సాక్షి, కర్నూలు: రచ్చబండలో అధికార పార్టీ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ విడత పార్టీ ప్రమేయాన్ని మరింత పెంచినట్లు స్పష్టమవుతోంది. కార్యక్రమంలో పారదర్శకత తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ విడత ప్రభుత్వం ప్రత్యేక కమిటీలకు శ్రీకారం చుట్టింది.
పతి మండలంలో ఆరుగురు అధికారులు, ముగ్గురు సభ్యులకు ఇందులో చోటు కల్పిస్తున్నారు. సభ్యుల్లో సర్పంచ్, ఓ మహిళ, మైనార్టీ వర్గం నుంచి లేదా వార్డు సభ్యుడిని, ఎవరైనా నాయకుడిని ఎంపిక చేసే వీలుంది. ఈ అవకాశాన్ని అధికార పార్టీ నేతలు సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఆయా ప్రాంతాల్లోని ముఖ్య నాయకుల కనుసన్నల్లో 20 రోజుల క్రితం సిద్ధమైన జాబితాలనే అధికారులు ఆమోదించినట్లు సమాచారం. ఉదాహరణకు నంద్యాల పార్లమెంట్ పరిధిలోని మహానంది మండల కమిటీని పరిశీలిస్తే.. సర్పంచ్ జయసింహారెడ్డి, తిమ్మాపురం ఉప సర్పంచ్ అనసూయమ్మ, గోపవరం సింగిల్ విండో సొసైటీ అధ్యక్షుడు కొండారెడ్డి ముగ్గురూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. పలు మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యలకు, పార్టీ సర్పంచ్‌లకే కమిటీలో అవకాశం కల్పించారు. ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెసేతరులకూ అవకాశమే దక్కకపోవడంతో రచ్చబండలో పారదర్శకత ఎలా సాధ్యమనే చర్చ జరుగుతోంది.
కమిటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతినిధులనే ఎంపిక చేయడం వెనుక నిరుపేదలకు అండగా నిలుస్తోంది తమ ప్రభుత్వమే అని బలంగా వినిపించేందుకేనని తెలుస్తోంది. కాంగ్రెసేతర ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు, మండలాల్లో ఈ కమిటీ ప్రాబల్యాన్ని మరింత పెంచే యోచనలో అధికార పార్టీ ముమ్మర కసరత్తు చేసినట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీ నేతలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకండా పింఛన్లు, ఇళ్లు అన్నీ తామే ఇస్తున్నామని చెప్పుకునేందుకు ఈ కమిటీలు ఉపయోగపడనున్నాయి.
రచ్చబండ నిర్వహణ, దరఖాస్తుల స్వీకరణ, అర్హుల ఎంపికలో పారదర్శకత తదితర విషయాలను కమిటీలు పరిశీలించాల్సి ఉంటుంది. ఇన్‌చార్జి మంత్రి ప్రతినిధులుగా లబ్ధిదారులకు వివిధ పథకాల అందజేతలోనూ వారు పాల్పంచుకోనున్నారు. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కమిటీలను అధికార పార్టీ అన్నివిధాల ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. వేదికపై ఉపన్యసించడంతో పాటు రచ్చబండలో వీరు కీలకం కానున్నారు. ఈ పరిస్థితుల్లో రచ్చబండలో ఏ మేరకు పారదర్శకత ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పారదర్శ‘కథ’
Published Mon, Nov 11 2013 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM
Advertisement