చేనేత ప్రచారకర్తగా పవన్ కళ్యాణ్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన చేనేత సంఘాల నాయకుల విజ్ఞప్తి మేరకు ప్రచారకర్తగా ఉండేందుకు ఆయన అంగీకరించారు. చేనేత సంఘాల నాయకులు మంగళవారం పవన్ కళ్యాణ్ ను కలిసి చర్చలు జరిపారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను పవన్ కు వివరించారు. రెండున్నరేళ్లలో 45 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. చేనేత కార్మికుల జీవన పరిస్థితులు మెరుగపరిచేందుకు సహరించాలని కోరారు.
చేనేత మన జాతి సంపద అని, కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తానని పవన్ కళ్యాణ్ హామీయిచ్చారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగానే చేనేత కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వచ్చే నెలలో మంగళగిరిలో జరగనున్న చేనేత సత్యాగ్రహంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారు.