జనం ఆస్పత్రుల్లో.. సర్కారు కోమాలో | People suffer diseases.. Government in coma | Sakshi
Sakshi News home page

జనం ఆస్పత్రుల్లో.. సర్కారు కోమాలో

Published Mon, Jan 13 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM

జనం ఆస్పత్రుల్లో.. సర్కారు కోమాలో

జనం ఆస్పత్రుల్లో.. సర్కారు కోమాలో

ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా జనంపై జబ్బులు విరుచుకుపడుతున్నాయి. రాష్ట్రంలో రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య ఏటికేడూ పెరిగిపోతోంది.

 జనంపై జబ్బుల దాడి..
 గతేడాది 4 కోట్ల మంది వ్యాధులపాలు..
 ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలకే కాదు.. మందులూ, డాక్టర్లకూ కొరత

 
 గుండం రామచంద్రారెడ్డి, సాక్షి
 
 ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా జనంపై జబ్బులు విరుచుకుపడుతున్నాయి. రాష్ట్రంలో రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య ఏటికేడూ పెరిగిపోతోంది. దోమల నియంత్రణను పట్టించుకోని సర్కారు తీరు వల్ల గత ఏడాది గిరిజన ఆవాస ప్రాంతాలు, మురికి వాడల్లో 15 లక్షల మంది మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా తదితర దోమకాటు జ్వరాల బారినపడ్డారు. అంతుచిక్కని జ్వరాల తీవ్రత ఇక చెప్పాల్సిన పనిలేదు. సరైన తాగునీరు లభించకపోవటం, కలుషితమైన నీరు తాగటం వల్ల గత ఏడాది రాష్ట్రంలో 8 లక్షల మంది డయేరియాతో బాధపడ్డారు. వీరిలో ఐదు లక్షల మంది చిన్నారులే ఉన్నారు. జల, వాయు కాలుష్యాల నియంత్రణలో సర్కారు విఫలవుతుండటం ప్రధాన కారణంగా.. 17 లక్షల మంది రోగులు శ్వాసకోశ వ్యాధులకు గురయ్యారు. ఇలాంటి జబ్బులతో పేద ప్రజలు చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రులకు వస్తే.. అక్కడ సదుపాయాల లేమి, మందుల కొరత, వైద్యుల కొరతతో వారి వేదనకు అంతులేకుండా పోతోంది. చిన్నపాటి మందుబిళ్లలు, సూది మందులు అందుబాటులో ఉంచితే తగ్గిపోయే జ్వరాలు.. ఆ మాత్రం కూడా అందకపోవటంతో రోగాలుగా ముదిరి రోజులు దాటి, వారాలు, నెలల తరబడి మంచాన పడటమే కాదు.. చాలా మంది ప్రాణాలు సైతం కోల్పోతున్న దుస్థితి నెలకొంది. ఇక మధుమేహం, క్యాన్సర్, క్షయ, హెచ్‌ఐవీ, గుండె జబ్బులు, నరాల జబ్బులు వంటి ప్రమాదకర జబ్బులు కూడా రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. అన్ని రకాల రోగాలు, జబ్బులు కలిపి గత ఏడాది 2013లో నాలుగు కోట్ల మందికి పైగా జనం.. అంటే రాష్ట్ర జనాభాలో దాదాపు సగం మంది అనారోగ్యంతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇందులో మూడు కోట్ల మంది ప్రభుత్వాస్పత్రుల్లో, మరో కోటి మందికి పైగా ప్రయవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నారు. గత ఏడాది ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్స చేయించుకున్న వారి సంఖ్య 12 లక్షలు దాటినట్టు స్పష్టమైంది. గతంలో ఇంత పెద్ద సంఖ్యలో ఆపరేషన్లు ఎప్పుడూ జరగలేదు. గత ఏడాది ప్రజలను ప్రధానంగా పీడించిన జబ్బులు, కారణాలు, చికిత్సల తీరుతెన్నులివీ...
 

కబళిస్తున్న క్యాన్సర్ రక్కసి
 
 రాష్ట్రంలో ఐదేళ్ల కిందటితో పోలిస్తే కొత్త క్యాన్సర్ రోగుల సంఖ్య ఇప్పుడు దాదాపు రెండింతలైంది. ప్రతి పది లక్షల మందికి ఏటా 900 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇవి 2007లో ప్రతి పది లక్షల మందికి 550 మాత్రమే ఉండేవి. రాష్ట్రంలో ఏటా 55 వేల నుంచి 60 వేల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్టు తేలింది. విస్మయపరిచే విషయం ఏంటంటే 60 ఏళ్లలో రావాల్సిన కొన్ని రకాల క్యాన్సర్ కేసులు 30 - 35 ఏళ్ల వయసు వారిలోనే వస్తున్నాయి. పైగా.. రాష్ట్రంలో హైదరాబాద్‌లో మినహా క్యాన్సర్‌కు ఎక్కడా సరైన వైద్యం లేదు. హైదరాబాద్‌లో కూడా ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో ఆధునిక వైద్యం లేదు. ఎప్పుడో 1980 నాటి వైద్యమే ఉంది. లీనియర్ ఆక్సిలరేటర్ లాంటి అత్యాధునిక పరికరాలు కొనలేని పరిస్థితి ఉంది. దీనివల్ల చాలామంది క్యాన్సర్ రోగులు మృతి చెందుతున్నారు.
 
 రొమ్ము క్యాన్సర్లు ఎక్కువయ్యాయి
 
 ‘‘కొత్త రకాల క్యాన్సర్లు రావడమే కాకుండా.. చిన్న వయసులోనే వస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఉదాహరణకు గతంలో 45 ఏళ్లు దాటిన వారికే రొమ్ము క్యాన్సర్ వచ్చేది. ఇప్పుడు 30 ఏళ్ల వారిలోనే చూస్తున్నాం. అంతేకాదు.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సెర్వైకల్ క్యాన్సర్) కూడా చాలా చిన్న వయసు మహిళల్లోనే వస్తోంది. క్యాన్సర్ కేసుల్లో ఎప్పుడూ 50 శాతం మరణాలుంటాయి. అందుకే క్యాన్సర్ నివారణకు మరింత నాణ్యమైన వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. అత్యాధునిక వైద్యం అందినప్పుడే క్యాన్సర్ నివారణ, మృతుల సంఖ్యనూ తగ్గించవచ్చు.’’  - డా.శ్రీనివాసన్, అసోసియేట్ ప్రొఫెసర్, మెడికల్ ఆంకాలజీ, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి
 
 మధుమేహం ప్రమాద ఘంటికలు
 
 రాష్ట్రంలో ఎక్కువ మందిని పీడిస్తున్న వ్యాధి మధుమేహం. ప్రతి పది మందిలో ఇద్దరు డయాబెటిస్ (సుగర్) జబ్బుతో బాధపడుతున్నారని.. ప్రస్తుతం రాష్ట్రంలో కోటిన్నర మంది పైనే మధుమేహ వ్యాధిగ్రస్థులు ఉండచ్చునని మధుమేహ పరిశోధనా సంస్థ (డయాబెటిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - నిమ్స్) తాజా నివేదికలో వెల్లడించింది. 2002 నివేదిక ప్రకారం రాష్ట్రంలో 16 శాతం మందికి మాత్రమే మధుమేహం జబ్బు ఉండేది. ఇప్పుడది 20 శాతానికి చేరుకున్నట్టు వెల్లడైంది. ముఖ్యంగా టైప్-2 (పాతికేళ్ల వయసు దాటిన వారికి వచ్చే) డయాబెటిస్ వ్యాధిగ్రస్తుతల సంఖ్య పెరుగుతోంది. ఈ తరహా వ్యాధిగ్రస్తులు నగరాల్లో సుమారు 22 శాతం ఉంటే.. పల్లెల్లో సైతం 7 శాతం మందికి వస్తున్నట్టు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో 1 లేదా 2 శాతం మాత్రమే టైప్-2 సుగర్ వ్యాధిగ్రస్తులు ఉండేవారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రపంచ వ్యాప్తంగా 70 నగరాలను డయాబెటిక్ కేంద్రాలుగా ప్రకటిస్తే అందులో అత్యధిక శాతం డయాబెటిస్ రోగులున్న నగరంగా హైదరాబాద్‌కు మొదటి స్థానంలో ఉండటం గుర్తించాల్సిన విషయం.
 
 ఇది ప్రమాదకర పరిస్థితే
 
 ‘‘మధుమేహం పల్లెలకూ విస్తరించటం ప్రమాదకర పరిస్థితి. తగినంత శారీరక శ్రమ లేకపోవడం, ఉండాల్సిదానికంటే ఎక్కువ బరువుండటం మధుమేహానికి దారితీస్తోంది. స్థూలకాయులూ - మధుమేహ రోగులూ సమాంతరంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. జీవనశైలి కూడా దీనికి కారణమే. వాతావరణంలో మార్పులు కూడా మధుమేహానికి దారితీస్తోంది.’’  - డాక్టర్ రవి, ఎండోక్రినాలజిస్ట్, హైదరాబాద్
 
గుండెపోట్లూ పెరిగాయి
 
 భారతదేశంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోనే గుండెపోటు జబ్బులు వస్తున్నట్లు తేలింది. మన రాష్ట్రంలో ఏటా 70 వేల మంది వరకూ ఏంజియోగ్రామ్ చేయించుకుంటున్నట్టు తేలింది. అంతేకాదు ఏటా 40 వేల మందికి కరోనరి (గుండెకు సంబంధించిన) స్టెంట్లు వేస్తున్నారు. ఏటా మరో 3 వేల మందికి పెరిఫెరల్ (గుండెకు కాకుండా వేసేవి అంటే పెరాలసిస్ స్ట్రోక్ రాకుండా వేసేవి) స్టెంట్లు వేస్తున్నట్టు అంచనా. ఆస్పత్రులకు వస్తున్న రోగుల శాతాన్ని బట్టి చూస్తే ఈ సంఖ్య ఏటికేటికీ పెరుగుతూన్నట్టు స్పష్టమైంది.
 
 వ్యాయామంతో చెక్ పెట్టవచ్చు...
 
 ‘‘రకరకాల గుండె జబ్బులతో వస్తున్న వాళ్లలో 40 శాతం మంది డయాబెటిక్ రోగులే ఉంటున్నారు. వీళ్లలో ఎక్కువ మంది హార్ట్‌ఎటాక్స్ వచ్చే అవకాశం ఉంది. రక్తపోటు కూడా ఇటీవల కాలంలో ఎక్కువైంది. వ్యాయామం, జీవనశైలి మార్చుకోవడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మందుల కంటే వ్యాయామం ప్రభావమే శరీరంపై ఎక్కువగా ఉంటుంది.’’ - డాక్టర్ ఎం.ఎస్.ఎస్.ముఖర్జీ, హృద్రోగ నిపుణులు, హైదరాబాద్
 
 వణికిస్తున్న క్షయ, కుష్టు
 
 రాష్ట్రంలో క్షయ, కుష్టు (లెప్రసీ) మహమ్మారిలు తగ్గకపోగా పెరుగుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1.70 లక్షల మందికి క్షయ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అనధికారికంగా మరింత మంది ఉండవచ్చుననేది వైద్యుల అభిప్రాయం. వీరిలో 10 శాతం మంది చిన్నారులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎయిడ్స్, సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్), మధుమేహం తదితర జబ్బుల తర్వాత అత్యంత ప్రమాదకర జబ్బుగా క్షయ వ్యాధిని పరిగణిస్తారు. చిన్నారులకు ఈ వ్యాధి రావడానికి కారణం కేవలం పౌష్టికాహార లోపమేనని చెప్తున్నారు. ఇక కుష్టువ్యాధి విషయంలోనూ ప్రమాదకర ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు లక్షల మందికి పైగానే కుష్టు వ్యాధిగ్రస్థులు ఉన్నట్టు అంచనా. ప్రతి లక్ష మందిలో 9 మందికి లెప్రసీ కేసులు నమోదువుతున్నాయి. గత ఏడాది రాష్ట్రంలో 8 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో ఈ వ్యాధి గ్రస్థులు ఎక్కువగా ఉంటే ఆ తర్వాతి స్థానం ఆంధ్రప్రదేశ్‌దే. దక్షిణ భారతదేశంలో వ్యాధి గ్రస్థులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మన రాష్ట్రానిదే అగ్రస్థానం.
 
దగ్గువల్లే టీబీ వ్యాపిస్తోంది...
 
 ‘‘టీబీ కేసులు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా ఇది దగ్గుతో వ్యాప్తి చెందుతున్న జబ్బు. హెచ్‌ఐవీ ఉన్న రోగుల్లో 90 శాతం మందిలో టీబీ వస్తుంది. ఇటీవలి కాలంలో డయాబెటిక్ రోగులకూ వస్తోంది. ముఖ్యంగా వ్యాధినిరోధకత తగ్గడం, టీబీ ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోకపోవడం మరింతమందికి వ్యాపిస్తోంది. ఇక శ్వాసకోశ వ్యాధుల పరిస్థితీ అంతే. ఇటీవలి కాలంలో ఆస్తమా పేషెంట్లు ఎక్కువయ్యారు. ఇంట్లో తండ్రులు స్మోకింగ్ చేస్తే అది పిల్లలపై పడుతోంది. కాలుష్యం ఎక్కువగా ఉండటం కూడా ఒక కారణమే.’’
 - డాక్టర్ ప్రద్యుత్‌వాఘ్రే, శ్వాసకోశ, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, ఈషా హాస్పిటల్స్
 
 2013లో జనం జబ్బుల లెక్కలివీ...
 
 మధుమేహం: 1.70 లక్షల మంది (ప్రపంచంలో సుగర్‌వ్యాధిగ్రస్తుల ‘రాజధాని’ హైదరాబాద్)
 జాగ్రత్తలు: మధుమేహం బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక మందులేమీ లేవు. స్థూలకాయం రాకుండా చూసుకోవాలి. వ్యాయామం చేయాలి. మద్యం, పొగ తాగరాదు.

 క్యాన్సర్: గత ఏడాది కొత్త రోగులు 55,000 మంది (ప్రతి లక్ష మందిలో 900 మందికి సోకుతోంది)
 క్యాన్సర్ అనేది ప్రధానంగా జీవనశైలి జబ్బే. వ్యాయామంతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల దీన్ని నివారించవచ్చనేది డాక్టర్ల అభిప్రాయం. రోజూ వ్యాయామం దీనికి ప్రత్యేక నివారణ మందు.

  క్షయ (టీబీ): 1.70 లక్షల మంది (వీరిలో 10 శాతం మంది చిన్నారులు)
 - క్షయ నివారించ దగ్గ జబ్బే. క్షయ ఇదివరకే వచ్చిన వారికి అవగాహన కల్పించి, వారినుంచి ఇతరులకు వ్యాపించకుండా చూడటమే అసలైన నియంత్రణ. ఇక క్షయ వచ్చినవారు 9 మాసాలు ఖచ్చితంగా మందులు వాడాలి.

 హెచ్‌ఐవీ (ఎయిడ్స్): 5 లక్షల మంది (వీరిలో మూడొంతుల మందికి టీబీ సోకింది)
 - హెచ్‌ఐవీ సోకకుండా ఉండాలంటే.. అపరిచితులతో శృంగారంలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఆస్పత్రుల్లో రక్తమార్పిడి విషయంలోనూ హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించి జాగ్రత్తలు తీసుకోవాలి.

  కుష్టు: 5 లక్షల మంది (గత ఏడాది 8 వేల కొత్త కేసులు నమోదు)

 గుండె జబ్బులు: ఏంజియోగ్రామ్ 70 వేలు (కరోనరి స్టెంట్లు 40 వేలు, పెరిఫెరల్ స్టెంట్లు 3 వేలు)
 తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవటం, వ్యాయామం చేయటం, జీవనశైలి మార్చుకోవడం ద్వారా సుగర్, రక్తపోటుతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్నీ తగ్గించవచ్చు.

 వివిధ రకాల జ్వరాలు: 23 లక్షల మంది
 దోమలను నివారిస్తే దోమకాటు జ్వరాల నుంచి తప్పించుకోవచ్చు. ఇందుకోసం ఇళ్లు, పరిశరాల్లో పారిశుధ్యం పాటించాలి. దోమలు వృద్ధి చెందకుండా అరికట్టాలి. దోమతెరలు వాడటం ఉత్తమం.

 శ్వాసకోశ వ్యాధులు: 17 లక్షల మంది
 కాలుష్య కారక ప్రదేశాల్లో వెళ్తున్నప్పుడు మాస్క్‌లు ధరించడం, పొగతాగకుండా ఉండటం. వీలైనంత వరకూ ప్రాణాయామం చేయడం ద్వారా శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

 డయేరియా బాధితులు: 8 లక్షల మంది. వీరిలో 5 లక్షల మంది చిన్నారులు.
 డయేరియా రాకూడదంటే.. రక్షిత మంచినీరు, కాచిన నీరు తాగాలి. ముఖ్యంగా వర్షాకాలం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
 
 ఏ జబ్బుకు వైద్యం కోసం ఎక్కడికెళ్లవచ్చు?
 
 - క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం రాష్ట్రంలో రెడ్‌హిల్స్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఒక్కటే ఉంది. అన్నిరకాల క్యాన్సర్‌లకూ ఇక్కడ చికిత్స దొరుకుతుంది. ఆరోగ్యశ్రీ కింద ఇతర ప్రైవేటు ఆస్పత్రులకు కూడా వెళ్లచ్చు.
 - క్షయ వ్యాధితో పాటు, శ్వాసకోశ వ్యాధుల నివారణకు ఎర్రగడ్డలోని టీబీ ఆస్పత్రి పేరెన్నికగన్నది.
 - మధుమేహ నివారణకు, చికిత్స కోసం రాష్ట్రంలోని ఉస్మానియా, గాంధీ, తిరుపతిలోని స్విమ్స్‌లో డయాబెటాలజీ విభాగం ఉంది. దీంతో పాటు నిమ్స్‌లో సరైన చికిత్స లభిస్తుంది.
 - గుండె జబ్బులకు అన్ని బోధనాసుపత్రుల్లో కార్డియాలజీ విభాగం ఉంది. ఉస్మానియా ఆస్పత్రిలో స్పెషలిస్టు వైద్యులు ఎక్కువగా ఉన్నారు.
 - దోమకాటు జ్వరాలు సోకినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రభుత్వ జిల్లా ఆస్పత్రులున్నాయి. దీంతో పాటు మరో 58 ఏరియా ఆస్పత్రులూ ఉన్నాయి. వీటిలో విధిగా వైద్యం అందించాలి.
 
 ప్రజారోగ్యంపై నిలువెత్తు నిర్లక్ష్యం...
 

 - బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో కనీస వసతులు లేవు. 30 శాతం స్పెషలిస్టు డాక్టర్ల కొరత ఉంది.
 - ఉన్న పీహెచ్‌సీలలో కనీస మందులు, వైద్యులు లేకపోగా, కొత్తగా రావాల్సిన 148 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రెండేళ్లుగా రాలేదు.
 - చాలావరకూ వ్యాధులు రక్తపరీక్షలు జరగకపోవడం వల్ల కూడా వస్తున్నాయి. మన రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో 12 శాతం పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయి. బోధనాసుపత్రుల్లో 16 శాతం రక్త పరీక్షలు జరుగుతున్నాయి. బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, పెథాలజీ విభాగాలకు సంబంధించి కనీసం 59 రక్త పరీక్షలు జరగాల్సి ఉండగా, కేవలం 12 నుంచి 16 పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయి. రక్త పరీక్షల ద్వారా బయటపడే ఎన్నో రకాల జబ్బులు బయటపడటం లేదు. చాలా రకాల పరీక్షలు ఇప్పటికీ యంత్రాలు లేక చేయలేని పరిస్థితి.
 - టీబీ సోకిన వారికి సరైన మందులు దొరకడం లేదు. వారికి మందులివ్వాల్సిన డాట్‌ప్రొవైడర్స్‌ను ఏర్పాటు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ఉంది.
 - మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యాలాంటి దోమకాటు జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు ఎక్కువవుతన్నా.. దోమల నివారణపై ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపటం లేదు. ముందస్తు చర్యలు చేపట్టడం లేదు. నిధులు మాత్రం ఖర్చవుతూనే ఉన్నాయి.
 - క్యాన్సర్  చికిత్స నియంత్రణకు లినియర్ ఆక్సిలేటర్ లాంటి అత్యాధునిక యంత్ర పరికరాలు ఏర్పాటుచేయలేని దుస్థితి. ఇప్పటికీ పాతవైద్యమే నడుస్తోంది.
 - ఎన్‌సీడీ (నాన్ కమ్యునికబుల్ డిసీజెస్-ప్రాణాంతక వ్యాధులు) ప్రాజెక్టు రాష్ట్రంలో అమలు కాకుండా ఆగిపోయింది. తమిళనాడు, అస్సాం, గుజరాత్, హర్యాన, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాల్లో పథకం బాగా అమలువుతోంది.  2011-12 సంవత్సరానికి శ్రీకాకుళం, చిత్తూరు, కడప, కృష్ణా, కర్నూలు, ప్రకాశం జిల్లాలు ఎంపిక చేశారు. దీనికోసం సుమారు రూ.180 కోట్లు బడ్జెట్ కేటాయించారు. అయినా పథకం ప్రారంభం కాలేదు.
 - వైద్య ఆరోగ్యశాఖలో గత నాలుగేళ్లుగా ఒక్క పథకమూ సరిగా అమలు కావడం లేదు.
 
 ప్రయివేటు ఆస్పత్రుల ఇష్టారాజ్యం...
 

 అనారోగ్యం పాలై ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యమందక పోవడంతో ప్రయివేటు ఆస్పత్రలను ఆశ్రయిస్తున్న వారిని.. చాలా చోట్ల ఆయా ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నాయి. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, ఎక్స్‌రే, రక్తపరీక్షలు అంటూ అవసరం లేకున్నా అనేక వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వేలకు వేలు వసూళ్లు చేస్తున్నారు. సాధారణ జ్వరం వచ్చినా వైద్య పరీక్షలకు రూ. 20 వేలు చెల్లించాల్సి వచ్చిన ఉదంతాలూ వెలుగుచూస్తున్నాయి. రోగి చనిపోయినా కూడా వైద్యం చేస్తున్నట్లు నటిస్తూ దోపిడీని కొనసాగిస్తున్న ఉదంతాలూ బయటపడుతున్నాయి. రాష్ట్రంలో ఏడాదికి సగటున 80 లక్షల నుంచి కోటి మంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే అందులో సగటున ఒక్కొక్కరు రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు వైద్య ఖర్చుల కోసం చెల్లిస్తున్నట్టు అంచనా. ఇక చిన్న చిన్న ఆపరేషన్లకు ఖర్చు రూ. 50 వేలకు తక్కువ కాదు. పెద్దాపరేషన్లయితే లక్షలే. చిత్రమైన విషయం ఏమిటంటే.. ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ బెడ్లు లేక ఎమ్మెల్యేలు, ఎంపీలతో సిఫారసు లేఖలు తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఆరోగ్యశ్రీ పథకంలో చాలా జబ్బులకు చికిత్సలు అందించే అవకాశం ఉన్నా.. కొన్ని ప్రయివేటు ఆస్పత్రులు చికిత్సలు, ఆపరేషన్లు చెయ్యకుండా వెనక్కు పంపుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement