అనంతపురం సిటీ, న్యూస్‌లైన్ : కుటుంబ పెద్ద దిక్కు(భర్త) కోల్పోయి నిరాశ్రయులైన వితంతువుల పింఛన్ల మంజూరుకూ ప్రభుత్వం రాజకీయ రంగు పులుముతోంది. వితంతు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా మోక్షం కలగడం లేదు. మహానేత హయాంలో ప్రతి నెలా అర్హులైన వారికి పింఛన్లు మంజూరయ్యేవి. నేడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పింఛన్‌దారులను ఓటు బ్యాంకు కోసం ఉపయోగపడేలా మలచుకుంటున్నారు. ‘రచ్చబండ’లనే వేదికగా చేసుకుంటున్నారు. కొత్త పింఛన్లు ‘రచ్చబండ’ బహిరంగ సభలో మాత్రమే మంజూరు చేయించి కాంగ్రెస్ మార్కును వేసుకుంటున్నారు.
సాకులతో 10 వేల పింఛన్ల రద్దు
జిల్లా వ్యాప్తంగా 95,697 మంది వితంతువులు ప్రతి నెలా పింఛన్లు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో అనవసర కారణాలు చూపి పింఛన్లు తొలగిస్తోంది. ఇందులో భాగంగా 2010లో అధికారుల బృందం నిర్వహించిన సర్వేలో స్వగ్రామంలో లేరని, అత్తగారింట్లో ఉంటున్నార ని, ఉపాధి కోసం ఇతర గ్రామాలకు వలస వెళ్లారనే చిన్న చిన్న కారణాలు చూపి పది వేల వితంతు పింఛన్లు రద్దు చేసింది. ఇప్పటికే భర్తను కోల్పోయి కుటుంబ పోషణ కోసం అగచాట్లు పడుతున్న వితంతువులకు ‘పింఛన్ రద్దు’ ఆవేదన కలిగిస్తోంది.
రచ్చబండ-3 తర్వాత కొత్త పింఛన్ల కోసం 3075 మంది వితంతువులు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని ఐకేపీ అధికారులు ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి సమర్పించారు. నాలుగు నెలలు గడుస్తున్నా అతీగతీ లేదు. దరఖాస్తు చేసుకున్న అభాగ్యులు పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ మార్కు కోసం తహతహలాడుతున్న పాలకులు ‘రచ్చబండ’ ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే కొత్త పింఛన్లు మంజూరు చేసి తామే మంజూరు చేయించామన్న క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రతినెలా విధిగా కొత్త పింఛన్లు మంజూరు చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఏడాది, రెండేళ్లకోసారి నిర్వహించే రచ్చబండ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కొత్త పింఛన్ల కోసం లబ్ధిదారులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూడాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది.
కాంగ్రెస్ మార్క్ కోసం తహతహ!
రచ్చబండ-1లో 57,430 దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో అధికారులు 18,330 మందిని అర్హులుగా గుర్తిస్తూ మిగిలిన వారికి పింఛన్ల మంజూరుకు పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)కు ప్రతిపాదించారు. వీటిని పరిశీలించిన సెర్ప్ 12,312 మందికి పింఛన్లు మంజూరు చేసింది. మిగిలిన లబ్ధిదారులకు మలి విడతలో మంజూరు చేస్తామని పేర్కొంది. ఇదిలా ఉండగానే రచ్చబండ-2లో 33,359 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులోనూ అధికారులు వడపోత కార్యక్రమం చేపట్టారు. చివరకు 25,975 వేల మందిని అనర్హులుగా గుర్తిస్తూ సెర్ప్‌కు ప్రతిపాదనలు పంపారు. ఇందులో ఉప ఎన్నికలు జరిగిన అనంతపురం, రాయదుర్గం నియోజకవర్గాల్లోని లబ్ధిదారులకు 1,975 పింఛన్లు మంజూరు చేశారు. ఇదిలా ఉంటే త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 24 వేల కొత్త పింఛన్లను గతేడాది డిసెంబర్ ఆఖరులో నిర్వహించిన రచ్చబండ-3లో ప్రభుత్వం మంజూరు చేసి తన మార్కును వేసుకుంది. రచ్చబండ అనంతరం కూడా దరఖాస్తులు భారీగా వచ్చాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా తమకు పింఛన్లు మంజూరు చేయడంటూ 10,634 మంది (వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, గీతకార్మికులు) దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొత్తగా పింఛన్లు మంజూరవుతాయా.. లేదా అని దరఖాస్తుదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రూ.47 లక్షల పింఛన్ల సొమ్ము హాంఫట్!
పింఛన్ల పంపిణీలో పారదర్శకత తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్మార్ట్‌కార్డ్’ విధానం అక్రమార్కులకు కల్పతరువుగా మారింది. చనిపోయిన, వలస వెళ్లిన వారి పేరు మీద అందినకాడికి దోచుకున్నారు. ఎక్కువ శాతం గ్రామాల్లో స్మార్ట్‌కార్డ్ యంత్రాలు సరిగా పని చేయకపోయినా... చేస్తున్నట్లు చూపిస్తున్నారు. చనిపోయిన, గ్రామాలు వదిలి వలసపోయిన వారి పేరు మీద మంజూరైన పింఛన్లను స్వాహా చేస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రూ.47 లక్షలు దోచుకున్నట్లు సామాజిక తనిఖీల్లో బహిర్గతమైతే.. అక్రమార్కుల నుంచి కేవలం రూ.9 లక్షలు మాత్రమే రికవరీ చేశారు. మిగిలిన సొమ్ము రికవరీ చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
వితంతు పింఛన్‌కు
అర్హులు ఎవరంటే...
వితంతు పింఛన్ పొందాలంటే 18 సంవత్సరాలు పైబడిన మహిళలు భర్త చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. మతిస్థిమితం లేని భర్తతో కాపురం చేస్తున్న మహిళ, భర్త వదిలేసి వెళ్లి ఉంటే భర్త వదిలేసి వెళ్లాడని తాను నివసించే ఊరి/ప్రాంత పెద్దల ద్వారా డిక్లరేషన్ తీసుకు వస్తే వారు కూడా వితంతు పింఛన్లకు అర్హులే.
ఏడిపింఛెన్!
Published Sun, Jan 26 2014 2:55 AM | Last Updated on Fri, Jun 1 2018 8:54 PM
Advertisement
Advertisement