సాక్షి, అమరావతి: మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన నాలుగేళ్లుగా పశుపోషకుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తోంది. ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో పశుపోషకులకు అందిస్తున్న సేవలతో పాటు దేశంలోనే తొలిసారిగా సాధారణ అంబులెన్స్‌ల తరహాలో మండల స్థాయిలో వెటర్నరీ అంబులేటరీ క్లినిక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి రైతుల ముంగిటే సేవలందిస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో వైపరీత్యాలు, వివిధ రకాల ప్రమాదాల్లో మూగ, సన్నజీవాలు మృత్యువాతకు గురై పశుపోషకులు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడితే పైసా నష్టపరిహారం కాదు కదా.. కనీసం బీమా పరిహారం కూడా ఇచ్చిన దాఖలాల్లేవు. కానీ, సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చీ రాగానే దేశంలో ఎక్కడాలేని రీతిలో ఉచిత పశు నష్టపరిహారం పథకం అమలుచేసింది.
మరింత ఎక్కువమందికి లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో వైఎస్సార్ ఉచిత పశుబీమా పథకానికి శ్రీకారం చుట్టింది. వయోభారంతో సతమతమవుతున్న రామోజీరావు ఇలాంటి వాస్తవాలకు ముసుగేసి అభూత కల్పనలు, అవాస్తవాలు వండి వారుస్తూ ప్రభుత్వంపై తన ఈనాడు పత్రికలో అదేపనిగా బురదజల్లుతున్నారు. అందులో భాగమే ‘పాడి రైతుకు బీమా బాదుడు’ అంటూ రామోజీ తాజా ఏడుపు. అందులో వాస్తవాలేవిుటంటే..
ఆరోపణ: గత పథకాలను అటకెక్కించేశారు..
వాస్తవం: 2015–16కు ముందు కేంద్ర ప్రాయోజిత పథకం కింద పశువులు, సన్నజీవాలకు బీమా పథకం అమలుచేసేవారు. ఈ పథకం కింద నిర్దేశించిన ప్రీమియం మొత్తంలో 50 శాతం లబ్ధిదారులు భరించాల్సి ఉండగా, మిగిలిన 50 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. 2015 తర్వాత కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ నిలిపివేయడంతో బాబు హయాంలో ఈ బీమా పథకాన్ని పూర్తిగా అటకెక్కించేశారు.
వరదలు, తుపానులప్పుడు ఎన్‌డీఆర్‌ఎఫ్ అండ్ ఎస్‌డీఆర్‌ఎఫ్ నిబంధల మేరకు అరకొరగా అతికొద్ది మందికి మాత్రమే పరిహారం ఇచ్చేవారు. మిగిలిన సమయాల్లో రోడ్డు, రైలు, అగ్ని ప్రమాదాలు, వడగాడ్పులు, పిడుగుపాటుకు, అడవి జంతువులు, విషప్రయోగాలు, పాముకాట్లు వంటి వాటివల్ల చనిపోయే జీవాలకు పైసా పరిహారం కూడా దక్కేది కాదు. కనీసం బీమా చేయించాలన్న ఆలోచన కూడా అప్పటి పాలకులు చేయలేదు. దీన్నిబట్టి ఎవరి హయాంలో బీమాను అటకెక్కించేశారో అర్థమవుతోందా రామోజీ..
ఆరోపణ: నాలుగేళ్లుగా పరిహారం అరకొరగానే..
వాస్తవం: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక వైపరీత్యాలు, ప్రమాదాల్లో చనిపోయిన మూగ, సన్నజీవాల వల్ల జీవనోపాధి కోల్పోయిన పశు పోషకులకు నష్టపరిహారం చెల్లించారు. వ్యక్తిగతంగా బీమా చేయించుకునే పశుపోషకులకు భరోసా కల్పించారు. ఇలా నాలుగేళ్లుగా ఈ పథకం కింద ఏకంగా 1,13,402 మంది రైతులకు అక్షరాలా రూ.297.60 కోట్ల పరిహారాన్ని జమచేశారు. దేశంలో ఈ స్థాయిలో ఏ రాష్ట్రంలోనూ పశుపోషకులకు ఇంత పెద్ద మొత్తంలో నష్టపరిహారం అందించిన దాఖలాలులేవు. ఇలాంటి వాస్తవాలేవీ పాపం రామోజీకి కనిపించవు.
ఆరోపణ: ప్రీమియం మొత్తం భారాన్ని రైతులపై వేశారు..
వాస్తవం: వైఎస్సార్ పశుబీమా పథకం ద్వారా రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువనున్న వారితో పాటు ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన పశుపోషకులకు మూడేళ్ల కాలపరివిుతికి నిర్దేశించిన ప్రీమియం మొత్తంలో 80 శాతం ప్రభుత్వ రాయితీని (రూ.1,536లు) భరిస్తోంది. లబ్ధిదారులు తమ వాటా కింద 20 శాతం (రూ.384లు) చెల్లిస్తే సరిపోతుంది.
