స్మార్ట్ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
ఆత్మకూరు: స్మార్ట్ గ్రామాల అభివృద్ధికి ఉన్నత స్థాయిలో ఉండే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం చేజర్ల మండలం నూతక్కివారికండ్రిక నుంచి ప్రారంభించిన పాదయాత్ర చేజర్ల వరకు(18 కిలోమీటర్లు) సాగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని రెండు ప్రాజెక్ట్‌ల ద్వారా 6 లక్షల ఎకరాల పంటలకు నీరు అందిస్తున్నామని, మరో ఐదేళ్లల్లో 10 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు.
సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజన అనంతరం నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా స్మార్ట్ సిటీ, స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నూతక్కివారికండ్రిక నుంచి ప్రారంభమైన పాదయాత్రలో కొన్ని సమస్యలను అక్కడికక్కడే తీర్చామన్నారు. ఉన్నత స్థాయిలో ఉండే ఎన్‌ఆర్‌ఐలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థల యజమానులు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు వారు జన్మించిన, చదువుకున్న గ్రామాలను ఎంపిక చేసుకుని అభివృద్ధి చేయాలన్నారు.
తాను కూడా తాను జన్మించిన జిల్లాలోని తోటపల్లిగూడూరు గ్రామాన్ని, తాను పెరిగిన నెల్లూరు నగరంలోని 18వ వార్డు హరనాథపురా న్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెం దడంలో భాగంగా జిల్లాకు పలు పరిశ్రమలు రానున్నాయన్నారు. పరిశ్రమలు అభివృద్ధి చెందితే యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా అభివృద్ధి చేసేందుకు సీఎం ప్రణాళికలు రూపొందించారన్నారు.
ప్రస్తుతం రూ.16 వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో వాస్తవంగా పింఛన్ నగదు పెరుగుదల, రుణమాఫీ సాధ్యంకాని పని అన్నా రు. అయినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పింఛన్ నగదును పెంచడంతోపాటు రైతు ల రుణమాఫీ చేపట్టారన్నారు. త్వరలో డ్వాక్రా రుణాలను కూడా మాఫీ చేస్తారన్నారు. కలెక్టర్ ఎం.జానకి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్మార్ట్ గ్రామాల అభివృద్ధికి సహకరించాలన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దేవాన్, స్మార్ట్ విలేజ్ కార్యక్రమం పరిశీలకులు, రాష్ట్ర చీఫ్ కన్జర్వేట్ ఆఫ్ ఫారెస్ట్ రత్నాకర్ జావీద్ మాట్లాడుతూ గ్రామాలు ప్రాథమిక దశ నుంచే అన్ని రకాల అభివృద్ధి చెందేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములై కృషి చేయాలన్నారు.
నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మురళీ కన్నబాబు, డీసీసీబీ చైర్మన్ ధనుంజయరెడ్డి ప్రసంగించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు సుందర రామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు సల్మా షరీన్, నాయకులు రాంబాబు, జనార్దన్ నాయుడు, వెంకట సుబ్బానాయుడు, రవీంద్రారెడ్డి, రమేష్‌నాయుడు, మాజీ ఎంపీపీ పెంచలరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులునాయుడు, ఆర్డీఓ ఎం.వెంకటరమణ, డీఆర్‌డీఏ పీడీ చంద్రమౌళి, జెడ్పీ సీఈఓ జితేంద్ర పాల్గొన్నారు.