సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రులు ఒక రాష్ట్రంలో.. రోగులు మరో రాష్ట్రంలో.. ఇదీ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే రోగుల పరిస్థితి. విభజన ప్రభావం ఉద్యోగ, వ్యాపార వర్గాలకే కాదు.. ఆరోగ్యశ్రీ రోగులపైనా పడనుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ పరిధిలో ఉన్న నెట్‌వర్క్ ఆస్పత్రులు 70 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఆస్పత్రులే కాకుండా స్పెషలిస్టు వైద్యులు కూడా హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఓ మోస్తరు శస్త్రచికిత్సకు కూడా భాగ్యనగరానికి రావాల్సిందే. అయితే రాష్ట్రం విడిపోయాక సీమాంధ్ర జిల్లాల నుంచి వచ్చే రోగులకు సంబంధించిన వైద్య ఖర్చులకు తెలంగాణ ప్రభుత్వం డబ్బు చెల్లించదు. సీమాంధ్రలో ఏర్పడే కొత్త ప్రభుత్వం తక్షణమే ఇక్కడి కార్పొరేట్ ఆస్పత్రులతో అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇక్కడి ఆస్పత్రుల్లో వైద్యులు ఫ్రీ ఆథరైజేషన్ (వైద్యానికిచ్చే ప్రాథమిక అనుమతులు) ఇచ్చే పరిస్థితి ఉండదు.
మరోవైపు సీమాంధ్ర ప్రభుత్వం మరో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసుకుంటుందా లేక రెండు రాష్ట్రాల ఉమ్మడి ఒప్పందంతో ప్రస్తుతం ఉన్న ట్రస్ట్ నుంచే సేవలు కొనసాగిస్తారా అన్నది కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కేర్ కార్యాలయంలోనే 104 కాల్‌సెంటర్ కూడా పనిచేస్తోంది. దీనిపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
7 లక్షల మంది రోగులు సీమాంధ్ర నుంచే...
రాష్ట్రంలో ఏటా 12 లక్షలకు పైగా శస్త్రచికిత్సలు జరుగుతుంటే అందులో 7 లక్షల వరకూ సీమాంధ్ర జిల్లాలకు సంబంధించిన రోగులే ఉన్నారు. ఈ ఏడు లక్షల శస్త్రచికిత్సల్లో 60% హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. కార్డియో థొరాసిక్, కన్‌జెనైటల్ హార్ట్ డిసీజెస్ (పుట్టుకతోనే వచ్చే గుండెజబ్బులు), న్యూరో (నరాల జబ్బులు), క్లిష్టమైన గ్యాస్ట్రొ ఎంటరాలజీ శస్త్రచికిత్సలు, కాలేయ మార్పిడి, మూత్రపిండాల మార్పిడి, కాక్లియర్ ఇంప్లాంట్ (బధిరుల చికిత్సకు వాడే ఇంప్లాంట్స్), స్పైనల్ (వెన్నుపూస) సర్జరీలు, మెదడుకు సంబంధించిన జబ్బులు తదితర ప్రధాన శస్త్రచికిత్సలకు హైదరాబాద్ రావాల్సిందే. నెట్‌వర్క్ ఆస్పత్రులు కూడా ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులో ఓ మోస్తరు వైద్యసేవలు మినహా మిగతా ఎక్కడా ప్రధాన చికిత్సలు జరగడంలేదు. ఈ పరిస్థితుల్లో సీమాంధ్ర రాష్ట్రానికి చెందిన రోగులు ప్రతినిత్యం తెలంగాణ రాష్ట్రానికి రాక తప్పదు.