అదనంగా ఏడు లక్షల మందికి వైఎస్సార్‌ పెన్షన్లు | Peddireddy Ramachandra Reddy Speech In Vijayawada | Sakshi
Sakshi News home page

అదనంగా ఏడు లక్షల మందికి వైఎస్సార్‌ పెన్షన్లు

Published Mon, Oct 14 2019 3:46 PM | Last Updated on Mon, Oct 14 2019 4:17 PM

Peddireddy Ramachandra Reddy Speech In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలతో పాటు, ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌, గృహనిర్మాణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆయన విజయవాడలోని సెర్ఫ్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి డీఆర్‌డీఏ పీడీల సమీక్షా సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డీఆర్‌డీఏ పీడీలు ప్రతినెలా 15 రోజులపాటు ఫీల్డ్‌లో పని చేయాలన్నారు.

గ్రామీణాభివృద్ది కోసం కేటాయించిన పథకాల అమలును స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. వచ్చే జనవరి నుంచి అదనంగా 7 లక్షల మందికి  వైఎస్సార్‌ పెన్షన్లు ఇస్తామని వెల్లడించారు. పెన్షన్ల ఎంపికలో గ్రామ సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పొదుపు సంఘాలు చెల్లించాల్సిన రుణాలను నాలుగు విడతలుగా వారి చేతికే అందిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీనిని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. 

పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తెస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 9.33 లక్షల పొదుపు సంఘాలు బ్యాంక్‌లకు చెల్లించాల్సిన రుణం రూ. 27,168 కోట్లు ఉందని.. రుణభారం నుంచి పొదుపు మహిళలను విముక్తి చేస్తామని హామి ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 11వ తేదీలోగా బ్యాంకులకు మహిళలు చెల్లించాల్సిన వడ్డీ రూ.1,823 కోట్లు, రుణభారాన్ని ప్రభుత్వమే భరించేందుకు సిద్దంగా ఉందని వెల్లడించారు. మొదటి అయిదు నెలల వడ్డీ కింద రూ. 760 ‌కోట్లు నేరుగా రుణ ఖాతాలకు జమ చేస్తామని తెలిపారు. సున్నావడ్డీ కింద రూ.5 లక్షల రూపాయలకు లోబడి రుణాలు ఇస్తామన్నారు. ఈ వడ్డీని పొదుపు సంఘాల తరుఫున ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుందని చెప్పారు. స్త్రీనిధి కింద ఈ ఏడాది స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే కేటాయింపులను రూ.900 కోట్లు నుంచి రూ.1800 కోట్లకు పెంచుతామని పేర్కొన్నారు. స్త్రీనిధి కింద ఇచ్చే ఆర్థిక తోడ్పాటును రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచుతామన్నారు.

సుమారు 168 రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు మొదటిసారిగా కార్యాలయ సదుపాయం కల్పిస్తామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు, పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు 76 గోడౌన్‌లతో కూడిన ఇన్‌పుట్‌ షాప్‌ల ఏర్పాటుకు చేస్తామన్నారు. రైతు సంస్థలే స్వయంగా నిర్వహించుకునేలా 92 ఉత్పత్తి ఆధారిత ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఎఫ్‌పీఓల ద్వారా తక్కువ ధరకు ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులను రైతులకు అందించేందుకు రూ.33 కోట్లు విడుదల చేస్తామన్నారు. ప్రతినెలా 5న  వైఎస్సార్‌ పెన్షన్లను అందించాలని అధికారును ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామన్నారు. అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. గ్రామస్థాయిలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా నవరత్నాలు సక్రమంగా ప్రజలందరికీ అందేలా పీడీలు, సెర్ఫ్ సిబ్బంది చిత్తశుద్దితో పనిచేయాలని రామచంద్రారెడ్డి ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement