
అధికార పార్టీ వారికే పింఛన్!
మంగళగిరి రూరల్ : రాజధాని పరిధిలోని గ్రామాల్లో అరులైన రైతు కూలీలకు, భూమిలేని రైతు కుటుంబాలకు పింఛన్ ఇవ్వడంలో అనేక అవకతవకలు జరిగాయి. ఒక్కో గ్రామంలో మొక్కుబడిగా నలుగురైదుగురికి పింఛన్లు పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. రాజధాని ప్రాంతంలోని పేదలకు జీవన భృతిగా నెలకు రూ.2500 ల చొప్పున పింఛన్లు మంజూరు చేస్తామని, అవసరమైతే ఇంటింటికి తిరిగి పంపిణీ చేస్తామని మంత్రులు గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. కానీ ఆచరణలో అందుకు భిన్నంగా జరుగుతోంది.
గ్రామా ల్లో ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ) అధికారులు సర్వే నిర్వహించి మొత్తం 4542 మందిని అర్హులుగా గుర్తించి డీఆర్‌డీఏకు ప్రతిపాదనలు పం పారు. మండలంలోని కృష్ణాయపాలెంలో 394 మంది, యర్రబాలెంలో 1625 మంది, నవులూరులో 1333 మంది, నిడమర్రులో 372మంది, కురగల్లులో 404 మంది, బేతపూడిలో 136 మం ది, నీరుకొండలో 277మందితో తుది జాబితాలు తయారు చేసి డీఆర్‌డీఏ అధికారులు గ్రామాలకు పంపారు. అనంతరం సీఆర్‌డీఏ అధికారుల పర్యవేక్షణలో టీడీపీ నేతలతో పింఛన్ కమిటీని నియమించారు. ఇంకేముంది వారు అడింది ఆట పాడింది పాట.
అర్హులైన పేద రైతు కూలీలు, భూమి లేని రైతుల పేర్లను పక్కనబెట్టి టీడీపీకి చెందిన వారికి మాత్రమే పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అప్పటి వరకు తమ పేర్లు జాబితాలో ఉన్నాయని మురిసిపోయిన వైఎస్సార్ సీపీ సానుభూతి ప రులు విషయం తెలుసుకుని ఒక్కసారిగా కంగుతిన్నారు. కంటనీరు పెట్టుకుంటున్నారు. అన్ని అ ర్హతలు ఉన్నప్పటికీ పింఛన్ల పంపిణీలో తమ కు అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు.
అర్హులకు మొండిచేయి
గ్రామాల్లో చాలా మంది అర్హులకు పింఛన్ మం జూరు కాలేదు. తమకు అన్యాయం చేశారని భూ మిలేని రైతులు, రైతు కూలీలు వాపోతున్నారు. అనర్హులే జాబితాలో అధిక సంఖ్యలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఆర్‌డీఏ అధికారు లు, కమిటీ సభ్యులు కుమ్మక్కై అనర్హులకు జాబి తాలో చోటు కల్పించారనే విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. గ్రామాల్లో విచారణ జరిపి, అవసరమైతే రీ సర్వే నిర్వహించి అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. పలువురి అభిప్రాయాలు వారి మాటల్లోనే...
సెంటు భూమిలేదు
సెంటు భూమి లేదు. వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. అయినా పింఛను మంజూరు చేయలేదు. అదేమని అడిగితే సమాధానం చెప్పేవారే కరువయ్యారు. తొలి జాబితాలో పేరు వచ్చినా తుది జాబితాలో పేరును తీసి నా కుటుంబానికి అన్యాయం చేశారు.
- పులివర్తి నరసింహారావు, కృష్ణాయపాలెం
అర్హత ఉన్నా పింఛను రాలేదు
పింఛను వచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. భూమి లేదు. కూలీ పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే వాడిని. ప్రస్తుతం పక్షవాతంతో బాధపడుతూ ఇంటి వద్దే ఉంటున్నా. పింఛను జాబితాలో పేరు లేదు. అదేమని అడిగితే రెండవ జాబితాలో వస్తుందని చెబుతున్నారు.
- బేతపూడి సుంకరి, నవులూరు
ఆశలు అడి ఆశలు
కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నా. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ఉంది. అయినా పింఛను జాబితా లో పేరు రాలేదు. అదేమని అడిగితే మరలా దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. పింఛను వస్తే కుటుంబానికి ఆసరాగా వుంటుందని ఆశపడ్డా. నా ఆశలు అడియాశలుగానే మిగిలాయి.
- వాసా శివపార్వతి, బేతపూడి
పొలం ఉన్న వారికే పింఛన్లు ఇస్తున్నారు
గ్రామంలో పొలం వున్న వారికే పింఛన్లు ఇస్తున్నారు. పొలం లేని నాబోటివారి పేర్లు జాబితాలో లేకుండా తొలగించారు. కుండలు అమ్ముకుని జీవించే నాపై ముగ్గురు ఆధారపడి ఉన్నారు. పింఛను వస్తే బాగుండేదనుకున్నా. ఏమి చేయా లో కూడా పాలు పోవడం లేదు.
- శనగారపు భూలక్ష్మి, కురగల్లు
రీ సర్వే చేయించాలి
పింఛన్ల మంజూరులో లోపాలు ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులకు పింఛన్లు రాకుండా చేశారు. రీ సర్వే చేయించి అర్హులకు పింఛన్లు వచ్చేలా చూడాలి. పింఛన్ల ఎం పిక కమిటీ వారు, సీఆర్‌డీఏ అధికారుల నిర్వాకం కారణంగానే పింఛను రాలేదు.
- బొంతా సుబ్బమ్మ, కురగల్లు