
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. మూడు రకాలుగా గ్రేడ్లు పెట్టి, ఆ ప్రకారం ప్యాకేజీ ధరలను ఖరారు చేయాలని యోచిస్తోంది. ఏ, బీ, సీ గ్రేడ్లుగా ఆయా ఆసుపత్రులను విభజించే అవ కాశాలున్నాయి. ఆరోగ్యశ్రీలో సంస్కరణలు తేవాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు తెచ్చేందుకు విధివిధానాలు తయారు చేయా లని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేం దర్ ఇటీవల అధికారులను ఆదేశించారు. తద్వారా ఆరోగ్యశ్రీ, అలాగే ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాల (ఈజేహెచ్‌ఎస్) లను మరింత బలోపేతం చేయాలని నిర్ణయిం చారు. సంస్కరణలపై మరోసారి నేడో రేపో సమావేశం కావాలని నిర్ణయించారు.
గ్రేడ్లు.. మార్కులు..
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద 338 ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులు వైద్య సేవలు అందిస్తున్నాయి. వాటిల్లో ఆరోగ్యశ్రీ కార్డు దారులు 77.19 లక్షల మంది ఉచితంగా వైద్యం పొందేందుకు వీలుంది. అలాగే ఈజేహెచ్‌ఎస్ కింద ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులు లక్షలాది మంది వైద్యం పొందుతున్నారు. అయితే ఆరోగ్యశ్రీలోని ప్యాకేజీ ధరలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెంచాలన్న డిమాండ్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆసుపత్రులను మూడు గ్రేడ్లుగా విభజించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. గ్రేడ్ ఏలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు.. గ్రేడ్ బీలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు.. గ్రేడ్ సీలో సాధారణ ప్రైవేట్ ఆసుపత్రులు వస్తాయి.
ఈ గ్రేడ్లను ఖరారు చేయడానికి కొన్ని ప్రమాణాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో ఉన్న వైద్య వసతులు, అత్యాధునిక పరికరాలు, సదుపాయాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే సామర్థ్యం కలిగిన వైద్య నిపుణులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశముంది. వాటి ప్రకారం మార్కులు పెట్టి గ్రేడ్లు ఖరారు చేస్తారు. ఇటు ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. మార్కులు, ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ప్యాకేజీలను ఖరారు చేస్తారు. అంతేకాదు వైద్య రంగంలో అనేక మార్పుల వచ్చాయి. అధిక ఖర్చయ్యే కేన్సర్, కిడ్నీ, కాలేయం వంటి శస్త్ర చికిత్సల విషయంలో అత్యాధునిక పరికరాలు, ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని ఔషధాల రేట్లు భారీగా పడిపోయాయి.
దీంతో ఇప్పుడు ప్యాకేజీ కూడా ఆ మేరకు తగ్గే అవకాశముందని వైద్య, ఆరోగ్య వర్గాలు అంటున్నాయి. ఇక కొన్ని రోగాలకు శస్త్రచికిత్స చేశాక ప్యాకేజీ ఖరారు చేసే సమయంలో వారం వరకు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. ప్రస్తుతం అది రెండు, మూడ్రోజులకే పడిపోయింది. ఈ నేపథ్యంలోనే అనేక వ్యాధులకు చేసే శస్త్రచికిత్సల విషయంలో ఓ అంచనాకు రావాలని, నిపుణులతో చర్చించాక ప్యాకేజీ ధరలను ఖరారు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ భావిస్తోంది.
అన్ని చికిత్సలూ చేయాల్సిందే..
అనేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ఒకట్రెండు వ్యాధులనే ఆరోగ్యశ్రీలో చేర్చి వాటికే వైద్యం అందిస్తున్నాయి. ఉదాహరణకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకుందాం.. అందులో గుండె, కేన్సర్, ఫల్మనాలజీ, ఊపిరితిత్తులు, న్యూరాలజీ వంటి పది రకాల వైద్య సేవలు చేసే అవకాశముంది. కానీ ఆ ఆసుపత్రి కేవలం లాభదాయకమైన ప్యాకేజీలు వర్తించే గుండె, కేన్సర్ చికిత్సలనే ఆరోగ్యశ్రీలో పేదలకు అందిస్తోంది. మిగిలిన చికిత్సలను చేయడం లేదు. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. తాజాగా చేయబోయే సంస్కరణల్లో భాగంగా అన్ని ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు వాటి వద్ద ఉండే అన్ని చికిత్సలనూ ఆరోగ్యశ్రీ కింద చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటువంటి ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసి అన్నింటిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆదేశించనున్నారు. అలాగే కొత్తగా అనుమతులు పొందే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులు తప్పనిసరిగా ఈ నిబంధనను పాటించాలని ఆదేశించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment