ఓ పట్టుపట్టండి! | People struggle with various problems | Sakshi
Sakshi News home page

ఓ పట్టుపట్టండి!

Published Thu, Dec 18 2014 4:21 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

ఓ పట్టుపట్టండి! - Sakshi

ఓ పట్టుపట్టండి!

ఇలా.. జిల్లాలోని ప్రజలు వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని ప్రజలు కోరుతున్నారు. అధికార పార్టీని నిలదీసి సమాధానం రాబట్టాలని విన్నవిస్తున్నారు. తమ సమస్యలను అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వివిధ రూపాల్లో (ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ మొదలైన) లేవనెత్తి తమకు న్యాయం జరిపించాలని నివేదిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల నోరు మూగబోయిందని.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. తమ అజెండానే వాళ్ల గళంగా చేసుకుని అసెంబ్లీలో వినిపించాలని కోరుతున్నారు.
 
 ఇవీ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ఫ్రధాన సమస్యలు..
 కేసీ కెనాల్‌కు రోజురోజుకీ తగ్గుతున్న నీటి విడుదలతో పాటు అనంతపురం జిల్లాకు నీటి మళ్లింపుపై జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తద్వారా జిల్లాలో ప్రస్తుత లేట్ ఖరీఫ్‌లో 30 వేల ఎకరాల సాగుతో పాటు రబీ సీజనులో మరో 20 వేల ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై నిలదీసి జిల్లాలోని పంటలను కాపాడాల్సిన అవసరం ఉంది.
 
 సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. పండిన పంటలకూ దిగుబడి తగ్గిపోయింది. వచ్చిన కొద్దిపాటి దిగుబడులకు కూడా గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు. దీంతో తెచ్చిన అప్పులు చెల్లించలేక రైతన్నలు ఆత్మహత్యల బాట పట్టారు. వీరిలో ఒక్కరంటే ఒక్కరికీ నష్టపరిహారం లభించలేదు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి.. న్యాయం జరిపించాలని ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలు కోరుతున్నాయి.
 
 జిల్లాకు రావాల్సిన ట్రిపుల్ ఐటీని ప్రభుత్వం పశ్చిమగోదావరికి మళ్లించింది. దీంతో ఉన్నత విద్య చదువుకుందామన్న జిల్లాలోని విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించి జిల్లాకు ట్రిపుల్ ఐటీని వచ్చేలా కృషి చేయాలని విన్నవిస్తున్నారు.     
   
 వివిధ సాంకేతిక కారణాలను చూపుతూ ఏకంగా 2.36 లక్షల మంది ఖాతాలకు రుణమాఫీ వర్తించకుండా పోయింది. జిల్లాలో మొత్తం 5.24 లక్షల ఖాతాలను పంపించగా... 2.88 లక్షల ఖాతాలకు రుణమాఫీ అర్హత వర్తించింది. మిగతా 2.36 లక్షల ఖాతాలు అనర్హత జాబితాలో చేరాయి. తమకూ రుణమాఫీ వర్తించేలా కృషి చేయాలని రుణమాఫీ వర్తించని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (రుణ పరిమితి) వల్ల అనేక మంది రైతులకు కూడా రుణమాఫీ కేవలం నామమాత్రంగా మారింది. లక్ష రూపాయల రుణం ఉంటే కేవలం రూ. 5 వేల నుంచి రూ. 10వేల మాత్రమే మాఫీ అయిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అయ్యేలా చూడాలని ప్రజా ప్రతినిధులను డిమాండ్ చేస్తున్నారు.
 
 వేలిముద్రలు లేవని, ఆధార్ కార్డు లేదనే కారణాలతో అనేక మంది వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛను పంపిణీ నిలిచిపోయింది. తమకు పింఛను వచ్చేలా చూడాలని వీరు కోరుతున్నారు.
 
 ప్రభుత్వాన్ని నిలదీస్తాం
 అసెంబ్లీలో జిల్లా ప్రజల గళాన్ని వినిపిస్తాం. శ్రీశైలం నుంచి వరద నీరు వచ్చినప్పుడు వెలుగోడు రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో ఖరీఫ్‌తో పాటు రబీకి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రైతు రుణమాఫీపై ప్రభుత్వ కుప్పిగంతులు వేస్తోంది. ప్రభుత్వ వైఖరిని అసెంబ్లీ సాక్షిగా ఎండగడతాం. రైతులందరికీ రుణమాఫీ చేయాలని పట్టుబడతాం. జిల్లాలో రైతుల ఆత్మహత్యలతోపాటు ట్రిపుల్ ఐటీ తరలింపుపైనా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం. జిల్లాకు మళ్లీ ట్రిపుల్ ఐటీ వచ్చేలా కృషి చేస్తాం.   
 - బుడ్డా రాజశేఖరరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement