కాకినాడను మెయిన్ రైల్వేలైన్‌తో అనుసంధానం చేయాలనేది జిల్లావాసుల చిరకాల స్వప్నం.
మెయిన్‌లైన్‌తో కాకినాడ అనుసంధానంపై చిరుకదలిక
పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై భేటీలో ప్రస్తావన
లాభదాయకతతో నిమిత్తం లేకుండాచేపట్టాలన్న సీఎస్
సానుకూలంగా స్పందించిన ఆ శాఖ ఉన్నతాధికారులు
{పజాప్రతినిధుల కృషి తోడైతే కల సాకారమే..
కాకినాడ : కాకినాడను మెయిన్ రైల్వేలైన్‌తో అనుసంధానం చేయాలనేది జిల్లావాసుల చిరకాల స్వప్నం. ఈ కలను సాకారం చేస్తామంటూ నేతలు ప్రతి ఎన్నికల్లో ఊరించి, ఓట్లేయించుకోవడం, ఆనక ఆ ఊసే మరిచిపోవడం రివాజైంది. ఫలితంగా ఇంతకాలం మెయిన్‌లైన్‌లో విలీనం ఆచరణకు నోచని డిమాండ్‌గానే మిగిలిపోయింది. ఆ కల ఈసారైనా సాకారమవుతుందా అని ఎదురుచూస్తున్న జిల్లావాసులకు కొంత ఊరటనిచ్చే అంశం ఒకటి చోటుచేసుకుంది. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై రైల్వే ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు హైదరాబాద్‌లో గురువారం జరిపిన సమీక్షలో మెయిన్‌లైన్‌తో కాకినాడ అనుసంధానం డిమాండ్ కూడా చర్చకు వచ్చింది. సుమారు రూ.120 కోట్లు (గత అంచనాలు) ఖర్చుచేస్తే ఈ లైన్ ఆచరణ సాధ్యమయ్యేదే. కాకినాడ నుంచి పిఠాపురానికి కేవలం 21 కిలోమీటర్ల బ్రాడ్‌గేజ్ లైన్‌ను నాలుగు దశాబ్దాల క్రితమే ప్రతిపాదించారు. ఇందుకు 2012 బడ్జెట్‌లో రూ.12 కోట్లు, 2013 బడ్జెట్‌లో రూ.5 కోట్లు కేటాయించారు. కనీసం ఆ నిధులు కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేకపోయారు. నిధుల ఖర్చు మాట దేవుడెరుగు, ఆ రైల్వేలైన్ లాభదాయకం కాదంటూ రైల్వే బోర్డు తిరస్కరించడం పరిపాటిగా వస్తోంది. ఇదే కారణాన్ని చూపించి 2014 రైల్వే బడ్జెట్‌లో ఈ లైన్‌కు కేవలం రూ.కోటి కేటాయింపుతో సరిపుచ్చారు.
ఎలా చూసినా కీలకమే..
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో కార్గో ద్వారా అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే ప్రాంతం కాకినాడ. ఆదాయపరంగా చూసినా కాకినాడ పోర్టు కార్యకలాపాలతో రైల్వేకి ఏటా సుమారు రూ.400 కోట్లు వస్తోందని అంచనా. ప్రస్తుతం ఆదాయపరంగా చూసినా లేదా కోటిపల్లి రైల్వేలైన్ నరసాపురం వరకు పొడిగిస్తే ప్రయాణికుల ప రంగా చూసుకున్నా మెయిన్‌లైన్‌తో కాకినాడ అ నుసంధానం ప్రాధాన్యం ఉన్నదే. కాగా నిన్న టి సమీక్షలో ప్రధాన కార్యదర్శి లాభదాయకతతో సంబంధం లేకుండా అనుసంధానాన్ని చేపట్టాలని సూచించారు. రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టనున్నవేళ రైల్వే అధికారులు సానుకూలత జిల్లావాసులకు ఉపశమనాన్నిస్తోంది.
వైఎస్ హయాంలోనే చొరవ..
పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే బీజం పడింది. ఆ ప్రాజెక్టుల వ్యయంలో కొంత రాష్ట్రం మో స్తుందని వైఎస్ కేంద్రానికి తెలిపారు. వాటిలో కాకినాడ మెయిన్ లైన్ అనుసంధా నం కూడా ఒకటి. ఇప్పుడు సీఎస్ సూచనను రైల్వేశాఖ ఆమోదిస్తే నాలుగు దశాబ్దాల కల సాకారమయ్యే శుభఘడియలు దగ్గరపడ్డట్టే. అందుకు తగ్గట్టు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాల్సి ఉంది. ఎన్నికలప్పుడు కాకినాడ మెయిన్‌లైన్ సాధిస్తానని హామీ ఇచ్చిన కాకినాడ ఎంపీ తోట నరసింహంపై ప్రస్తుతం ఆ దిశగా చిత్తశుద్ధితో గట్టి ప్రయత్నమే చేయాల్సిన బాధ్యత ఉంది. అంతకు ముందు కాకినాడ ఎంపీగా ఉన్న ఎంఎం పళ్లంరాజు కేంద్ర మంత్రిగా పదోన్నతి పొందినా రైల్వే లైన్ సాకారం చేయలేక చేతులెత్తేశారు. అదే నిర్వాకాన్ని నరసింహం పునరావృతం చేస్తారో లేక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో వేచి చూస్తామని ఈ ప్రాంతవాసులంటున్నారు. ఈ ప్రాజెక్టు కోసం మూడుదశాబ్దాలు పోరాడి, అసువులుబాసిన రైల్వే ప్రయాణికుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.రత్నాజీ స్ఫూర్తితోనైనా తోట ఆ దిశగా కృషి చేయాలంటున్నారు.
రైలు కూత వినాలనుకుంటున్న ‘కోనసీమ’
మరోవైపు తమ చిరకాల ఆకాంక్ష అయిన కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ కూడా సాకారమైతే రైలు కూత వినాలని కోనసీమ వాసులు గంపెడాశతో ఉన్నారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఈ రైల్వేలైన్‌ను సాధిస్తానని పండుల రవీంద్రబాబు కోనసీమవాసులకు హామీ ఇచ్చారు. అనుకున్నట్టే ప్రజలు ఆయనను అమలాపురం ఎంపీని చేశారు. మరి ఆయన ఏమి చేస్తారో వేచిచూడాల్సిందే.