పవన్ కల్యాణ్ మూడోపెళ్లి! | Pawan Kalyan's 3rd Marriage With Australian Model! | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్ మూడోపెళ్లి!

Published Sun, Dec 29 2013 1:40 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ కల్యాణ్ మూడోపెళ్లి! - Sakshi

పవన్ కల్యాణ్ మూడోపెళ్లి!

విదేశీ నటి అన్నా లెజ్‌నేవాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న పవర్‌స్టార్
 
సాక్షి, హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మూడో వివాహం చేసుకున్నారు. ‘తీన్‌మార్’ సినిమాలో తనతో కలిసి నటించిన రష్యన్ సంతతికి చెందిన ఆస్ట్రేలియా నటి, మోడల్ అయిన అన్నా లెజ్‌నేవాను ఆయన గత సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు సంబంధించి ఇరువర్గాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో అధికారులు నెలరోజుల్లో సర్టిఫికెట్ కూడా జారీ చేసినట్టు సమాచారం. పవన్ కల్యాణ్ విశాఖకు చెందిన నందినిని తొలి వివాహం చేసుకోవడం విదితమే. అయితే తదుపరి బద్రి సినిమాలో తనకు జోడీగా నటించిన రేణూదేశాయ్‌తో ఆయన సహజీవనం చేశారు.
 
 వారిద్దరికీ మగబిడ్డ జన్మించగా తన అభిమాన దర్శకుడు అకిరా కురసోవా పేరు కలిసొచ్చేలా అకిరానందన్ అని నామకరణం చేశారు. అనంతరం నందినికి విడాకులిచ్చిన పవన్.. కన్నబిడ్డ, కుటుంబ సభ్యుల సమక్షంలో రేణూను వివాహమాడారు. తర్వాత వీరికి ఓ పాప జన్మించింది. అయితే ఇటీవల రేణూదేశాయ్‌కు విడాకులిచ్చిన పవన్.. ఆ తర్వాత అన్నా లెజ్‌నేవాకు చేరువై సహజీవనం చేసినట్టు సమాచారం.

వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్టు కొన్నాళ్లక్రితం ఓ ఆంగ్ల దినపత్రిక కథనం కూడా ప్రచురించింది. వీరిద్దరికీ ఓ ఆడపిల్ల జన్మించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన సెప్టెంబర్ 30న లెజ్‌నేవాను వివాహమాడినట్టు తెలిసింది. ఈ రిజిస్టర్ మ్యారేజీకి సాక్షులుగా కళాదర్శకుడు ఆనంద్ సాయితోపాటు మరో ఇద్దరు సంతకం చేసినట్టు తెలిసింది. రికార్డుల ప్రకారం.. పవన్, లెజ్‌నేవాల నోటీస్ నంబర్ 50 కాగా.. వివాహ నమోదు నంబర్ 43. దాదాపు మూడునెలల క్రితం జరిగిన ఈ వివాహం ఆలస్యంగా ఇప్పుడు వెలుగుచూసింది. ఈ విషయం శనివారం వెలుగులోకి రావడంతో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు సందడి నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement