మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ఇచ్చే పింఛను సొమ్ము కోసం లబ్ధిదారులు పడిగాపులు పడుతున్నారు. ఏప్రిల్ ఏడో తేదీ గడిచినా ఇంతవరకు జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఈ నెల పింఛన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. లబ్ధిదారులు ప్రతిరోజూ పింఛన్ల సొమ్ము పంపిణీ చేసే సీఎస్పీల వద్దకు వచ్చి తిరిగి వెళుతున్నారు.
ఇంకా తమ వద్దకు నగదు చేరలేదని, ఎప్పుడొస్తుందో తెలియదని వారు సమాధానం చెబుతుండటంతో ఈ నెల పింఛను ఇస్తారా, లేదా అన్న అనుమానాలు లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వృద్ధాప్య పింఛన్లు 1,35,692 మంది, వితంతు పింఛన్లు 1,20,229 మంది, వికలాంగ పింఛన్లు 45,257, గీతకార్మికుల పింఛన్లు 1,894 మంది, అభయహస్తం 20,242 మంది, చేనేత పింఛన్లు 4,914 మంది పొందుతున్నారు.
జిల్లా మొత్తంగా వివిధ రకాల పింఛన్లను 3,28,228 మందికి ప్రతినెలా ఐదో తేదీ లోపు ఇస్తున్నారు. ఈసారి ఏప్రిల్ ఏడో తేదీ గడిచిపోతున్నా సీఎస్‌పీలకు నగదు అందకపోవటంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్తచేతనావస్థలో ఉండటంతో పాటు ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవటంతోనే పింఛన్ల మంజూరు నిలిచిపోయిందనే వాదన అధికారుల నుంచి వినబడుతోంది.
పింఛను పొందే వికలాంగులు అష్టకష్టాలు పడి వచ్చినా సొమ్ము రాలేదని తెలియడంతో ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి పింఛన్లు త్వరగా ఇప్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
పింఛన్ల కోసం పడిగాపులు
Published Tue, Apr 8 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 5:42 AM
Advertisement
Advertisement