
'అత్తారింటికి దారేది' సినిమా లీక్!
పవన్ కళ్యాణ్ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'అత్తారింటికి దారేది' సినిమా ఇంకా విడుదల కాకముందే.. పైరసీ సీడీలు వచ్చేశాయి!! ఎడిట్ రూంలో కూర్చున్న ఎవరో తన మిత్రులకు దాన్ని చూపించేందుకు యూట్యూబ్లో 90 నిమిషాల పాటు పెట్టగా, ఈలోపే దాన్ని చూసిన కొంతమంది దాన్ని వెంటనే డౌన్లోడ్ చేసేసి.. పైరసీ సీడీలుగా రూపొందించారని విశ్వసనీయ సమాచారం. దీంతో ఇప్పుడు ఆ చిత్రం పైరేటెడ్ సీడీలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేసినట్లు అయ్యింది.
దాంతో ఆ చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కుమారుడు బాపినీడు పైరసీదారులపై డీజీపీ దినేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. చిత్ర యూనిట్ వాళ్లకు కూడా సినిమా ప్రదర్శన వేయాలేదని... అలాగే ప్రివ్యూ కూడా ఎక్కడా ప్రదర్శించలేనందున లీక్ అయ్యే అవకాశాలు కూడా లేవని తొలుత భావించినా.. తర్వాత మాత్రం అసలు విషయం తెలిసింది. గతంలో కూడా ‘అత్తారింటికి దారేది' ఫస్ట్ లుక్ టీజర్ విడుదలయ్యేలోపే అందులోని కొన్ని డైలాగులు బయటకు లీకయిన విషయం తెలిసిందే. దీనిపై చిత్ర నిర్మాత మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై భారీ నిర్మాత 'ఛత్రపతి' ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'అత్తారింటికి దారేది'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 9న విజయదశమి కానుకగా విడుదల కానుంది. సమంత హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.