జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి సుస్తి చేసింది. సకల సమస్యలతో రోగులతోపాటు వైద్యులు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఈ ఆస్పత్రికి రోజుకు 450 మంది పైగా ఇన్‌పేషంట్లు, 550 మందికిపైగా అవుట్ పేషంట్లు చికిత్స కోసం వస్తుంటారు.
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్
జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి సుస్తి చేసింది. సకల సమస్యలతో రోగులతోపాటు వైద్యులు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఈ ఆస్పత్రికి రోజుకు 450 మంది పైగా ఇన్‌పేషంట్లు, 550 మందికిపైగా అవుట్ పేషంట్లు చికిత్స కోసం వస్తుంటారు. జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధులు *40లక్షలు, ఆరోగ్యశ్రీ నిధులు *1.50 కోట్లు ఉన్నాయి. అయితే ఆస్పత్రి వైద్యులు, అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగా పనులను చేపట్టడానికి అధికారులు ముందుకు రావడం లేదు. ఎక్కడ ఏ పని చేపట్టినా తనకు ఏ సమస్యలు చుట్టుకుంటాయో అని అధికారులు జంకుతున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ) నిధులతో నిర్వహించే వార్డులైన నవజాత శిశు సంరక్షణ కేంద్రం, ఎన్‌ఆర్‌సీ, ఆరోగ్యశ్రీ, కాన్పుల వార్డు మినహా మిగతా అన్ని వార్డులలో సమస్యలు నెలకొన్నాయి.
కలెక్టర్ సూచనలు గాలికి..
ఇటీవల జరిగిన జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో అప్పటి జిల్లా కలెక్టర్ ఎన్.ముక్తేశ్వరరావు ఆస్పత్రి అభివృద్ధికి పలు సూచనలు చేశారు. నెల రోజుల్లో ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, ఇందుకు ఆస్పత్రి అభివృద్ధి నిధులను వెచ్చించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను జారీ చేసి నెల పదిరోజులు గడుస్తున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. మూడు రోజుల క్రితం నూతన జిల్లా కలెక్టర్ చిరంజీవులు ఆస్పత్రిని సందర్శించి అసహనాన్ని వ్యక్తం చేయడం చూస్తుంటే అస్పత్రిలో ఉన్న సమస్యలకు అద్దం పడుతుంది. కాన్పుల వార్డులో తల్లులను నేలపై పడుకోబెట్టడాన్ని చూసి చలించిపోయారు. సమస్యలను పరిష్కరించడంతో పాటు ఆస్పత్రిపై ప్రజలలో ఉన్న అపోహలు తొలగిపోయేలా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కలెక్టర్ ఆదేశాలను అయినా పట్టించుకుంటారో లేదో చూడాలి.
ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు
ఆస్పత్రిలో నెలకొన్న తాగునీటి, డ్రెయినేజీ పైప్‌లైన్ వ్యవస్థను పునరుద్ధరించడానికి అధికారులు *22లక్షలలో అంచనాలు రూపొందించారు. ఆవరణలోని లింక్ రోడ్లను తారురోడ్డుగా మార్చడానికి అంచనాలు తయారు చేయాలని నిర్ణయించారు. అదే విధంగా ఆస్పత్రి భవనాలకు రంగులు వేయించడంతోపాటు చెడిపోయిన కిటికీలు, అద్దాలను అమర్చాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు.