
సాక్షి, అమరావతి: రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించే సుపరిపాలన ప్రారంభమైంది. ప్రమాణ స్వీకార వేదిక నుంచే సంక్షేమ అజెండా అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. అవినీతి నిర్మూలన, జవాబుదారీతనం, సత్వర సేవలు అందించడంతోపాటు పాలనలో విప్లవాత్మకమైన మార్పులకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్ జగన్ పింఛన్ల పెంపుపై తొలి సంతకం చేయడంతోపాటు గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రకటించడం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఫలితంగా కొత్తగా 5.50 లక్షల మందికి వృద్ధాప్య పింఛన్ల ప్రయోజనంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 5.60 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నారు.
నవయుగానికి శ్రీకారం
ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి వైఎస్ జగన్ గురువారమే పదవీ బాధ్యతలు చేపట్టారు. పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను వెంటనే అమలు చేయాలని ఆయన్ను ఎవరూ డిమాండ్ చేయలేదు. అయితే తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్ తన తొలి అడుగులోనే మేనిఫెస్టో అమలు పట్ల నిబద్ధత కనబరిచారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పింఛన్ల పెంపు ఫైలుపై తొలి సంతకం చేసి ‘వైఎస్సార్ పింఛన్ కానుక’ పథకాన్ని ప్రారంభించారు. గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి 5.60 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టమైన కాల వ్యవధితో ప్రకటన చేశారు. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని కార్యాచరణ ప్రకటించి రాజన్న రాజ్యం దిశగా ముందడుగు వేశారు.
పింఛన్లతో సంక్షేమ రాజ్యం
అవ్వా తాతలకు మాటిచ్చిన మనవడిగా పింఛన్లను పెంచుతూ సీఎం వైఎస్ జగన్ తొలి సంతకం చేశారు. నెలకు రూ.2 వేలుగా ఉన్న పింఛన్‌ను ఆయన నెలకు రూ.2,250కి పెంచారు. వచ్చే ఏడాది రూ.2,500కు, ఆ తరువాత ఏడాది రూ.2,750కు, ఆ తరువాత ఏడాది రూ.3 వేలకు పెంచుతామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. గురువారం సాయంత్రానికే ఆమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, హెచ్‌ఐవీ బాధితులకు ప్రస్తుతం నెలకు రూ.2 వేలుగా ఉన్న పింఛన్‌ను జగన్ నెలకు రూ.2,250కు పెంచారు. వికలాంగుల పింఛన్లలో అంతవరకు ఉన్న రెండు కేటగిరీలను ఒకే కేటగిరీ కిందకు తెచ్చారు. అందరికీ నెలకు పింఛన్‌ను రూ.3 వేలకు పెంచారు. డయాలసిస్ పేషంట్లకు ఇప్పటిదాకా నెలకు రూ.3,500 చొప్పున ఇస్తున్న పింఛన్‌ను ఏకంగా రూ.10 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఒక్క సంతకంతో లక్షల మందికి మేలు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించడంతో కొత్తగా 5.50 లక్షల మంది పింఛన్ల పరిధిలోకి వచ్చి ప్రయోజనం పొందనున్నారు. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లు పొందుతున్న వారి సంఖ్య 23,30,377 వరకు ఉంది. గణాంకాల ప్రకారం ప్రస్తుతం అన్ని రకాల పింఛన్లు తీసుకుంటున్న వారి సంఖ్య 53,32,592 వరకు ఉంది. సీఎం వైఎస్ జగన్ తన తొలి సంతకంతో వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును తగ్గించడం ద్వారా ప్రయోజనం కల్పించిన వారితో కలిపితే ఈ సంఖ్య 58,82,592 మందికి చేరుకుంది. అధికారం చేపట్టిన వెంటనే మొదటి సంతకంతోనే లక్షల మంది సంక్షేమానికి చర్యలు చేపట్టడం సీఎం వైఎస్ జగన్ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.
గ్రామ వాలంటీర్ల వ్యవస్థ
కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో సీఎం వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన అందరికీ అందించేందుకు గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రకటించారు. ఆగస్టు 15వతేదీ నాటికి ప్రతి గ్రామంలోనూ స్థానికులైన 10 మంది యువకులను గ్రామ వాలంటీర్లుగా నియమిస్తామని తెలిపారు. ఆ విధంగా రాష్ట్రంలో 4 లక్షల మందికి గ్రామ వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. అంటే ఒక్క నిర్ణయంతో ఆయన రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నారు. గ్రామ వాలంటీర్లు నిజాయితీతో పనిచేసేందుకు నెలకు రూ.5 వేలు చొప్పున జీతాలు చెల్లించాలని జగన్ నిర్ణయించడం ఆయన ముందుచూపు, నిబద్ధతకు నిదర్శనం.
సచివాలయాలతో గ్రామ స్వరాజ్యం
రాజకీయాలతో కలుషితమవుతున్న గ్రామాలను చక్కదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన విధానాన్ని ప్రకటించారు. గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రకటించడం దేశంలోనే సంచలనమని పరిశీలకులు పేర్కొంటున్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయం తరహాలో గ్రామ సచివాలయాలను అక్టోబరు 2వతేదీనాటికి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల అవసరాలను గ్రామ సచివాలయాల నుంచే సకాలంలో పరిష్కరించాలన్నది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ లక్ష్యం. ప్రతి గ్రామ సచివాలయంలో విద్యావంతులైన పదిమంది స్థానిక యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 13,060 గ్రామాల్లో ఈ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ప్రజలు దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించారు.
లంచాలు లేని వ్యవస్థే లక్ష్యం
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడం, లంచాలు లేని వ్యవస్థను తీసుకు రావడం.. ఇదీ సీఎం వైఎస్ జగన్ విధాన నిర్ణయాల్లో అంతర్లీనంగా ఉన్న ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ పథకాల సక్రమ అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను సీఎం కార్యాలయంలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సీఎం కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబరుతో కాల్ సెంటర్ ఆగస్టు 15 నాటికి ఏర్పాటు కానుంది. ప్రభుత్వ పథకాల అమలులో ఎవరికైనా ఆలస్యం జరిగినా, అన్యాయం జరిగినా నేరుగా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. పథకాల అమలులో అలక్ష్యాన్ని ఉపేక్షించబోమని ఆయన పరోక్షంగా తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగంలోనూ కదలిక వచ్చింది. సీఎం ఆలోచనా సరళిని అనుసరించి పని చేయాలనే భావన పెరిగింది. పాలనలో జవాబుదారీతనాన్ని పెంచుతూ సంక్షేమ రాజ్యం, గ్రామ స్వరాజ్యం దిశగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మకమైన నిర్ణయాలను తీసుకున్నారని పరిశీలకులు ప్రశంసిస్తున్నారు.
5.60 లక్షల మందికి ఉద్యోగాలు
గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా సీఎం వైఎస్ జగన్ మరో కీలక సమస్యకు పరిష్కారం చూపించారు. ఒక్క నిర్ణయంతో రాష్ట్రంలో ఏకంగా 5.60 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లైంది. దూర ప్రాంతాలకు వలస పోతున్న యువతకు స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తూ విధాన నిర్ణయం తీసుకోవడం ద్వారా సీఎం వైఎస్ జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఆగస్టు 15వతేదీ నాటికి గ్రామ వాలంటీర్లుగా నాలుగు లక్షల మందిని, అక్టోబరు 2వతేదీ నాటికి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులుగా 1.60 లక్షల మందిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment