
అమ్మో.. అక్టోబర్ రెండా!
ఏలూరు : వంద రోజుల పాలన పూర్తయింది, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం సాధించింది శూన్యం కావడంతో పాలనపై ప్రజలు పెదవి విరుస్తుండగా.. ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయిఈ పరిస్థితుల్లో ఏదో ఒకటి చేశామని పించుకునేందుకు పాలకులు కసరత్తు చేస్తున్నారు. ఆ బాధ్యతను మాత్రం అధికార యంత్రాంగంపైనే వేస్తున్నారు. అక్టోబర్ 2నుంచి సామాజిక పింఛను మొత్తాల్ని పెంచుతున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను కుదిం చే కసరత్తు మొదలుపెట్టింది. వివిధ పథకాలకు సంబంధించి గతంలో ఇచ్చి న మంజూరు పత్రాలను రద్దు చేసే కార్యక్రమానికీ తెరలేపింది. ఈ బాధ్యతలతోపాటు కొత్త కార్యక్రమాల అమలుకు సంబంధించిన పనుల భారం కూడా అధికారుల నెత్తినపడింది. దీంతో అక్టోబర్ 2వ తేదీని తలచుకుని అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.
పథకాల సంకటం
కొత్త పథకాల అమలు, పాత పథకాలను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అధికారులకు సంకటంగా మారాయి. అక్టోబర్ 2 నుం చి వివిధ పథకాల అమలుకు శ్రీకారం చుడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో అధికారులు, ఉద్యోగులు ఉరుకులు.. పరుగులు పెడుతున్నారు. అదే రోజు నుంచి లబ్ధిదారులకు ఇచ్చే పింఛ ను మొత్తాల పెంపుదల కార్యక్రమంతోపాటు రూ.2కే 20 లీటర్ల నీరందించే ఎన్టీఆర్ సుజల స్రవంతి, జన్మభూమి-మన ఊరు, 24 గంటల విద్యుత్ సరఫరా తదితర కార్యక్రమాలను అమలు చేయూల్సి ఉంది. మరోవైపు గతంలో వివిధ పథకాలకు సంబంధించి అధికారులు ఇచ్చిన మంజూరును వారిచేతే రద్దు చేరయిం చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 23 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు ఇస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి, అదేనెల 3న విజయదశమి కాగా, సెలవు రోజుల్లో ఊపిరి సలపని కార్యక్రమాలు నిర్వహించాల్సి రావడంతో అధికారులు ఆయూ పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసే విష యంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
పింఛను లబ్ధిదారుల్లో కలవరం
ఇప్పటికే పింఛన్లు పొందుతున్న వారి అర్హతలను తనిఖీ చేసే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం అంతా టీడీపీ నాయకులు, కార్యకర్తల కనుసన్నల్లోనే జరుగుతోంది. అనర్హత పేరిట లబ్ధిదారుల సంఖ్యను కుదించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. పనిలో పనిగా టీడీపీ శ్రేణు లు సూచించేవారికి పింఛన్లు ఇవ్వాలంటూ ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు చేస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమం వల్ల అర్హులైన పింఛనుదారులు రోడ్డునపడే ప్రమాదం కనిపిస్తోంది. టీడీపీ శ్రేణుల సూచనల మేరకు అర్హులైన వారిని తొలగిస్తే ఆ పాపం తమకు చుట్టుకుంటుందని అధికారులు, ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
పాత వాళ్లకు తొలగించి.. కొత్త వాళ్లకిస్తారట
జిల్లాలో వితంతు, వృద్ధాప్య, వికలాంగ, చేనేత పిం ఛన్లు అందుకుంటున్న లబ్ధిదారుల సంఖ్య 3,30,661 కాగా, వీరంతా ఆధార్ కార్డు జిరాక్స్, వయసు, వైకల్యం ధ్రువీకరణ పత్రాలను అందిస్తేనే వారికి పింఛను కొనసాగుతుంది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల అర్హతలను తనిఖీ చేసే కార్యక్రమం ఆదివారం వరకూ నిర్వహిస్తున్నారు. ఇది ముగిశాక.. సోమవారం నుంచి పింఛన్ల కోసం కొత్త వారినుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక చేత్తో పాత పింఛన్లు తొలగించి.. మరోచేత్తో కొత్తవారికి మంజూ రు చేయటం ద్వారా గొప్పలు చెప్పుకునేందుకు ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి
జన్మభూమి ఎపిసోడ్ కొనసాగింపు
అక్టోబర్ 2నుంచి ‘జన్మభూమి-మన ఊరు’ పేరుతో జన్మభూమి ఎపిసోడ్‌ను కొనసాగించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి గ్రామం, శివారు ప్రాం తాల్లో గ్రామ సభలు నిర్వహించి, ప్రభుత్వ కార్యక్రమాలను వివరించేలా రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాలు, పశు వైద్య శిబిరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలోనూ ఇదేవిధంగా గ్రామసభలు పెట్టి ప్రజలతో తిట్టించుకున్న అధికారులు మళ్లీ ఆ కార్యక్రమం పేరు చెబితే హడలిపోతున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, రాజధానిలో ఆయా శాఖల ఉన్నతాధికారుల సమీక్షలతో అధికారులకు ఊపిరి సలపడం లేదు. ఈ పరిస్థితుల్లో అక్టోబర్ 2నుంచి తలపెట్టే కార్యక్రమాలను తలచుకుని వారంతా డీలాపడుతున్నారు.
ఆర్వో ప్లాంట్ల స్థాపన అనుమానమే
జిల్లాలో సుజల స్రవంతి కార్యక్రమం కింద మొదటి దశలో 435 ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని యంత్రాంగం నిర్ణయించింది. వీటిని స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణలో నడపాల్సి ఉంటుంది. వీటిని నడపడానికి ఇప్పటివరకు 200 మంది మాత్రమే ముందుకొచ్చారు. దీంతో మిగిలిన ప్లాంట్లను ఎలా ఏర్పాటు చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నెల 18వరకు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుపై అవగాహన శిబిరాలు నిర్వహించినా ఎవరూ పెద్దగా స్పందించలేదు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి అల్లూరి నాగరాజువర్మ దాతలను కలిసి ప్లాంట్ల ఏర్పాటుకు సహకరించాలని అభ్యర్థిస్తున్నారు. అక్టోబర్ 2నాటికి సగం ప్లాంట్లరుునా ఏర్పాటు చేసేలా ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు కృషి చేస్తున్నారు.
నిరంతరాయ విద్యుత్ అనుమానమే
ప్రభుత్వం పేర్కొన్న ప్రాధాన్యత అంశాల్లో భాగంగా అక్టోబర్ 2 నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు 24 గంటలూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయూల్సి ఉంది. పట్టణాలు, మండల కేంద్రాల్లో ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం 444 వ్యవసాయ ఫీడర్ల నుంచి త్రీ ఫేజ్‌ను వేరు చేయూల్సి ఉంది. మొదటి దశలో 159 ఫీడర్లను వేరుచేసి లైన్లు వేయాల్సి ఉంది. ఈ కార్యక్రమం నేటికీ పూర్తికాలేదు. ఎప్పటికి అవుతుందనేది విద్యుత్ శాఖ అధికారులకే తెలి యడం లేదు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో 24 గంటలూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసే కార్యక్రమం అనుమానంగానే ఉంది.