విశాఖపట్నం: సమస్యలు చెప్పేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రయత్నిస్తే టీడీపీ నాయకులు అడ్డుకొని మైకు లాక్కోవడంతో జీవీఎంసీ 18వ వార్డు పరిధిలోని చినవాల్తేరు ప్రాథమిక పాఠశాలలో జరిగిన జన్మభూమి గ్రామసభలో తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది. సభప్రారంభం కాగానే వైఎస్సార్ సీపీ నాయకుడు ప్రసాదుల భాగ్యానంద్ స్థానికంగా ఉన్న సమస్యల కోసం ప్రస్తావించేందుకు యత్నించగా, రేషన్ కార్డులు, చంద్రన్న కానుకల పంపిణీలు పూర్తయిన తర్వాత మాట్లాడేందుకు అనుమతిస్తామని అధికారులు చెప్పడంతో ఆగిపోయారు. పంపిణీలు పూర్తయిన తర్వాత పోతినమల్లయ్యపాలెం, సాగర్‌నగర్, ఆరిలోవ డిపోలల్లో కేటాయించడంతో లబ్ధిదారులకు ఇబ్బందిగా మారుతుందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారి జవాబు చెప్పక పోవడంతో టీడీపీ నాయకుడు సిహెచ్.బి.పట్టాభి ఆన్‌లైన్‌లో రేషన్ తీసుకోవచ్చును కదా అని సమాధాన్ని దాటవేశారు.
మైక్‌లో మాట్లాడటానికి వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రయత్నించగా టీడీపీ నాయకులు మైక్ కట్ చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, టీడీపీ నాయకుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు..ప్రజాప్రతినిధులు నిర్వహించాల్సిన ఈ సభను ఆద్యంతం టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి, 8వ వార్డు మాజీ కార్పోరేటర్ పట్టాభి నిర్వహించడం పట్ల స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు తప్పుపట్టారు. బుచ్చెయ్యపేట మండలం ఆర్ శివరాంపురంలో జరిగిన జన్మభూమి సభలో గత జన్మభూముల్లో ఇచ్చిన దరఖాస్తులు పరిస్థతి ఏమిటో చెప్పాలంటూ సర్పంచ్ నమ్మి నీరజ, నాయకులు అప్పలరాజు అదికారులను నిలదీశారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సర్పంచ్ తదితరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బుచ్చెయ్యపేటలో కొత్త పంచాయితీ భవనం నిర్మించాలని, ప్రధాన రోడ్డును బాగు చేయాలని,అర్హత ఉన్న వారి పింఛన్లు మంజూరుచేయాలని సర్పంచ్ సుంకరి సత్యారావు, ఎంపీటీసీ సభ్యులు పాతాళ శ్రీను, సుంకరి భవాణి, ఆర్. భీమవరంలో ఎస్‌ఇజడ్‌కి మా భూములు తీసికోవద్దని రైతులు, మల్లాంలో అర్హత ఉన్నవారికి పలు సంక్షేమ కార్యక్రమాలు మంజూరు చేయాలని సర్పంచ్ గొలగాని శ్రీను అధికారులను నిలదీశారు. చోడవరం మండలం దుడ్డుపాలెంలో జరిగిన జన్మభూమి సభలో కేంద్ర పౌరవినాయాన శాఖమంత్రి అశోక్‌గజపతిరాజు పాల్గొన్నారు. నాయకులు దత్తత తీసుకున్న గ్రామాలను పట్టించుకోకపోతే ప్రజలు క్షమించరని కేంద్రమంత్రి పక్కనే ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలకు చురక వేశారు. పలు గ్రామాల్లో జరిగిన సభల్లో కూడా ఇదే రీతిలో స్థానిక సమస్యలపై వైఎస్సార్‌సీపీ నాయకులు, గ్రామస్తులు అధికారులను నిలదీశారు.
నిరసనల భూమి
Published Sun, Jan 10 2016 11:33 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement