సాక్షి, కర్నూలు: ప్రజాపంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు జాయింట్ కలెక్టర్ కన్నబాబు చర్యలకు ఉపక్రమించారు. ఇటీవల కాలంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఏఎస్‌ఓలతో సమావేశమై తనదైన శైలిలో ఆదేశాలు జారీ చేశారు. అక్రమాలను అరికట్టేందుకు సమర్థులైన సీఎస్‌డీటీ, ఏఎస్‌ఓలతో ప్రత్యేక టీములను
ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇకపై నిత్యావసర సరుకులు దారి మళ్లితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రేషన్ సరుకులను పంపిణీ చేయకుండానే కార్డుదారులకు అందించినట్లు చూపుతుండటం, డీలర్లు సమయపాలన పాటించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ మార్పు తీసుకురావాలన్నారు. మొత్తంగా రేషన్ సరుకుల పంపిణీ.. పెట్రోల్ బంకుల్లో మోసాలు.. తూకాల్లో తేడా.. బియ్యం మిల్లుల్లో ప్రజాపంపిణీ బియ్యం నిల్వలు.. బినామీ రేషన్ దుకాణాలు.. గ్యాస్ ఏజెన్సీల అక్రమాలపై ఉక్కుపాదం మోపేందుకు శ్రీకారం చుట్టారు.
ప్రక్షాళనలో భాగంగా ప్రత్యేక బృందాల ఏర్పాటుకు సన్నద్ధమయ్యారు. గతంలో రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున టాస్క్‌ఫోర్స్ బృందాలు ఉండగా.. రెండేళ్ల నుంచి నిద్రావస్థలో ఉన్నాయి. తాజాగా పౌరసరఫరాల శాఖ అధికారులతోనే ఆదోని, నంద్యాల, కర్నూలు డివిజన్లకు రెండు బృందాల చొప్పున ఆరు టీములను ఏర్పాటు చేశారు. వీరంతా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో పని చేయనున్నారు. తద్వారా పారదర్శకత తీసుకొచ్చేందుకు అధికారులను సమాయత్తం చేశారు.
దుకాణాలు ఒకచోట.. లబ్ధిదారులు మరోచోట
జిల్లాలో సుమారు 12 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్తగా 86వేల కార్డులు జత కలిశాయి. జిల్లాలో మొత్తం 2,476 చౌకధరల దుకాణాలను నిర్వహిస్తున్నారు. కొత్త లబ్ధిదారులకు కార్డులు కాకుండా కూపన్లను మంజూరు చేస్తున్నారు. అయితే సమీపంలోని చౌక ధరల దుకాణాలను కాకుండా.. దూరంలో ఉన్న దుకాణాల పరిధిలోకి వీరిని తీసుకురావడంతో కొత్త సమస్యలకు తావిస్తోంది. ఈ కారణంగా సరుకులు తెచ్చుకునేందుకు పేదలు నానా పాట్లు పడుతున్నారు. రచ్చబండలోనూ ఈ విషయమై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో రేషన్‌కూపన్ల విభజనకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇదిలాఉండగా ఎలాంటి ముందుచూపు లేకుండా చేపట్టిన ఈ కేటాయింపునకు బాధ్యులైన అధికారులపైనా చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
బినామీల కోసం వేట
జిల్లాలో 2,476 రేషన్ దుకాణాలు ఉండగా ఎక్కువ శాతం బినామీలు నిర్వహిస్తున్నారు. ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ షాప్ నం.16 డీలర్ అరుణాదేవి ప్రస్తుతం వేరే ఊరిలో ఉండగా.. మరొకరి నిర్వహణలో దుకాణం కొనసాగుతోంది. ఇలా జిల్లా వ్యాప్తంగా బినామీలు నిర్వహిస్తున్న దుకాణాల వివరాలు తెలుసుకుని తొలగింపునకు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా మరో 300 రేషన్ దుకాణాలను కొత్తగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వీటి మాటేమిటి?
ప్రజాపంపిణీ వ్యవస్థ సక్రమ నిర్వహణకు జిల్లా, మండల స్థాయిలో ఆహార సలహా సంఘాలను నియమించారు. ఏడాది కాలంగా ఈ సంఘాల సమావేశాలను నిర్వహించకపోవడంతో అక్రమాలు వెలుగుచూసే అవకాశం లేకుండాపోతోంది. అదేవిధంగా జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ కమిటీ ఉన్నా.. జాడ కరువైంది.
మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరిగిపోయినప్పుడు ప్రభుత్వం ధర ల నియంత్రణకు చర్యలు చేపట్టాలి. ఈ బాధ్యతను కమిటీ చేపట్టాల్సి ఉన్నా పూర్తిగా విస్మరించారు. ఉల్లి ధరలు విపరీతంగా పెరిగినప్పుడు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించాలి. అలా జరిగిన దాఖలాల్లేవు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ వ్యవస్థలను వినియోగంలోకి తీసుకొస్తే ప్రజలకు మేలు చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రజాపంపిణీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి
Published Sat, Nov 23 2013 4:47 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM
Advertisement
Advertisement