
మండల పరిషత్ వద్ద ఖాళీబిందెలతో ధర్నా చేస్తున్న మహిళలు
పోలాకి : స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా వివక్ష తగ్గ లేదని ఉర్జాం గ్రామానికి చెందిన దళితులు ఆవేదన వ్యక్తంచేశారు. వివక్ష రూపాంతరం చెందిందే తప్ప అంతరించిపోలేదని మండిపడ్డారు. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఉర్జాంలో దాదాపు 70 దళిత కుటుంబాల ఆవేదన అధికారులకు, నాయకులకు వినిపించటంలేదా? అని ప్రశ్నించారు.
కులవివిక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఉర్జాం దళితులు బుధవారం కదంతొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రం వద్ద ధర్నా, ర్యాలీలు నిర్వహించారు. తమ దళితవాడలో తాగునీటి కష్టాలు తెలిసేలా, వినతులు, విన్నపాలు వినలేని పాలకులు, అధికారులకు వినిపించేలా మహిళలు ఖాళీ బిందెలతో ఊరేగింపు నిర్వహించారు.
డప్పులు, మేళాలతో మండలకేంద్రంలో ర్యాలీగా వెళ్లి ప్రత్యేకాధికారి దామోదరరావుకు తమగోడు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మౌలిక వసతులు కల్పించడంలో వివక్ష చూపుతున్నారని, ఇచ్చిన మాటను అధికారులు నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని, సమస్యల పరిష్కారానికి తమవంతు కృషిచేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
తాము కనీసం మంచినీటికి కూడా నోచుకోలేకపోతున్నామని, ఉప్పు నీళ్లు తాగుతున్నామని గ్రామానికి చెందిన మహిళ కె.లక్ష్మి వాపోయింది. మౌలిక వసతుల అభివృద్ధికి అడ్డుకుంటున్నారని, మృతదేహాలు దహనంచేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారని దళిత సంఘం నాయకుడు జె.గన్నయ్య ఆవేదన వ్యక్తంచేశారు.
తామూ ఈ గ్రామంలోనే పుట్టామని అలాంటప్పుడు వివక్ష ఎందుకని ప్రశ్నించారు. ఉర్జాంలో జరుగుతున్నది కులవివక్షే అని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గణేష్ అన్నారు. పౌరహక్కుల దినం సందర్భంగా గ్రామంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment