నవశకానికి నాంది | People Happy With YS Jagan Announce on Pension Scheme | Sakshi
Sakshi News home page

నవశకానికి నాంది

Published Fri, May 31 2019 10:35 AM | Last Updated on Fri, May 31 2019 10:35 AM

People Happy With YS Jagan Announce on Pension Scheme - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: తొలి సంతకం నవ శకానికి నాంది పలికింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే పాలనలో తనదైన ముద్ర కనపరిచారు. ప్రజాసంకల్ప పాదయాత్ర సాక్షిగా ప్రజల కష్టాలు, కన్నీళ్లు.. అవినీతి, బాధ్యతా రాహిత్యాన్ని కళ్లారా చూసిన జననేత తన మాటల్లో అందరికీ ఊరట కల్పిస్తూ తన ప్రసంగం కొనసాగించారు. మాటలో స్పష్టత, భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్న తీరుతో విమర్శకులు సైతం ‘శభాష్‌’ అంటున్నారు. కాల పరిమితి విధించి ఉద్యోగాల కల్పన.. పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు చేపట్టబోయే నిర్ణయాలతో అందరి మనసు దోచుకున్నారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం రానే వచ్చిందని ప్రతి ఒక్కరిలో సంతోషం వ్యక్తమవుతోంది. తొలి సంతకంతోనే అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వులు చిందింపజేశారు.

ఐదు నెలల్లో 30,030 ఉద్యోగాలు: ముఖ్యమంత్రి తాను చెప్పినట్లే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అవినీతికి ఆస్కారం లేకుండా 50 కుటుంబాలకు ఓ వలంటీర్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 12లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. ఒక్కో రేషన్‌కార్డును ఒక్కో కుటుంబంగాభావిస్తే 12లక్షల ఇళ్లకు 25వేల ఉద్యోగాలు వస్తాయి. ఈ వాలంటీర్లందరూ ఆయా గ్రామాల్లో నివాసం ఉన్నవారే. వీరికి నెలకు రూ.5వేల వేతనం ఇస్తారు. సగటున వెయ్యి ఇళ్లు ఉన్న గ్రామంలో కూడా 20మంది నిరుద్యోగులకు ఉద్యోగం అందినట్లే. ఈ ఉద్యోగాలు కూడా రెండున్నర నెలల్లోనే.. అంటే ఆగస్టు 15లోపు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఈ ప్రకటనతో జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగుల్లో సంబరాలు మొదలయ్యాయి. నిరుద్యోగ యువకులు ఉన్నత చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు తెచ్చుకునే వరకు వారి సొంత గ్రామాల్లోనే వాలంటీర్లుగా కొనసాగవచ్చు. వీరు చేయాల్సింది ఒక్కటే. వారికి కేటాయించిన 50 ఇళ్లలోని పేదలు ప్రభుత్వ కార్యాలయాల గడప తొక్కకుండా సంక్షేమ పథకాలు వారి గడప తొక్కేలా చేయడమే. తద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా చేయడంలో తొలి విజయం సాధించినట్లే.

గ్రామ సెక్రటేరియట్‌ ఏర్పాటు తద్వారా 10,030 ప్రభుత్వ  ఉద్యోగాలు
గ్రామాల్లో రేషన్‌కార్డు, పింఛన్, ఇంటిస్థలం, భూ వివాదంతో పాటు పలు సమస్యలకు రోజులు, నెలలు, ఏళ్ల తరబడి తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు చుట్టూ తిరిగి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి బాధలకు జగన్‌ ప్రభుత్వం స్వస్తి చెప్పింది. పాలనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి, అందులో ఆయా గ్రామాలకు చెందిన 10మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఈ పదిమంది వారి గ్రామాల్లో పేదలకు సంబంధించిన సంక్షేమ పథకాలు, ఇతర ఇబ్బందులను కొన్ని గంటల్లోనే పరిష్కరిస్తారు. ఇది కూడా అవినీతి నిర్మూలన కోసం జగన్‌ వేసిన ఓ అడుగే. దీంతో ప్రజల కష్టాలు తీరినట్లే. అలాగే జిల్లాలో 1,003 పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో సచివాలయానికి పదిమంది చొప్పున ఉద్యోగులను లెక్కిస్తే జిల్లా వ్యాప్తంగా 10,030 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. వీటిని అక్టోబర్‌ 2 గాంధీ జయంతిలోపు భర్తీ చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. జిల్లాలో ఈ స్థాయిలో ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర చరిత్రలో బహుశా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ మాత్రమే కావడం విశేషం.

తన పాలన ఎలా ఉండబోతుందో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి: పాలనను పూర్తిగా ప్రక్షాళన చేస్తానని జగన్‌ ఇటీవల చెప్పారు. అందుకు తగ్గట్లే సీఎం హోదాలో ప్రకటన చేశారు. సంక్షేమ పథకాల అమలులో కులం, మతం, రాజకీయం, పార్టీ ఏదీ చూడం, వారు అర్హులా? కాదా? అనే విషయాలు మాత్రమే చూస్తామని చెప్పారు. తద్వారా తాను అందరి వాడినని నేరుగా చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నప్పటికీ వారికి అధికారాలు లేకుండా జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులకు అధికారం కట్టబెట్టి, కేవలం టీడీపీ అస్మదీయులకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందేలా చేశారు. ఇతరపక్షాలలో అర్హులు ఉన్నా వారిని దూరం పెట్టారు. జన్మభూమి కమిటీల పెత్తనంతో ఐదేళ్లపాటు పేదలు నలిగిపోయారు. ఇలాంటి పాలనకు జగన్‌ చరమగీతం పాడారు. రాష్ట్రంలోని ప్రతి పేద ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పడంతో వైఎస్సార్‌సీపీతో పాటు ఇతర పార్టీల శ్రేణులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకతీతకంగా పనిచేస్తున్న సీఎం.. వైఎస్‌ తర్వాత జగనే అని కొనియాడుతున్నారు.

అవినీతిపై యుద్ధ ప్రకటించిన సీఎం
అవీనీతిపై తొలిరోజే జగన్‌ సమరశంఖం పూరించారు. ఎక్కడైనా సంక్షేమ పథకాల అమలులో అవినీతి జరిగినా, సంక్షేమ ఫలాలు అందకపోయినా ఎవ్వరికీ ఫిర్యాదు చేయాల్సిన పనిలేదని, సీఎం కార్యాలయంలోనే కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేస్తామని, నేరుగా ఫిర్యాదు చేయొచ్చని ప్రకటించారు. అన్నిస్థాయిల్లో అవినీతి ప్రక్షాళన చేస్తామని గట్టిగా చెప్పారు. ఈ ప్రకటన కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఏదిఏమైనా జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు ఆయన తీసుకున్న నిర్ణయాలతో ఓ మంచి పాలన, ఓ మంచి ముఖ్యమంత్రిని చూడబోతున్నామని ‘అనంత’ ప్రజల్లో విస్తృత చర్చ జరిగింది.  

నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం మాలాంటి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపనుంది. గ్రామ సచివాలయాల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించడం శుభపరిణామం. ఉన్న  ఊళ్లోనే ఉపాధి దొరకడం వలన నిరుద్యోగులకు మంచి జరుగుతుంది. నిరుద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది.   – దామోదర్‌రెడ్డి, కొడిమి,అనంతపురం రూరల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement