‘ఆసరా’ కోసం ఆరాటం.. | peoples are concern on asara scheme | Sakshi
Sakshi News home page

‘ఆసరా’ కోసం ఆరాటం..

Published Sat, Dec 6 2014 3:34 AM | Last Updated on Mon, Aug 20 2018 6:02 PM

peoples are concern on asara scheme

పూర్తి కాని అర్హుల జాబితా 
కొనసా...గుతున్న దరఖాస్తుల పరిశీలన
కార్యాలయాల చుట్టూ వృద్ధులు, వికలాంగులు, వితంతువుల ప్రదక్షిణ
జాబితాలో పేర్లు లేనివారిలో తీవ్ర ఆందోళన


అర్హులందరికీ కేసీఆర్ ప్రభుత్వంలో వితంతు, వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు అందజేస్తాం.. ఇదీ లోకేశ్వరం మండలం పుస్పూర్‌లో శుక్రవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న చేసిన ప్రకటన. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అర్హులకు పింఛన్ తప్పకుండా వస్తుంది.. పేర్లు తొలగించిన వారివి మరోసారి పరిశీలించి జాబితాలో చేరుస్తాం.. అంటూ ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉంది.
 
మంచిర్యాల రూరల్ : జిల్లాలో అర్హుల ఎంపిక జాబితాపై ఇంకా కసరత్తు కొనసా..గుతూనే ఉంది. సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ పథకం(ఆసరా) కోసం జిల్లాలో 3.38 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గత నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 2.01 లక్షల మందిని అర్హులుగా గుర్తించి వారి వివరాలను మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అనర్హుల పేరిట 1.37లక్షల మందిని జాబితా నుంచి తొలగించడంతో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. రోజుకో చోట కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో మరోసారి దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ప్రభుత్వం సడలించిన నిబంధల ప్రకారం 2.11 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు.

జాబితాలో లేని నుంచి వివరాలు, ధ్రువీకరణ పత్రాలు స్వీకరించి ఎన్‌ఐసీ సర్వర్‌లో నమోదు చేస్తున్నా.. ఇంకా వారి అర్హతపై పూర్తి స్పష్టత రాలేదు. అర్హులను గుర్తించడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారనే విమర్శలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ సభ్యుల ఆదాయం రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలకు ఆదాయ పరిమితి పెంచినా, కుటుంబ సర్వే ప్రకారం పింఛన్ లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఉద్యోగం చేస్తున్నారని, పింఛన్లు పొందుతున్నారని అర్హుల్లో చోటు కల్పించడం లేదు.

చిరు ఉద్యోగాలు చేసి, నెలకు రూ.200 నుంచి రూ.వెయ్యి పింఛన్ పొందుతున్న తాము రూ.లక్షన్నర ఆదాయంలోపు వారిమేనని, తమకూ అర్హత కల్పించాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని, తహశీల్దార్ నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. ఇప్పటివరకు వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లలో ఎంతమంది అర్హులనే విషయమై అధికారులు పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. అన్ని అర్హతలు ఉన్నవారు మండల కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నా వారికి పింఛన్ మంజూరుకు ఆమోదం లభించడం లేదు. ఎన్‌ఐసీ సర్వర్‌లో మరోసారి స్వీకరించిన దరఖాస్తులను చూపిస్తూ కలెక్టర్ ఆమోదం పొందిన తర్వాత పింఛన్లు వస్తాయని అధికారులు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు.
 
అధికారుల మధ్య సమన్వయలోపం..

అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఆసరా లబ్ధిదారుల జాబితా కొలిక్కి రావడం లేదు. గత నెలలో ఆసరా పథకానికి అర్హులను గుర్తించేందుకు మండలాల్లోని ప్రభుత్వ శాఖల అధికారులను కొన్ని గ్రామ పంచాయతీలకు విచారణ అధికారులుగా నియమించి సర్వే పూర్తి చేయించారు. ఇంటింటి విచారణ పూర్తి చేసిన దరఖాస్తులను ధ్రువీకరించినట్లు సంతకాలు చేశారు. ఇందులో కొందరిని అనర్హులుగా ప్రకటించడంతో వారు మరోసారి మండల పరిషత్ కా ర్యాలయానికి వచ్చి తమ వద్ద ఉన్న అన్ని రకాల ధ్రు వీకరణ పత్రాలు చూపిస్తున్నారు. మండల పరిషత్ అధికారులు మాత్రం కుటుంబ సర్వే ఫారంతోపాటు ఆయా గ్రామ పంచాయతీల్లో సర్వే చేసిన ప్రత్యేక అధికారుల నుంచి ధ్రువీకరించినట్లు సంతకాలు తీసుకు రావాలని పింఛన్‌దారులకు సూచిస్తున్నారు. దీంతో అన్ని అర్హతలు ఉన్నా అధికారుల తప్పిదంతోపాటు జరిగిన పొరపాట్లకు పింఛన్‌దారులు మండ ల పరిషత్ కార్యాలయం, సర్వే చేసిన అధికారుల కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.

చుక్కలు చూపిస్తున్న అధికారులు

ఈ నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అందరికీ పింఛన్లు అందించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. జాబితాలో పేర్లు లేకపోతే పింఛన్ అందకుండా పోతుందని వృద్ధులు, వికలాంగులు, వితంతువుల్లో ఆందోళన పెరిగిపోతోంది. దీంతో పింఛన్ జాబితాలో పేరు లేదని మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్న వారికి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. పూర్తి వివరాలు, ధ్రువీకరణ పత్రాలు తీసుకు రావాలని, పేర్లు అర్హుల జాబితాలో చేరుస్తామని చెబుతున్నారు.

అన్ని ఆధారాలతో కార్యాలయానికి వెళ్తున్న వారిని తహశీల్దార్ కార్యాలయం నుంచి కుటుంబ సర్వే ఫారాలు తీసుకు రావాలని, అందులో ఉన్న వివరాలు సరిపోవాలని అధికారులు చెబుతన్నారు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన లబ్ధిదారులకు కుటుంబ సర్వేఫారాలను ఇవ్వకుండా మండల పరిషత్ కార్యాలయానికి పంపించామంటూ అక్కడి అధికారులు చెప్పి పంపిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు పొద్దంతా కార్యాలయాల చుట్టూనే తిరుగుతూ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఏ అధికారికి తమ మొర వినిపించాలో తెలియక, పేర్లు ఎందుకు తొలగించా రో అర్థంకాక కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
 
నా పేరు విజయలక్ష్మి. వయసు 28సంవత్సరాలు. మాది మంచిర్యాల మండలం తీగల్‌పహాడ్ గ్రామం. కంటిచూపు లేదు. అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నా పింఛన్ జాబితాలో పేరు తొలగించారు. 18ఏళ్లు పైబడిన వారికి కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండా పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్నా అధికారులు పట్టించుకుంట లేరు. వికలాంగురాలిగా అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నా పింఛన్ జాబితాలో పేరు లేదు. నాలుగైదు రోజులుగా మండల పరిషత్ కార్యాలయానికి వస్తున్న. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు మాత్రం మీ ఇంటికి వచ్చి సర్వే చేసిన అధికారి ధ్రువీకరిస్తేనే పింఛన్ వస్తదని చెబుతున్నరు. పింఛన్ అందేలా చూడాలె.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement