సాక్షి నెట్‌వర్క్: పదిహేను రోజుల్లో మూడుసార్లు తీరప్రాంతాలను ముంచెత్తిన గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే వరదనీరు తొలగిపోవడంతో మిగిలిన బురదతో బాధితులకు కొత్తకష్టాలు వస్తున్నాయి. ముంపు గ్రామాల్లో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది. దోమలబెడద పెరిగిపోవడంతో అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. ఖమ్మం జిల్లా కూనవరం మండలం టేకులబోరుకు చెందిన తలారి వేదవతి(33) మంగళవారం అతిసారతో మృత్యువాత పడింది. సహాయ శిబిరాల్లోనూ బాధితులు అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రం గోదావరి నీటిమట్టం 45.5 అడుగులుగా, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారే జీ వద్ద 16.30 నీటిమట్టం అడుగులకు చేరింది. దీంతో అధికారులు ఇక్కడ మూడవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. వరద తగ్గుముఖం పట్టినా ఖమ్మం జిల్లా వాజేడు మండలంలోని పలు గ్రామాలతోపాటు, ఉభయగోదావరి జిల్లాల్లోని అనేక లంకగ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. భద్రాచలం పట్టణంలోని రామాలయం ఎదురుగా ఉన్న విస్తా కాంప్లెక్స్, అన్నదాన సత్రం ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఉత్తర ద్వారం వద్ద బురదమయంగా తయారైంది.
కోస్తాలో చురుకుగా నైరుతి: తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపిన నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం కోస్తాంధ్రలో చురుకుగా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉపరితల ఆవరణంగా మారిపోయింది. ఛత్తీస్‌గఢ్ దానిని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో 5.7కి.మీ ఎత్తులో ఉపరితల ఆవరణం ఏర్పడింది. దీని కారణంగా రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశాలున్నాయి. ఆంధ్రా తీరంలో పశ్చిమ దిశగా గంటకు 45నుంచి 50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది.
వరద తగ్గినా.. వదలని బురద
Published Wed, Aug 7 2013 2:01 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM
Advertisement