సాక్షి, నల్లగొండ: గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు.. తెలంగాణవాదం... అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ పథకాలు.. రాజకీయ అని శ్చితి.. గ్రూపు గొడవలు.. ఇదీ.. జిల్లావ్యాప్తంగా నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని వ్యూహాత్మకంగా చేపడుతోంది. పల్లెల్లోకి వెళ్తే నిలదీతలు, నిరసనలు తప్పవని భావించింది. వీటి దృష్ట్యా మండల, మున్సిపాలిటీ కేంద్రాల్లో మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిశ్చయించింది. ఈ మేరకు సోమవారం నుంచి 26 తేదీ వరకు రచ్చబండ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఓట్ల కోసం....
ఏడాదిన్నర కాలంగా జిల్లాలో కొత్తగా పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ కార్డులను ప్రభుత్వం అర్హత కలిగిన లబ్ధిదారులకు అందించలేకపోయింది. ఐదారుమాసాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మూడో విడత రచ్చబండకు తగిన ప్రణాళికతో ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు ఇటీవల మోక్షం కలిగించారు. అదికూడా అర్హుల్లో కొంతమందికే పథకాలు మంజూరు చేశారు. వీటికి రచ్చబండ -3లో మంజూరు పత్రాలు అందజేయనున్నారు. జిల్లాకు గత ఆగస్టులో 40 వేల మందికిపైగా పెన్షన్లు మంజూరయ్యాయి. వెంటనే వీరికి ప్రతినెలా పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది. కానీ సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదు.
ఇప్పటికి ఒక్క నెలకూడా పెన్షన్ అందజేయలేదు. వీరందరికి రచ్చబండలో మంజూరు పత్రాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీరుగాక ఇతర పథకాలకు సంబంధించి గుర్తించిన వారందరినీ రచ్చబండ జరిగే మండల, మున్సిపాలిటీ కేంద్రాలకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిగిలిన వారు హాజరుకాకపోవడంతో వినతులు తీసుకునే అవకాశం ఉండదు. అంతేగాక నిరసనల నుంచి గట్టెక్కవచ్చని సర్కారు ధీమాగా ఉంది. రాజకీయ లబ్ధిపొందడానికేనని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మొక్కుబడిగా మంజూరు పత్రాలు అందజేయడం, అదికూడా ప్రచార ఆర్భాటాలతో కార్యక్రమం నిర్వహించడం ఎన్నికల జిమ్మికుల్లో భాగమేనని అంటున్నారు.
అవసరం లేకున్నా కమిటీలు...
ప్రభుత్వం ఏ కార్యక్రమాన్నైనా తనకు అనుకూలంగా మలచుకుంటోంది. పేదలను ఆదుకునేది తమ ప్రభుత్వమేనని చెబుతూ ఓట్లు దండుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకు ఉదాహరణ ప్రస్తుతం జరగనున్న రచ్చబండయే. వాస్తవంగా రచ్చబండ నిర్వహణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ అవసరం లేదు. ఎందుకంటే పథకాలు మంజూరైన వారి అభ్యర్థులను ఇప్పటికే గుర్తించారు. వీరికే రచ్చబండ జరిగే రోజు మంజూరు పత్రాలు అందజేస్తారు.
ఈ మొత్తం తతంగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న కమిటీ అవసరం ఎంత మాత్రమూ లేదు. కానీ సర్కారు కమిటీలు రూపొందించడమేగాక అందులో అధికార పార్టీకి చెందిన వారినే సభ్యులుగా నియమిస్తున్నారు. తద్వారా తామే పథకాలు మంజూరు చేశామని చెప్పుకోవడానికి వీలుంటుంది. అంతేగాక తమది సంక్షేమ ప్రభుత్వమని ప్రచారం చేసుకుంటుంది. తద్వారా మండల, జిల్లాపరిషత్, సార్వత్రిక ఎన్నికలల్లో లబ్ధి పొందేందుకు మార్గం సుగమం చేసుకుంటోంది.
రచ్చ.. రాజకీయం
Published Mon, Nov 11 2013 3:44 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement