అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కదం తొక్కడంతో సంయుక్త జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం అనంతపురంలోని టవర్‌క్లాక్ సర్కిల్‌లో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం ఎదుట నిర్వహించిన ‘అనంత జనగర్జన’ విజయవంతమైంది. సమైక్య నినాదం ఢిల్లీకి వినిపించేలా ఉద్యమకారులు మిలియన్ నినాదాలతో సింహగర్జన చేశారు. ముందుగా శాంతికపోతాలు ఎగురవేసి, ‘మా తెలుగుతల్లికి మల్లెపూ దండ’ గీతాన్ని ఆలపించారు. తెలుగుజాతిని ఉద్దేశించి కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా సంయుక్త జేఏసీ చైర్మన్, డీఆర్‌వో హేమసాగర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ఎడారిగా మారుతుందన్నారు. మరీముఖ్యంగా వెనుకబడిన ‘అనంత’ మరుభూమిగా మారడం ఖాయమన్నారు.
ఎగువ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నుంచి సీమాంధ్రకు చుక్కనీరు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. దీనివల్ల వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతుందని వివరించారు. దీనికితోడు నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతాయన్నారు. శాంతిభద్రతల సమస్య కూడా తలెత్తుతుందని తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం అప్రజాస్వామికమని, విభజన నిర్ణయం వెనక్కి తీసుకునేదాకా ‘అనంత’ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా పొరపాటును గ్రహించి సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి, ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. లేదంటే భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. ప్రాణమున్నంత వరకు విభజన నిర్ణయాన్ని ప్రతిఘటిస్తామని ఉద్యమకారులతో ప్రతిజ్ఞ చేయించారు.
హోరెత్తుతున్న దీక్షలు, నిరసనలు
జిల్లా వ్యాప్తంగా సమైక్య ఉద్యమం హోరెత్తుతూనే ఉంది. అనంతపురం నగరంలో జాక్టో, పీఆర్ జేఏసీ, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, న్యాయవాదులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ, హంద్రీనీవా, మైనర్ ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్కేయూలో విద్యార్థి, ఉద్యోగ జేఏసీ చేపట్టిన రిలేదీక్షలు 35వ రోజుకు చేరుకున్నాయి. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోనియా మాస్కు ధరించి విభజన భూతం పట్టినట్లు సమైక్యవాదులు వినూత్న నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో భారీ మానవహారం నిర్మించారు. చిలమత్తూరులో బలిజ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, వంటావార్పు చేపట్టారు. కళ్యాణదుర్గంలో ఉద్యోగ జేఏసీ నేతలు, వైద్య సిబ్బంది రోడ్డుపైనే వంటావార్పు చేపట్టారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. మడకశిరలో ఎల్‌ఐసీ సిబ్బంది, పట్టుపరిశ్రమ శాఖ ఉద్యోగులు నిరసన ర్యాలీ చేశారు. చిన్నారులు వివిధ వేషధారణలతో ప్రదర్శన చేశారు. మహాత్మాగాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఓడీ చెరువులో సమైక్యవాదులు రహదారులను దిగ్బంధించారు. కొత్తచెరువులో పశువైద్యసిబ్బంది నిరసన తెలిపారు. పుట్టపర్తిలో వైద్య సిబ్బంది రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యవాదులు అరగుండుతో నిరసన తెలిపారు. పెనుకొండలో జేఏసీ నాయకులు చెవిలో పూలు పెట్టుకొని, మోకాళ్లపై నిలబడి, ఆర్డీఓ కార్యాలయంలోకి గొర్రెలు తోలి.. ఇలా విభిన్న పద్ధతుల్లో నిరసనలు తెలిపారు.
సోమందేపల్లిలో విద్యార్థులు, పరిగిలో నాయీబ్రాహ్మణులు ర్యాలీ చేశారు. రొద్దంలో జేఏసీ నేతల రిలేదీక్షలు కొనసాగించారు. గోరంట్లలో గాండ్ల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు దీక్షలు కొనసాగాయి. రాయదుర్గంలో కురుబలు ర్యాలీ చేశారు. జేఏసీ, ఇతర ఉద్యోగ సంఘాల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యవాదులు వంటా వార్పు చేపట్టారు. కణేకల్లులో వైఎస్సార్‌సీపీ నేతల రిలేదీక్షలను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విరమింపజేశారు. ఇదే పట్టణంలో ఎన్‌జీవోలు ముగ్గులపోటీ నిర్వహించారు. గార్లదిన్నెలో సమైక్యవాదులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. తాడిపత్రిలో మునిసిపల్, జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయ జేఏసీ నేతలు అర్ధనగ్న ప్రదర్శన, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు.
ట్రాన్స్‌కో జేఏసీ ఆధ్వర్యంలో మోకాళ్లపై నిరసన తెలిపారు. యాడికి మండలంలో గీతకార్మికులు, పెద్దవడుగూరులో రెడ్డి సంఘం, బెళుగుప్పలో కురుబ సంఘం, కూడేరులో నాయీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. ఉరవకొండలో లయున్స్ క్లబ్ ఆధ్వర్యంలో 30 గంటల దీక్షలు ప్రారంభమయ్యాయి. గుంతకల్లులో ప్రభుత్వ జేఏసీ, వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. వివిధ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. కదిరిలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్, న్యాయవాదుల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తలుపులలో వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
అనంత గర్జన
Published Wed, Sep 4 2013 3:29 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
Advertisement
Advertisement