ఆరోపణ: పశుపోషకులకు చేసిందేమిటి?
వాస్తవం: పశుపోషకుల కోసం ఈ ప్రభుత్వం అమలుచేసినన్ని సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా జరగడంలేదని పలు రాష్ట్రాలే స్వయంగా కితాబిస్తున్నాయి. ఏపీ బాటలో నడిచేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్న కేరళ రాష్ట్ర బృందంతో పాటు ఇథియోపియా దేశ ప్రతినిధి బృందం సైతం ఈ విషయంలో ప్రశంసలు కురిపించింది.
గేమ్ చేంజర్‌గా నిలిచిన ఆర్బీకేల ద్వారా 75 శాతం సబ్సిడీపై 4,760.31 టన్నుల పశుగ్రాసం, 60 శాతం సబ్సిడీపై 64,578.80 టన్నుల సంపూర్ణ మిశ్రమ దాణా, 40 శాతం సబ్సిడీపై 3,909 చాప్ కట్టర్స్ పంపిణీ చేశారు. 104, 108 తరహాలోనే నియోజకవర్గానికి రెండు చొప్పున రూ.432.69 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో 340 మొబైల్ అంబులేటరీ క్లినిక్స్‌ను ఏర్పాటుచేశారు. వీటి ద్వారా ఇప్పటివరకు 3.27 లక్షల జీవాలకు వైద్యసేవలందించారు.
నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 జంతు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు. ఇవేమీ పాపం వృద్ధ రామోజీకి కన్పించవు. ఎందుకంటే ఆయన అడుగులకు మడుగులొత్తే చంద్రబాబు సీఎం పీఠంపై లేడు కదా..
ఆరోపణ: రూ.30వేలకే బీమా కల్పిస్తే రైతులకెలా న్యాయం చేసినట్లు?
వాస్తవం: పాడి రైతులు కావాలనుకుంటే తమ పశువులకు రూ.30 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు నిర్దేశిత బీమా చేయించుకోవచ్చు. అయితే, ప్రభుత్వ రాయితీ మాత్రం రూ.30వేలకే వర్తిస్తుంది. మిగిలిన ప్రీమియం మొత్తం వారు చెల్లించుకుంటే సరిపోతుంది. ఇదేదో నేరమన్నట్లు రూ.30 వేలు బీమా ఇస్తే రైతులకెలా న్యాయం చేసినట్లు అంటూ ఈనాడు మొసలికన్నీరు కారుస్తోంది.
ఆరోపణ: బీసీ వర్గాలకు రాయితీ ఎక్కడ?
వాస్తవం: పశు పోషకులలో దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల వారే అత్యధికులు. వీరిలో బీసీలు కూడా ఉంటారన్న కనీస జ్ఞానం రామోజీకి కరువైంది. ఎస్సీ, ఎస్టీలతో పాటు దారిద్య్రరేఖకు దిగువనున్న బీసీలందరికీ 80 శాతం రాయితీ వర్తిస్తుంది. ఇప్పటివరకు ఈ పథకంలో 1,05,520 పశు పోషకులు నమోదు చేసుకున్నారు. ఇందులో 57,753 మంది బీసీ సామాజికవర్గానికి చెందిన వారే ఉన్నారు. అంటే నమోదు చేసుకున్న వారిలో 60 శాతం మంది బీసీలే.
గత ప్రభుత్వాలు పశుబీమా అమలుచేసిన సందర్భాల్లో ప్రీమియం మొత్తంలో 50 శాతం మాత్రమే రాయితీ ఇచ్చేవి. కానీ, సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 80 శాతం ప్రీమియం రాయితీగా భరిస్తోంది. అత్యల్ప ప్రీమియం మొత్తంతో లబ్ధిదారులకు బీమా సౌకర్యం కల్పిస్తోంది. అడ్డగోలు రాతలకు అలవాటుపడ్డ రామోజీ ఇవేమీ పట్టించుకోరు.
ఆరోపణ : ఒకేసారి మూడేళ్ల ప్రీమియం చెల్లించాలని ఒత్తిడి..
వాస్తవం: ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రీమియం చెల్లించాలంటే ప్రీమియం రుసుం పెరుగుతుంది. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకునే ఇబ్బందిలేకుండా పశు పోషకుల సౌకర్యార్థం మూడేళ్లకు ఒకేసారి ప్రీమియం చెల్లించేలా పథకాన్ని రూపకల్పన చేశారు.
పైగా కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మూడేళ్లకు సాధారణ ప్రాంతాల్లో ప్రీమియం 11శాతంగా నిర్ధారించగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 6.40 శాతానికే అందిస్తోంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత తక్కువ ప్రీమియంలేదు.
Comments
Please login to add a commentAdd a comment