
వామ్మో.. చిరుతలు!
సాక్షి, అనంతపురం : జిల్లా ప్రజలను చిరుతలు వణికిస్తున్నాయి. అడవుల్లో ఆహారం కరువై.. జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. ఎప్పుడు ఏ ఊళ్లోకి చొరబడతాయో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం వజ్రకరూరు మండలం గూళ్యపాళ్యం గ్రామస్తులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారం రోజులుగా వారికి కంటి మీద కునుకు ఉండడం లేదు. గత మూడేళ్లలో జిల్లాలో చిరుతల సంఖ్య పెరిగింది.
2010-11లో నిర్వహించిన జంతు గణనలో జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో 33 చిరుతలు ఉన్నట్లు గుర్తించారు. అయితే.. 2011-12 నాటికి వాటి సంఖ్య 45కు, 2012-13 నాటికి 48కి, 2013-14 నాటికి 55కు చేరుకున్నట్లు అటవీశాఖ రికార్డులు చెబుతున్నాయి. జిల్లా భూ వైశాల్యం 19.13 లక్షల హెక్టార్లు. ఇందులో 1,94,560 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అంటే జిల్లా విస్తీర్ణంలో 10.3 శాతం మాత్రమే అడవులు ఉన్నాయి. పర్యావరణ సమతుల్యత ఉండాలంటే 23 శాతం ఉండాలి. ఇక జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతం అంతంత మాత్రమే. దీనివల్ల వన్యప్రాణుల సంరక్షణ కష్టంగా మారింది. అవి జనారణ్యంలోకి వస్తుండడంతో కొన్ని చోట్ల ప్రజలు భయంతో చంపేస్తున్నారు. 2011లో ఆరు చిరుతలను చంపినట్లు అటవీశాఖ రికార్డులను బట్టి తెలుస్తోంది.
సంరక్షణ కరువై..
వన్యప్రాణుల సంఖ్య పెరిగితే ఆ మేరకు అడవుల్లో సంరక్షణ చర్యలు చేపట్టే బాధ్యత అటవీశాఖ అధికారులపై ఉంది. జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి కన్పించడం లేదు. జిల్లాలో అక్కడక్కడ ఉన్న అడవుల్లో కొందరు స్వార్థపరులు చెట్లను నరికివేస్తున్నారు. కలపను అక్రమ రవాణా చేస్తున్నారు. దీనివల్ల పొదలు తగ్గిపోతున్నాయి. ఇక పశువుల కాపరులు వేసవిలో అడవులకు నిప్పు పెట్టడం పరిపాటిగా మారింది. చాలా చోట్ల అటవీ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఈ కారణాల వల్ల వన్యప్రాణులకు అడవుల్లో రక్షణ కరువైంది.
ఆహారం, నీటి కోసం సమీప ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా అడవిపందులు, జింకలు పొలాలపై పడి పంటలను నాశనం చేస్తున్నాయి. అలాగే ప్రతియేటా పదుల సంఖ్యలో జింకలు, అడవి పందులు రోడ్లపైన వాహనాలు ఢీకొని చనిపోతున్నాయి. ఆగస్టు 22న కూడేరు సమీపంలోని మరుట్ల గ్రామం వద్దకు ఆహారం కోసం వచ్చిన ఓ అడవి పందిని వాహనం ఢీకొట్టడంతో చనిపోయింది.మరికొన్ని వేటగాళ్ల ఉచ్చులో పడుతున్నాయి. ఉరవకొండ, గుంతకల్లు, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో వారంలో మూడు రోజులు వీటి మాంసం విక్రయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అడవుల్లో చిరుతలు పెరుగుతున్నా..వాటికి ఆహారంగా ఉండే అడవి పందులు, జింకల సంతతి మాత్రం తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. జింకలు, అడవి పందులు ఆహారం కోసం జనారణ్యంలోకి వస్తుండడంతో వాటిని వెతుక్కుంటూ చిరుతలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో కనిపించిన మనుషులు, లేగ దూడలు, గొర్రెలపై దాడి చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలపై కేసులు నమోదు చేసుకుంటున్న అటవీశాఖాధికారులు.. బాధితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో మాత్రం నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. అయితే.. ఆత్మరక్షణ కోసం ప్రజలు.. వన్యప్రాణులను హతమారిస్తే మాత్రం వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసులు బనాయించి నానా తిప్పలు పెడుతున్నారు.
వజ్రకరూరు మండల పరిధిలోని గూళ్యపాళ్యం అటవీప్రాంతం నుంచి వచ్చిన చిరుత ఆ ప్రాంత ప్రజలకు వారం రోజులుగా నిద్రలేకుండా చేస్తోంది. ఈ విషయంపై స్పందించిన ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి జిల్లా కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్, డీఎఫ్‌ఓ రాఘవయ్యతో మాట్లాడి చిరుతను బంధించే ఏర్పాట్లు చేయాలని కోరారు. అయితే.. ఇంత వరకు అటవీశాఖాధికారులు చిరుతను బంధించలేక పోయారు.