పెండింగ్
రేషన్ కార్డుల కోసం 1.40 లక్షల మంది దరఖాస్తు
4,630 కార్డుల రద్దు
ఆధార్ లింక్ లేదని 5,48,020 మందికి రేషన్ కట్
జిల్లాలో ప్రస్తుతం ఉన్న కార్డులు 11,30,359
రేషన్ కార్డుల కోసం దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కొత్త కార్డుల మంజూరు మాట అటుంచి పాత కార్డుల్లో కొన్నింటినిరద్దు చేశారు. ఆధార్ అనుసంధానం లేదంటూ కొందరు లబ్ధిదారులకు సరకుల సరఫరా నిలిపివేశారు. కొత్త కార్డులకోసం 1.43 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి.
మచిలీపట్నం : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో కొత్త రేషన్‌కార్డుల జారీ నిలిచిపోయింది. ఉన్నవాటిలోనే 4,630 కార్డులను తొలగించారు. జిల్లాలో గతంలో 11,34,989 కార్డులు ఉండేవి. వీటిలో 10,66,897 తెల్లకార్డులు, 67,594 ఏఏవై కార్డులు, అన్నపూర్ణ కార్డులు 498 ఉండేవి. ఈ కార్డుల ద్వారా 37,43,749 మంది కుటుంబ సభ్యులు (యూనిట్స్) లబ్ధిపొందేవారు. రేషన్‌కార్డులోని పేర్లకు ఆధార్ అనుసంధానం చేయటంతో 31,95,729 మందికి సంబంధించిన ఆధార్ వివరాలను సేకరించి నమోదు చేశారు. మిగిలిన 5,48,020 మందికి ఆధార్ అనుసంధానం జరగకపోవటంతో వారికి సరకుల పంపిణీ నిలిపివేశారు.
పెండింగ్‌లోనే 1.40 లక్షల దరఖాస్తులు : 2014 అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించిన జన్మభూమి - మాఊరు కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 1.40 లక్షల మంది రేషన్‌కార్డులు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను తీసుకున్న అధికారులు ఎప్పుడు రేషన్‌కార్డులు మంజూరు చేసేదీ ప్రకటించకుండా జాప్యం చేస్తున్నారు. నూతనంగా వివాహం చేసుకున్న వారు నూతన రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే దానిని స్వీకరిస్తున్నారు తప్ప, కార్డు ఇవ్వటం లేదు. వివాహం అనంతరం పిల్లలు కలిగిన వారు పిల్లల పేరును రేషన్‌కార్డులో చేర్చాలంటే ముందుగా మీ-సేవలో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం రెవెన్యూ అధికారులు దానిని ధ్రువీకరించాలి. ఈ వివరాలను సివిల్ సప్లయీస్ కమిషనర్ కార్యాలయానికి పంపాలి. అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాత పిల్లల పేర్లను కార్డులో చేర్చుతూ ఆమోదం ముద్ర వేయాలి. అయితే కొంత కాలంగా ఈ సర్వర్ సక్రమంగా పనిచేయకపోవటంతో పిల్లల పేర్లు చేర్చే అంశం నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటోంది. రేషన్‌కార్డులో పేరు నమోదు కాకపోవటంతో వారి పేరున రేషన్ రాకపోగా ఏదైనా ధ్రువపత్రం కోసం కార్యాలయానికి వెళితే పేరు లేని కారణంగా ధ్రువపత్రాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు అంగీకరించని పరిస్థితి నెలకొంది. రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించి ఏడాది కావస్తున్నా ఇంత వరకు కార్డులు ఎప్పుడిస్తారనే అంశంపై అధికారుల్లోనే స్పష్టత లేకుండాపోయింది. అక్టోబరు మొదటి వారంలో నూతన కార్డులు మంజూరు చేసే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే నూతన కార్డుల మంజూరు ప్రక్రియ ముందడుగు వేస్తుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
మీ-సేవ కేంద్రాల్లో అందని సేవలు
రేషన్ కార్డు ఉన్న వారు మీ-సేవ సర్వీస్ సెంటర్ల ద్వారా వివిధ సేవలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెప్పినా అవి పూర్తిస్థాయిలో అమలు కాని పరిస్థితి నెలకొంది. రేషన్‌కార్డులో పేరు తొల గించడం, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తే వలస వెళ్లిన ప్రాంతంలో రేషన్ పొందడం, యజమాని పేరు మార్చడం, డూప్లికేట్ రేషన్‌కార్డు తీసుకోవడం, గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడం, రేషన్‌కార్డు సరెండర్ చేయడం, పిల్లలు పుడితే వారి పేర్లను కార్డులో చేర్చడం, తెలుపుకార్డు నుంచి గులాబీ కార్డుకు మార్చుకోవడం, గులాబీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం తదితర సౌకర్యాలను కల్పించారు. వీటిలో కొన్ని అమలవుతుండగా మరికొన్ని అసలు అమలే జరగని పరిస్థితి నెలకొంది.