
మాపై మైండ్ గేమ్ ఆడుతున్నారు : కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పొత్తులు, ఎత్తులంటూ తమను మానసికంగా దెబ్బతీసేందుకు (మైండ్‌గేమ్ ఆడేం దుకు) వివిధ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న స్థితిలో పొత్తులపై ఎవరైనా చర్చిస్తారా? అని ప్రశ్నించారు. టీడీపీతో తమకు పొత్తులేదని స్పష్టంచేశారు. క్యాడర్‌ను కాపాడుకునేకునేందుకే టీడీపీ నేతలు పొత్తులంటూ లీకులిస్తున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ ఉండదని, రెండు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలున్న చరిత్రలేదన్నారు. రాష్ట్రంలోని తుపాను బాధిత ప్రాంతాలను ఆదుకునే అంశంపై ప్రధాని సానుకూలంగా స్పందించారన్నారు.
నిర్భయ చట్టం కింద తేజ్‌పాల్‌ను అరెస్టు చేయాలి
తెహల్కా సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్‌ను నిర్భయ చట్టం కింద అరెస్టు చేయాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మాలతీ రాణి డిమాండ్ చేశారు. తోటి ఉద్యోగిపై అఘాయిత్యానికి పాల్పడిన తేజ్‌పాల్‌ను క్షమించకూడదన్నారు. తేజ్‌పాల్ అరెస్టు కోరుతూ బుధవారం ఇక్కడ ధర్నా నిర్వహించారు.