‘రేషన్ కార్డులు తీసుస్తున్నారు.. వృద్ధాప్య పింఛన్లు లేవంటున్నారు.. ఉద్యోగాలిస్తామని ఓట్లేయించుకుని, నడి రోడ్డులో
వైఎస్సార్ కాంగ్రెస్ సీపీ నేతలకు వినతుల వెల్లువ
జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న
గడపగడపకూ.. కార్యక్రమం
విశాఖపట్నం : ‘రేషన్ కార్డులు తీసుస్తున్నారు.. వృద్ధాప్య పింఛన్లు లేవంటున్నారు.. ఉద్యోగాలిస్తామని ఓట్లేయించుకుని, నడి రోడ్డులో వదిలేశారు.. రుణ మాఫీ అంటూ మాయ మాటలు చెప్పారు.. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల్లో చెప్పిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు.. నిలువునా మోసపోయామయ్యా’.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వద్ద ప్రజలు తమ బాధలను చెప్పుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమం నాలుగో రోజు సోమవారం కొనసాగింది. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం ముసిడిపల్లిలో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ర్ట ప్రభుత్వం రుణమాఫీ పేరుతో జనాన్ని మోసం చేసిందని, పంటల బీమా ఇవ్వకుండా రైతుల్ని దెబ్బతీసిందని విమర్శించారు. చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ పనసలపాడు గ్రామంలో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గడపడగపకు వెళ్లి గిరిజనులతో మమేకమయ్యారు.
పింఛన్లు అందడం లేదని గిరిజనులు ఎమ్మెల్యేకు విన్నవించారు. అటవీ ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. నిధుల్లో కోత విధించి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం అనకాపల్లి పట్టణం, నర్సింగరావుపేటలో జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ నేతృత్వంలో జరిగింది. దాదాపు వంద కుటుంబాలను అమర్ పలకరించారు. ప్రతి గడపలో సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదోనని ఆరాతీశారు.
వృద్ధునికి వైఎస్సార్‌సీపీ నేతల పింఛన్
పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలం దేవవరంలో వైఎస్సార్సీపీ నేతలు గొల్లబాబూరావు, చిక్కాల రామారావు, డి.వి.సూర్యనారాయణరాజు, వీసం రామకృష్ణ పాల్గొన్నారు. పింఛన్ మంజూరు కాలేదని, నడవలేని స్థితిలో ఉన్న 80 ఏళ్ల వృద్ధుడు దమ్ము శ్రీరాములు నక్కపల్లి మండలం దేవవరం గ్రామంలో గ్రామంలో పర్యటించిన వైఎస్సార్‌సీపీ నాయకుల ముందు వాపోయాడు. వెంటనే స్పందించిన గొల్ల బాబూరావు తన వంతు సాయంలో భాగంగా కొంత నగదును వృద్ధుడికి అందించారు. రాజయ్యపేటకు చెందిన దుంగా రాజు, మైలపల్లి సూరిబాబులు ప్రతి నెలా రెండొందల రూపాయలు పింఛన్ రూపంలో ఆ వృద్ధుడికి ఇస్తామని ప్రకటించారు. యలమంచిలిలో సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు నేతృత్వంలో కొక్కిరాపల్లిలో జరిగింది. చోడవరం నియోజకవర్గం రోలుగుంటలో సమన్వకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు. నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం నాగాపురంలో సమన్వయకర్త ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి జనం సమస్యలు తెలుసుకున్నారు. అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం దముకు, కొండిబల్లో త్రిసభ్య కమిటీ సభ్యురాలు అరుణకుమారి నేతృత్వంలో జరిగింది.