సాక్షి, అమరావతి: వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతోపాటు విధి వంచితులైన ఇతరులకు పెరిగిన పింఛన్ సొమ్ము పంపిణీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కిడ్నీ రోగులకు రూ.10 వేలు, దివ్యాంగులకు రూ.3 వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.2,250 చొప్పున పంపిణీ చేయనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ జిల్లా జమ్ములమడుగులో సోమవారం నిర్వహించే బహిరంగ సభలో పెరిగిన పింఛన్ మొత్తాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా పంపిణీ చేయనున్నారు. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణ వార్డుల్లో ఆహ్లాదకర వాతావరణంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ చేపట్టాలని సెర్ప్ సీఈవో రాజాబాబు అన్ని జిల్లాల సిబ్బందిని ఆదేశించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 53,85,787 మంది పింఛనుదారులు ఉండగా, పెరిగిన పెన్షన్ మొత్తం మేరకు జూన్ నెలకు సంబంధించి రూ.1,305.85 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఐదు నెలల కిత్రం వరకు ఈ పింఛనుదారులకే ప్రతినెలా కేవలం రూ.569 కోట్లు మాత్రమే పంపిణీ అయ్యేది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఏడాదికి కేవలం రూ.5,436 కోట్లు, 2018–19లో రూ.8,234 కోట్లను పెన్షన్ల రూపంలో పంపిణీ చేయగా.. ఇప్పుడు ఆ మొత్తం భారీగా పెరిగింది. ఇప్పుడున్న పింఛన్‌దారులకు పంపిణీ చేయడానికే ఏడాదికి రూ.15,670 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది.
లబ్ధిదారులకు సీఎం లేఖలు
ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తం పెంచిన విషయాన్ని తెలియజేస్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లబ్ధిదారులకు నేరుగా లేఖలు రాయనున్నారు. జూలై 8నుంచి మొదలయ్యే కార్యక్రమంలో లబ్ధిదారులకు పెంచిన మొత్తాలతోపాటు సీఎం రాసిన లేఖలను కూడా అధికారులు పంపిణీ చేస్తారు. పింఛనుదారులందరికీ కొత్త పింఛన్ పుస్తకాలను కూడా పంపిణీ చేయడానికి సెర్ప్ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి
వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే వృద్ధులు, వితంతువులకు ఇచ్చే పింఛన్లను రూ.2 వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి 2017 జూలై 9న ప్రకటన చేశారు. రెండేళ్ల పాటు పెన్షన్ల పెంపును పట్టించుకోని చంద్రబాబు సర్కార్.. ఆ తరువాత ఎన్నికల ముందు ఫిబ్రవరిలో పెంపు ప్రకటన చేసింది. ఆ సందర్భంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెన్షన్ మొత్తాన్ని మరింత పెంచుతానని హామీ ఇస్తూ.. రూ.2,250 నుంచి ఏటా పెంచుతూ ఐదేళ్లలో ఆ మొత్తాన్ని రూ.3 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే అధికారికంగా పెంపు ప్రకటన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment