గాలిలో వైద్యం | Pension distribution, stampede, beneficiaries | Sakshi
Sakshi News home page

గాలిలో వైద్యం

Published Thu, Nov 13 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

గాలిలో వైద్యం

గాలిలో వైద్యం

కడప అగ్రికల్చర్ : జిల్లా పశుసంవర్ధకశాఖ కష్టాలలో కునారిల్లుతోంది. శాఖను  సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో వైద్య సేవలు కుంటుపడుతున్నాయి. దీంతో  పశువుల యజమానులు, గొర్రెల పెంపకందార్లు నానా అవస్థలు పడుతున్నారు. సరైన వైద్యం అందక పశువులు మరణించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

క్షేత్రస్థాయి ఉద్యోగులను సకాలంలో నియమించకపోతే పశువైద్యానికి తిప్పలు తప్పవని  అధికారులు చెబుతున్నారు. కడప జేడీ కార్యాలయంలో రెఫరల్ కేసులను చూడాల్సిన అసిస్టెంట్ డైరక్టర్లు ఇద్దరిలో ఒకరు రాయచోటి పశువైద్యశాలకు డిప్యుటేషన్‌పై వెళ్లగా, మరో ఏడీని జేడీ కార్యాలయంలో టెక్నికల్ ఏడీగా డిప్యూట్ చేశారు. దీంతో పశువులకు మెరుగైన వైద్యం అందించే అవకాశం లేకుండా పోయింది.

 జిల్లాలో 156 పోస్టులు ఖాళీ...
 పశువైద్యంలో వెటర్నరీ అసిస్టెంట్లే కీలకం. అయితే ఈ పోస్టులు 50 శాతం ఖాళీగా ఉంటున్నాయి. జిల్లా కేంద్రంలో పరిపాల పరంగా మూడు డీడీ పోస్టులకుగాను ఒకటి డిప్యూటేషన్‌లో పూర్తికాగా, రెండు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో ఐదు డివిజన్లు ఉన్నాయి. వీటిలో 102 వెటర్నరీ డిస్పెన్సరీలు ఉండగా 110 మంది పనిచేస్తున్నారు. అయితే ఇందులో 1 పోస్టు ఖాళీ ఉంది.

12 వెటర్నరీ ఆసిస్టెంట్లు ఉండాలి, కానీ 1 ఖాళీగా దర్శనమిస్తోంది. రూరల్ లైవ్ స్టాక్ యూనిట్స్(ఆర్‌ఎల్ యు) కడపతో సహా 51 మండలాల్లో 131 ఉన్నాయి. వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసర్స్ 26 ఉండగా ఇందులో 10 ఖాళీలున్నాయి. జూనియర్ వెటర్నరీ ఆఫీసర్లు 51 మందికిగాను 10 ఖాళీలు ఉన్నాయి. లైవ్‌స్టాక్ అసిస్టెంట్స్(ఎల్‌ఎస్‌ఎ) 90కి గాను 40 ఖాళీలున్నాయి. వెర్నరీ అసిస్టెంట్ పోస్టులు 72కుగాను 51 ఖాళీలు దర్శనమిస్తున్నాయి.

ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి జాయింట్ డైరక్టర్ల సమీక్షలో క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను పూసగుచ్చినట్లు వివరించామని, ప్రభుత్వానికి నివేదికలను పంపినా ఇంత వరకు ఏలాంటి స్పందన లేదని శాఖ అధికారులు బహిరంగంగానే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో పశువులకు వైద్యం అందించడం గగనమవుతోందని అధికారులు చెబుతున్నారు.

 రెఫరల్ కేసులను  పట్టించుకునేవారేలేరు..:
 మండల కేంద్రాల్లో నయం కాని పశువ్యాధులను అక్కడి వైద్యులు జిల్లా కేంద్రమైన కడప లోని జేడీ కార్యాలయంలో ఉన్న పాలీక్లీనిక్‌కు పంపుతారు. ఇక్కడి పాలీక్లీనిక్‌లో అసిస్టెంట్ డైరక్టర్లు, మరో ఇద్దరు వైద్యులు ఉంటారు.  ఆ అసిస్టెంట్ డైరక్టర్లు, వైద్యులు ఆ వ్యాధిపట్ల ఓ అవగాహనకు వచ్చి నిర్ధారణ కేంద్రానికి పంపడమా,లేదా వ్యాధిపై అవగాహన ఉంటే శస్త్ర చికిత్స చే యడానికి సిద్ధమవడమో ఏదో ఒకటి చేయాలి. కానీ ఇద్దరు అసిస్టెంట్ డైరక్టర్లు డెప్యూటేషన్‌లో ఉండడం వల్ల ఆ పాలీక్లీనిక్‌కు ఇద్దరు డాక్టర్లే దిక్కయ్యారు.  దీంతో వ్యాధులతో వచ్చే పశువులకు శస్త్ర చికిత్సలు చేయడానికి వీలు లేకుండా పోయింది.
 
 గోపాలమిత్రలే దిక్కు..:
 ప్రాధమిక చికిత్స కోసం, కృత్రిమ గర్భోత్పత్తి చేయడానికి పశువైద్యశాలలు లేని చోట ప్రభుత్వం గోపాలమిత్రలను ప్రవేశపెట్టింది.జిల్లాలో 7 మంది గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. అధికారులు, వైద్యులు, సిబ్బంది సలహా మేరకు అనుభవమున్న ప్రైవేటు సిబ్బంది పశువైద్యం చేయాలనేదే దీని ఉద్ధేశం. సదుపాయాలులేని చోట్ల పశువులకు వైద్యం అందించి గౌరవ వేతనం పొందేలా రాష్ట్ర పశుసంవర్ధకశాఖ గోపాలమిత్రలను నియమించింది.

పశుసంవర్ధకశాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గోపాలమిత్రలే దిక్కయ్యారు. శాఖ సిబ్బంది కొరత కారణంగా వీరు అటు ప్రాధమిక చికిత్స అందించేందుకు ఎక్కువ సమయం  కేటాయించలేక ఇటు కృత్రిమ గర్భోత్పత్తి లక్ష్యాలు పూర్తి చేయలేక నానా అవస్థలు పడుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు ఏటా కరువు భత్యం, పే రివిజన్ భారీగా పెరుగుతున్నా వీరికిచ్చే గౌరవ వేతనం చూస్తే గొర్రెతోక బెత్తెడు అన్న చందంగా ఉంటోంది. ఖర్చు చూస్తే తడిసి మోపెడవుతోందని, ఆదాయం చూస్తే ఏమీ లేదని గోపాలమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement