పంటపొలాలతో కళకళలాడు తున్న ఆ తండాలు ముంపునకు గురికానున్నాయి. ఎస్‌ఎల్‌బీసీలో అంతర్భాగమైన పెండ్లిపాకల ప్రాజెక్టు ఆధునికీకరణ పనులతో నాలుగుతండాలు జలమయంకానున్నాయి. ఇప్పటికే ఆయా తండాలపై అధికారులు సర్వే నిర్వహించి నివేదిక పంపారు. ఇక ఆమోదం లభిస్తే వలస బాట పట్టాల్సివస్తుందని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
దేవరకొండ మండలంలోని పెండ్లిపాకల ప్రాజెక్టు ఆధునికీకరణకోసం గత జూన్‌లో రూ.571.88 కోట్లు మంజూరయ్యాయి. అయితే ప్రాజెక్టు ఆధునికీకరణ వల్ల ప్రాజెక్టు కింద ఉన్న భూములు సస్యశ్యామలమవుతాయని, భూముల రేట్లు పెరుగుతాయని కొందరు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆధునికీకరణ పనుల వల్ల ముంపునకు గురయ్యే పెండ్లిపాకల గ్రామపంచాయతీ పరిధిలోని గుడితండా, హర్యాతండా, గాజీనగర్ గ్రామపంచాయతీ పరిధిలోని పత్యతండా, తార్‌బాయి తండాల గిరిజనులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నీటి పారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు ఆధునికీకరణ వల్ల ముంపునకు గురయ్యే తండాలపై సర్వే నిర్వహించి నివేదికను కలెక్టర్ ద్వారా ఏజెన్సీ అప్రూవల్ కోసం ఆర్‌అండ్‌ఆర్(పునరావాస) కమిషనర్‌కు పంపారు. అక్కడి నుంచి ప్రభుత్వ అనుమతి రావాల్సిఉంది. ప్రభుత్వ అనుమతి వస్తే ముంపు బాధితుల వివరాలు, పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వంటి అంశాలపై అధికారులు దృష్టి సారిస్తారు. ఇదిలా ఉంటే ఎన్నో ఏళ్లుగా ప్రాజెక్టు సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లో పంటలు సాగు చేసుకుంటూ బతుకుతున్న గిరిజనులు.. ఇక ఆ భూములు వదిలి, తండాలను ఖాళీ చేసి వెళ్లాల్సివస్తుందన్న విషయాలను జీర్ణించుకోలేకపోతున్నారు. పాలకులు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
నివేదిక పంపాం
నాలుగు తండాలు ముంపునకు గురికానున్నట్లు నీటిపారుదల శాఖ డివిజన్ -11 డీఈ అశోక్‌కుమార్ తెలిపారు. ముంపు విషయమై ప్రాథమిక సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు చెప్పారు. ప్రభుత్వ అనుమతి తర్వాతే తదుపరి ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
న్యాయం చేయాలి
మాకు మాత్రం ప్రభుత్వం తగిన న్యాయం చేయాలి. మా భూములకు, ఇళ్లకు రేటు కట్టిఇయ్యాలి. అన్ని రకాలుగా వసతులు కల్పించాలి. భూమికి బదులు భూమి ఇవ్వాలి. లేదంటే మేము సర్వేకు అంగీకరించం.
- లక్ష్మణ్‌నాయక్, గుడితండా
తండా వదిలి ఎక్కడికి వెళ్లాలి
ఇళ్లు, పొలాలు, గొడ్డు గోదా అన్నీ ఇక్కడే ఉన్నాయి. తండా వదిలి పొమ్మంటే ఎక్కడికి వెళ్లాలి. నిన్నమొన్ననే కష్టపడి రూ.3లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం. కాల్వ కింద మంచి భూమి ని వదిలిపెట్టి, చుట్టాలు, పక్కాలను వదిలి ఏదేశం పోవాలి.
- జమ్లి, బాధితురాలు
ముంపుబాధితులకు న్యాయం చేస్తాం
ప్రాజెక్టు ఆధునికీకరణ వల్ల తండాలు ముంపునకు గురికానున్నప్పటికీ వారికి అన్ని రకాలుగా లబ్ధిచేకూరేలా న్యాయం చేస్తాం. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీతోపాటు భూములకు మంచి రేటు వస్తుంది. ప్రాజెక్టు కింద 7వేల ఎకరాల ఆయకట్టు పెరుగుతుంది. ముంపు బాధితులకు ఎటువంటి అన్యాయం జరిగే ప్రసక్తేలేదు.
- నేనావత్ బాలునాయక్, దేవరకొండ ఎమ్మెల్యే
ఇదీ ప్రాజెక్టు స్వరూపం
ఎస్‌ఎల్‌బీసీలో భాగంగా శ్రీశైలం వద్ద టన్నెల్-1 ఇన్‌లెట్ నుంచి సొరంగమార్గం చేపట్టి నక్కలగండిలోని టన్నెల్-1 అవుట్‌లెట్ వద్ద రిజర్వాయర్ నిర్మాణం చేపడతారు. అక్కడి నుంచి(నక్కలగండి రిజర్వాయర్ నుంచి) టన్నెల్-2 ఇన్‌లెట్ ద్వారా చందంపేట మండలంలోని నేరడుగొమ్ము వద్ద టన్నెల్-2 అవుట్‌లెట్ వరకు 7 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం పూర్తి చేస్తారు. ఇదిలా ఉండగా నేరడుగొమ్ము నుంచి పెండ్లిపాకల రిజర్వాయర్ వరకు 14.635 కిలోమీటర్ల మేర ఓపెన్‌కెనాల్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ప్రాజెక్టు ఆధునికీకరణలో భాగంగా 0.5 టీఎంసీల సామర్థ్యంగల పెండ్లిపాకల ప్రాజెక్టును 2 టీఎంసీలకు పెంచాల్సి ఉంది. అలాగే ప్రాజెక్టు ఎత్తును 4మీటర్లకు పెంచాలి. ఈ పనులు చేపట్టడం ద్వారా నాలుగుతండాలు ముంపునకు గురికానున్నాయి
ముంపు.. ముప్పు
Published Wed, Oct 9 2013 4:48 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement