బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్: తెలంగాణ విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆడుతున్న డ్రామా బయటపడిందని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. కోవూరులోని మైథిలీ థియేటర్ ఎదుట వైఎస్సార్ విగ్రహం వద్ద ఆయన చేపట్టిన ఆమరణ దీక్ష బుధవారం మూడో రోజుకు చేరుకుంది. ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మొదటి నుంచి రెండు కళ్ల సిద్ధాంతం అనుసరిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారన్నారు.
తెలంగాణ ఇస్తే తప్పేంటి అని ఆయన వ్యాఖ్యానించి సీమాంధ్రుల మనోభావాల మీద దెబ్బకొట్టారన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రజలు, ఉద్యోగులు, నాయకులు రోడ్డెక్కి పోరాడుతుంటే చంద్రబాబు మాత్రం రాష్ట్ర విభజనకు మొగ్గుచూసి తెలంగాణపై ప్రేమచాటుకున్నారన్నారు. ఆయన రెండు నాలుకల బాబు అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విసుగెత్తిన అన్ని పార్టీలు అవిశ్వాసం పెడితే చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌కు అండగా నిలవ డం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.
బాబును తరిమి తరిమి కొడుతారు
సీమాంధ్ర బస్సు పర్యటనకు వస్తే చ ంద్రబాబును ప్రజలు తరిమి తరిమి కొడుతారని ఎమ్మెల్యే ప్రసన్న అన్నారు. తెలంగాణ ఇస్తే తప్పేంటన్న చంద్రబాబు సీమాంధ్ర పర్యటనకు ఎలా వస్తారని ప్రశ్నించారు. ప్రజలు ఆందోళనతో ఆవేదన చెందుతున్నారన్నారు. ఈ సమయంలో వారి మనస్సుల్లోని జ్వాలాగ్ని చంద్రబాబును తిరిగి వెళ్లేంతవరకు తరుముతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉద యగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేకే రెడ్డి, వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ సమన్వయకర్త పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, వైఎస్సార్సీపీ కోవూరు, ఇందుకూరుపేట మండల కన్వీనర్లు ములుమూడి వినోద్‌రెడ్డి, మావులూరి శ్రీనివాసులు రెడ్డి, జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణయ్య, నాయకులు కలువ బాలశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వివిధ సంఘాల మద్దతు
కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి దీక్షకు మద్దతు తెలిపేందుకు ప్రజలు, సంఘాలు, నాయకులు భారీగా తరలివచ్చారు. ఇందుకూరుపేట మండలంలో వైఎస్సార్సీపీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులు దీక్షలో పాల్గొన్నారు. జిల్లా ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకులు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం మండలాల మైనార్టీ నాయకులు, పొదుపులక్ష్మి గ్రూపుల సభ్యులు, విద్యార్థి జేఏసీ నాయకులు, ఐదు మండలాల ఎంపీడీఓలు, కోవూరు మండల ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, గీతాంజలి, బ్రహ్మయ్య, బ్రహ్మాస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు , కోవూరు టీఎంసీ కళాశాల విద్యార్థులు, న్యాయవాదులు, కోవూరు ప్రభుత్వ డిగ్రీ కళశాల విద్యార్థులు, చక్కెర కర్మాగారం ఉద్యోగ సంఘాలు, ఎలక్ట్రికల్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకులు తదితరులు ప్రసన్నకు సంఘీభావం ప్రకటించారు.
బాబు డ్రామా బయటపడింది
Published Thu, Aug 22 2013 3:02 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement