పాపం.. పసివాళ్లు! | Patrick Read the reduced children's stores | Sakshi
Sakshi News home page

పాపం.. పసివాళ్లు!

Published Sun, Feb 2 2014 2:39 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

Patrick Read the reduced children's stores

కార్మిక శాఖ, రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం), పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా బుధవారం (గత నెల 29వ తేదీ) అనంతపురం నగరంలో దాడులు నిర్వహించారు. గంటల వ్యవధిలోనే ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 45 మంది పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 14 ఏళ్లలోపు పిల్లలు 35 మంది ఉన్నారు. స్థానిక పాతవూరు, కమలానగర్, టవర్‌క్లాక్, రైల్వేస్టేషన్, సుభాష్‌రోడ్డులోని దుకాణాలు, మెకానిక్ షెడ్లు, ఇతరత్రా వీరు పనిచేస్తూ దొరికారు. ఈ పిల్లలతో పాటు, వారి తల్లిదండ్రులు, షాపుల యజమానులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులుండే నగరంలోని రెండు,మూడు ప్రాంతాల్లోనే ఇంతమంది బాల కార్మికులు ఉంటే.. ఇక జిల్లా వ్యాప్తంగా వీరి సంఖ్య వేలల్లోనే ఉంది.
 
 అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ఆటపాటల మధ్య చదువు కోవాల్సిన పిల్లలు దుకాణాల్లో పని చేస్తూ, భవన నిర్మాణాల్లో రాళ్లెత్తుతూ కనిపిస్తున్నారు. చట్టాలెన్ని ఉన్నా రోజు రోజుకూ వీరి సంఖ్య పెరుగుతోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం 6-14 ఏళ్లలోపు పిల్లలు బడిలోనే ఉండాలి.
 
 ఈ చట్టం అమలుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినా నగరాలు, పట్టణాల్లో ఏ వీధిలో చూసినా బడిఈడు పిల్లలు కనిపిస్తున్నారు. మెకానిక్ షాపులు, ఇతర దుకాణాల్లోనూ, భవన నిర్మాణ కార్మికులుగానూ పనిచేస్తున్నారు. ‘14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్ట విరుద్ధం’, ‘పిల్లలుండాల్సింది పనిలోకాదు... బడిలో’ లాంటి నినాదాలు గోడరాతలు, స్టిక్కర్లు, వాల్‌పోస్టర్లకే పరిమితమవుతున్నాయి. కుటుంబ యజమానులు లేకనో, ఇతర కారణాల వల్లనో పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. కొందరు తల్లిదండ్రులూ ప్రోత్సహిస్తున్నారు.
 
 సమన్వయ లోపం
 బాల కార్మికులు, డ్రాపౌట్స్ పిల్లలను గుర్తించి బడిబాట పట్టించడంలో రాజీవ్ విద్యా మిషన్‌ది కీలక బాధ్యత. వారితో పాటు కార్మిక, ఐసీడీఎస్, ఐసీపీఎస్, ఎన్‌సీఎల్‌పీ, పోలీసు శాఖ అధికారులు కూడా బాల కార్మికులను గుర్తించాల్సి ఉంటుంది. అయితే.. ఆయా శాఖల మధ్య సమన్వయ లోపంతో పట్టించుకునే నాథులే కరువయ్యారు. ఎప్పుడో ఒకసారి హడావుడి చేయడం, తర్వాత ఉసూరుమనిపించడం పరిపాటిగా మారింది. కార్మికశాఖ 2013లో దాదాపు 158 బాల కార్మిక కేసులు నమోదు చేసింది. అంతటితో తమ పనైపోయిందని విడిచిపెట్టింది. దీంతో చాలామంది పిల్లలు తిరిగి పనుల్లో చేరిపోయారు. కఠిన నిర్ణయాలు తీసుకోకుండా కేవలం కౌన్సెలింగ్‌తో సరిపెడుతుండడంతో చాలామంది పిల్లలు తిరిగి ‘పనిబాట’ పడుతున్నారు.
 
 2012-13లో 4,752 మంది బడి బయట పిల్లలు
 2012-13 విద్యా సంవత్సరంలో అంగన్‌వాడీ కార్యకర్తలు జిల్లాలో సర్వేచేసి 4,752 మంది పిల్లలు బడిబయట ఉన్నట్లు గుర్తించారు. ఈ జాబితా ఆధారంగా ఆర్వీఎం రాష్ట్ర అధికారులు కేజీబీవీ స్పెషల్‌ఆఫీసర్లు, ఐఆర్టీలతో తిరిగి సర్వే చే యించారు. చాలామంది వయసు మీరి పెళ్లిళ్లు అయిన వారు, వేరే ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారిగా తేలింది. మొత్తమ్మీద చివరకు 1,726 మంది పిల్లలు బడిబయట ఉన్నట్లు గుర్తించారు. వీరిని విడతల వారీగా సమీప పాఠశాలలు, ఆర్‌ఎస్‌టీసీల్లో చేర్పించినట్లు ఆర్వీఎం అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది బడిబయట పిల్లలపై సర్వే ప్రారంభించినట్లు తెలిపారు.
 
 పోలీస్‌స్టేషన్‌లో కనిపించని ప్రత్యేక పోలీసు
 బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ ఒక కానిస్టేబుల్‌ను నియమించాల్సి ఉంది. సదరు కానిస్టేబుల్ తన స్టేషన్ పరిధిలోని బాల కార్మికుల కేసులను పర్యవేక్షించాలి. తరచూ కౌన్సెలింగులు నిర్వహించాలి. అయితే.. ఏ ఒక్క పోలీస్ స్టేషన్‌లోనూ ప్రత్యేకంగా కానిస్టేబుల్‌ను నియమించిన దాఖలాలు లేవు. సెంథిల్‌కుమార్ ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి స్టేషన్‌లోనూ ఒక పోలీసును ఏర్పాటు చేశారని చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.
 
 చర్యలు తీసుకుంటున్నాం
 బడిఈడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గతేడాది గుర్తించిన వారిలో పాఠశాల స్థాయికి అర్హులైన అందరినీ చేర్పించాం. వలసలు వెళ్లిన కుటుంబాలు, 14 ఏళ్ల పైబడిన వారు అక్కడక్కడ ఉండొచ్చు. బడిఈడు పిల్లలపై తాజాగా సర్వే చేయిస్తున్నాం. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత గుర్తించిన పిల్లలను వారి స్థాయిని బట్టి ఆయా పాఠశాలల్లో చేర్పిస్తాం.         
 - కేఎస్ రామారావు, ఆర్వీఎం పీఓ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement