ఆ పథకం చేపని పొదుగే..
రాయవరం:
పాలిచ్చే గొడ్డు.. కష్టసుఖాల్లో పాలు పంచుకోగల ఎదిగొచ్చిన బిడ్డతో సమానమే. అలాంటి పాడి పశువును కోల్పోతే.. ఆ కుటుంబానికి పెద్ద దెబ్బే. అలాంటి దెబ్బను రైతులు తట్టుకోవడానికే కేంద్ర ప్రభుత్వం పశు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.
అయితే పాడిరైతుల్లో అవగాహన లేకపోవడం, ప్రభుత్వం తగినంతగా ప్రచారం చేయకపోవడం, వాస్తవాలకు విరుద్ధంగా ఉన్న నిబంధనలతో ఈ పథకం.. ‘పొదుగు కుండంత.. పాలు పిడతంత’ అన్నట్టు అంతంత మాత్రంగానే ఉపయోగపడుతోంది. జిల్లాలో మూడు లక్షల పాడి పశువులుండగా ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం రెండు వేలకు మాత్రమే బీమా జరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
పథకం లక్ష్యమిదీ..
పాడి పశువులు సీజనల్ వ్యాధులు, ఇతర కారణాలతో చనిపోతే రైతు నష్టపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం 2006లో పశు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. సంకర జాతి, దేశవాళీ ఆవులు, గేదెలకు ఈ పథకం కింద బీమా చేయించవచ్చు. బీమా ప్రీమియంలో 50 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. చూడి పశువులు, పాలిచ్చే పశువులు, ఒక్కసారైనా ఈనిన ఆవులు, గేదెలకు ఈ పథకం వర్తిస్తుంది. ఒక రైతు రెండు పాడి పశువుల వరకు బీమా చేయించొచ్చు. ప్రీమియాన్ని ఏడాది, మూడేళ్ల కాల పరిమితికి చెల్లించే వీలుంటుంది. బీమా చేసిన ప్రతి పశువుకూ పశువైద్యాధికారి ఎదుట చెవి పోగు వేస్తారు. ప్రమాదాలు, వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పశువులు మరణిస్తే రైతు పశువు విలువ ఆధారంగా బీమా పరిహారం పొందవచ్చు. అంతేకాక పాడిపశువుకు బీమా చేయించిన రైతు ప్రమాదం బారిన పడి మరణిస్తే ఆ కుటుంబానికి రూ.50 వేల పరిహారం చెల్లిస్తారు. దీని కోసం అదనపు ప్రీమియం చెల్లించనక్కరలేదు. ఈ బీమా పథకంలో 30 శాతం మహిళలకు కేటాయించాలి. 15 శాతం ఎస్సీలకు, 8 శాతం ఎస్టీలకు ఖర్చు పెట్టాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో బీమా ప్రీమియంగా రూ.20 లక్షలు సెప్టెంబర్‌లో రాగా ఇప్పటి వరకు రూ.12 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు.
జిల్లాలో అన్ని రకాల పశువుల సంఖ్య తొమ్మిది లక్షలుంది. వీటిలో సంతానోత్పత్తి వయస్సుకు వచ్చిన పశువులు 5,15,200 కాగా పాలిచ్చేవి సుమారు మూడు లక్షలు ఉన్నాయి. వీటిలో బీమా చేయించిన పశువులు కేవలం రెండు వేలే. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు బీమా పరిహారం చెల్లించాలంటూ 115 క్లెయిములు నమోదు కాగా 95 క్లెయిములకు పరిహారం చెల్లించారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.
‘కంతలున్న కంచె’..
ఈ పథకం నిబంధనలు కూడా పాడి రైతులు తమ పశువులకు బీమా రక్షణ పొందలేకపోవడానికి అడ్డంకులవుతున్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏ) నిబంధనల ప్రకారం పశువు విలువ రూ.30 వేలు దాటినా, ఒక కుటుంబానికి రెండు పశువులకు మించినా బీమా చేయడానికి లేదు. దీంతో జిల్లాలో అధిక శాతం రైతులు బీమా పరిధిలోకి రావడం లేదు. వాస్తవానికి ప్రస్తుతం రైతులు కొనే ఒక్కో పాడి పశువు విలువా రూ.50 వేల పైగానే ఉంటోంది. దీంతో..కంతలున్న కంచెలా ఈ పథకం పాడి రైతుల ప్రయోజనాలకు రక్షణ కల్పించడం లేదు. రైతులకు అక్కరకు రాని ఈ నిబంధనలను సడలించాలని, బీమా చేసే పశువు విలువను రూ.50 వేలకు, పశువుల సంఖ్యను నాలుగుకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ ఐఆర్‌డీఏకి రెండేళ్ల క్రితమే విజ్ఞప్తి చేసింది. అయితే నేటికీ సానుకూల స్పందన రాలేదు.