాఠశాల యాజమాన్యం తెలిపింది. దీంతో ఆ రోజంతా తల్లిదండ్రులు కుమార్తె కోసం గాలించారు.
కర్నూలులో ప్రత్యక్షం..
ఇంటి నుంచి వెళ్లిన మాబుచాన్ కర్నూలులో 28న ప్రత్యక్షమైంది. ఆమె కర్నూలుకు వెళ్లే సమయంలో బస్సులో అదే సీటులో ఉన్న ప్రయాణికులు పరిచయమయ్యారు. బస్టాండ్‌లో దిగే సరికి రాత్రి కావడంతో మాబుచాన్‌ను చూసి వారు జాలిపడ్డారు. దీంతో సమీపంలో ఉన్న పెద్దపాడు చిల్డ్రన్స్ హోంకు తీసుకొని వెళ్లారు. వారు హోం నిర్వాహకులతో మాట్లాడి వదలి వెళ్లారు.
బాలికతో మాట్లాడిన హోం నిర్వాహకులు 29న ప్రొద్దుటూరులోని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు 30న అక్కడికి వెళ్లారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారని విషయం తెలుసుకున్న మాబుచాన్ 29న రాత్రి హోం నుంచి చెప్పకుండా వెళ్లిపోయింది. తల్లిదండ్రులు వెళ్లి నిరాశతో వెనుతిరిగి వచ్చారు. ఈ మేరకు చిల్డ్రన్స్ హోం నిర్వాహకులు కె.నాగలాపురం పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మళ్లీ పోరుమామిళ్లలో ప్రత్యక్షం..
కొన్ని రోజులపాటు ఎవ్వరికి కనబడకుండా వెళ్లిన బాలిక డిసెంబర్ 8న పోరుమామిళ్లలోని మదర్ థెరీసా ఫౌండేషన్‌కు వెళ్లింది. నాలుగు రోజులపాటు బాలిక అక్కడే ఉండిపోయింది. ఫౌండేషన్ నిర్వాహకుడు చింతా రవిప్రకాష్‌రెడ్డి టూ టౌన్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి ప్రొద్దుటూరు అమ్మాయి తప్పి పోయినట్లు కేసు నమోదైందా అని అడిగారు. అయితే తల్లిదండ్రులు అప్పటి వరకూ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదు.
అందువల్ల ఎస్‌ఐ అదృశ్యంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపి, బాలిక ఫొటోను వాట్సప్‌లో పంపమని చెప్పారు. దీంతో రవిప్రకాష్‌రెడ్డి మాబుచాన్ ఫొటోను వాట్సప్ ద్యారా పంపించారు. అయితే 12న ఉదయం బాలిక తల్లిదండ్రులు టూ టౌన్ పోలీస్టేషన్‌కు వెళ్లి తమ కుమార్తె కనిపించలేదని ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ తన వద్ద ఉన్న ఫొటోను వారికి చూపించగా తమ కుమార్తేనని చెప్పారు. దీంతో ఎస్‌ఐ వెంటనే ఫోన్ చేయగా నిన్ననే పాప ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోయిందని చెప్పారు.
అయినప్పటికీ ఎస్‌ఐ ఇద్దరు కానిస్టేబుళ్లను పోరుమామిళ్లకు పంపించి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అయినా ఆచూకీ తెలియలేదు. విద్యార్థిని పాఠశాలలో హైదరాబాద్ ఎంత దూరం, తిరుపతికి ఎలా వెళ్లాలి.. టికెట్ ఎంత అవుతుంది అని స్నేహితులతో తరచూ చెబుతుండేదని ఎస్‌ఐ తెలిపారు. కాగా కె.నాగలాపురం పోలీస్టేషన్ నుంచి శనివారం ఏఎస్‌ఐలు ఈశ్వరయ్య, మహ్మద్‌ఆలీలు టూ టౌన్‌కు వచ్చారు. వారు ఎస్‌ఐతో బాలిక అదృశ్యంపై మాట్లాడారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు వెంటనే 94407 96938 అనే నెంబర్‌కు ఫోన్ చేయాలని ఎస్‌ఐ కోరారు.