తెలుగు రాష్ట్రాలలో విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రాలుగా పాస్‌పోర్ట్ సేవలు అందచేయనున్నట్టు విశాఖ పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి గురువారం తెలియజేశారు.
విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాలలో విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రాలుగా పాస్‌పోర్ట్ సేవలు అందజేయనున్నట్టు విశాఖ పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి గురువారం తెలియజేశారు. మే 11వ తేదీ నుంచి కొత్త విధానం అమలులోకి రానున్నట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గుంటూరు, యానాం ప్రాంతాలు విశాఖ కేంద్రం పరిధిలోకి చేరినట్టు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల ప్రజలు విజయవాడ లేదా విశాఖలో పాస్‌పోర్ట్ సేవలు పొందవచ్చని తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, యానాం ప్రాంత ప్రజలు విజయవాడ, విశాఖ కేంద్రాలలో ఎక్కడి నుంచైనా సేవలు పొందుటకు అవకాశం కల్పించినట్టు వివరించారు.
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలు తిరుపతిలో సేవలు పొందాలన్నారు. తెలంగాణకు హైదరాబాద్, నిజామాబాద్ కేంద్రాలుగా అదిలాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆయా జిల్లాల ప్రజలు కొత్తగా అమలులోకి రానున్న విధానంలో సేవలు పొందాలని ఆయన కోరారు.