
మంత్రి ఇంటికి ఎవరైనా, ఎలాగైనా రావచ్చా?
*మంత్రి ఇంటికి ఎవరైనా, ఎలాగైనా రావచ్చా?
*మంత్రి ఇంటికి వచ్చేవారికి సెక్యూరిటీ చెకింగ్ ఉండదా ?
*వచ్చేవారు బ్యాగులతో వస్తే.. నేరుగా ఇంట్లోకి పంపేస్తారా ?
*బ్యాగులో డబ్బు కాకుండా ఇంకేమైనా ఉంటే పరిస్థితి ఏమిటి ?
*మతి స్థిమితం లేని మహిళకు డబ్బులు తనవే అని ఎలా తెలుస్తుంది ?
*మతిస్థిమితం లేని మహిళ మాటలకు విలువేంటి ?
*నిన్న డబ్బుపోతే ఇప్పటివరకూ ఆ మహిళ సైలెంట్గా ఎందుకుంది ?
* ఇంతకీ ఆ మహిళ కూతురిదేనా డీఎస్సీ హాల్టికెట్ ?
*డబ్బుల కట్టతో మంత్రి పీతల సుజాతను ఎందుకు కలవబోయింది ?
*శిశు సంక్షేమ శాఖ మంత్రికి డీఎస్సీ ఫలితాలకు లింక్ ఏమిటి ?
ఏలూరు: టీడీపీ నేతల ఇళ్లల్లో లక్షల రూపాయలు బయట పడుతున్నాయి. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ తీవ్ర కలకలం రేపుతుండగానే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా మంత్రి ఇంట్లోనే లక్షల రూపాయలతో కూడిన సంచి కనిపించింది. ఏపీలో డీఎస్సీ ఫలితాలు వచ్చిన రోజే మంత్రి ఇంటి ఆవరణలో డబ్బుల సంచి కనిపించడం ఆసక్తి కరంగా మారింది. నిన్న రాత్రి నుంచి ఇంటిలోనే ఉండి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న మంత్రి పీతల సుజాత మీడియాలో తనపై వార్తలు రావడంతో ఎట్టకేలకు బుధవారం నోరు విప్పారు.
నోట్ల కట్టల వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని.. మంత్రి పీతల సుజాత చేతులు దులుపుకున్నారు. ఇదంతా కుట్రలో భాగమని చెప్పుకొచ్చారు. పోలీసు విచారణ అనంతరం అన్ని విషయాలు బయటకొస్తాయని చెప్పారు. తమ ఇంట్లో నగదు బ్యాగ్ వదిలి వెళ్లిన మహిళకు మతి స్థిమితం లేదని మంత్రి చెప్పటం విశేషం. అయితే ఆ మహిళ కుమార్తె మాత్రం.. ఈ వ్యవహారంపై పొంతన లేని సమాధానం చెప్పింది. తన తల్లి.. పది లక్షల రూపాయలు ఉన్న బ్యాగ్ మంత్రి ఇంటి దగ్గర మర్చిపోయిందని తెలిపింది.
మరోవైపు నోట్ల కట్టల ఎపిసోడ్‌లో కొత్తకొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. డబ్బు తెచ్చిన మహిళ అద్దాల విష్ణువతి మంత్రి ఇంట్లో ప్రత్యక్షం కావడంతో ఖంగుతిన్న పోలీసులు.. ఆమెను పక్కకు తీసుకెళ్లి వివరాలు సేకరించారని తెలిసింది. అనంతరం మంత్రి కూడా ఆమెతో రహస్యంగా మాట్లాడారని సమాచారం. పాలకొల్లు మండలం జున్నూరు గ్రామానికి చెందిన అద్దాల విష్ణువతి.. తన కుమార్తె కోర్నె శ్రీలక్ష్మికి డీఎస్సీలో మార్కులు తక్కువ రావడంతో సిఫార్సు చేసేందుకు వచ్చిందని.. అందుకోసమే పది లక్షలు నగదు తెచ్చిందన్న అనుమానాలు బలపడుతున్నాయి.